భార్య కోసం.. భర్త తిప్పలు


Thu,May 23, 2019 01:51 AM

Revenue officers harassing a former soldier

-మాజీ సైనికుడిని వేధిస్తున్న రెవెన్యూ అధికారులు
-ఏడాదిగా తాసిల్దార్, ఆర్డీవో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఇరవైఏండ్లుగా కబ్జాలో ఉన్నారు.. పాతపాస్ పుస్తకాలు ఉన్నాయి.. పహాణీలోనూ పేరున్నది.. వారసత్వంగా పంచుకున్న భూమిలో పాలివారందరికీ పాస్‌బుక్కులు వచ్చాయి.. రైతుబంధు అందుకొన్నారు.. కానీ, తనకు మాత్రం కొత్త పాస్‌పుస్తకం రాలేదని యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మరిపడిగ గ్రామానికి చెందిన మాజీ సైనికుడు వెల్లంకి దేవేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరిపడిగ రెవెన్యూ పరిధిలో దేవేందర్‌రెడ్డి భార్య పేరు శారద పేరుమీద సర్వేనంబర్ 137లో 2.20 ఎకరాలు, 136లో 15 గుంటల భూమి ఉన్నది. ఈ భూమిని తన బంధువులు వెల్లంకి పూలమ్మ, వెల్లంకి బలరామ్‌రెడ్డి నుంచి 1999లో కొనుగోలు చేశారు. ఈ భూమిపై 20 ఏండ్లుగా శారదారెడ్డి కబ్జాలో ఉండగా.. ఆమె పేరుమీద పాస్‌పుస్తకం, 1 బీ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం భూ ప్రక్షాళనలో భాగంగా జారీచేసిన పాస్‌పుస్తకాలు తమ తోటి పాలిభాగస్వాములందరికీ వచ్చాయి. రైతుబంధు కూడా అందుకొన్నారు. కానీ తనభార్య శారదారెడ్డి పేరిట పాస్‌పుస్తకం రాకపోవడంతో దేవేందర్‌రెడ్డి ఏడాదికాలంగా తాసిల్దార్, ఆర్డీవో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

హెచ్చు తగ్గులున్నాయని సాకు

మరిపడిగ గ్రామ రెవెన్యూలో 129, 137, 138, 294 సర్వేనంబర్లలో వెల్లంకి వంశస్థులు, వారి కుటుంబసభ్యుల భూములు ఉన్నాయి. ఈ సర్వేనంబర్లలో కుటుంబసభ్యుల భాగ పంపిణీలో భూమి హెచ్చుతగ్గులు ఉన్నందున పాస్‌పుస్తకాల జారీని నిలిపివేయాలంటూ వారి కుటుంబసభ్యుల్లో ఇద్దరు తాసిల్ కార్యాలయంలో ఫిర్యాదుచేశారని తాసిల్దార్ చెప్తున్నారు. ఈ కారణంగానే ఆయా సర్వే నంబర్లలో ఉన్న భూములను పార్ట్ బీలో ఉంచి పాస్‌పుస్తకాలు జారీచేయలేదని ఆయన పేర్కొంటున్నారు. అయితే, ఆ సర్వేనంబర్లలో ఎవరికీ పాస్‌పుస్తకాలు జారీచేయలేదని చెప్పడం పూర్తిగా అబద్ధమని నమస్తే తెలంగాణ ప్రతినిధి సర్వేలో తేలింది. శారదారెడ్డి భూములకు పక్కనే ఉన్న వెల్లంకి పురుషోత్తమ్‌రెడ్డి (పాస్‌బుక్ నం టీ.23050050368), వెల్లంకి రత్నమాల (టీ 28050050111), వెల్లంకి దేవేందర్‌రెడ్డి (టీ 23050050082), వెల్లంకి నీరజ, వెల్లంకి సోమ నర్సింహారెడ్డి, వెల్లంకి విజయ, వెల్లంకి శశిధర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డికి పాస్‌పుస్తకాలు జారీ అయ్యాయి. వారంతా రైతుబంధు సొమ్ముకూడా అందుకొన్నారు. ఇంతమందికి పాస్‌పుస్తకాలు జారీఅయినప్పుడు ఒక్క శారదకు సంబంధించే డిజిటల్ సంతకం ఎందుకుకాలేదో తాసిల్దార్‌కే తెలియాలని దేవేందర్‌రెడ్డి
ఆరోపిస్తున్నారు.

కలెక్టరమ్మ వచ్చి ఇస్తదా?

తన భూమికి పాస్‌పుస్తకాల కోసం తిరిగి తిరిగి వేసారి జనగామ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశానని, అప్పటినుంచి తాసిల్దార్ తనపై కక్ష గట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని దేవేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్‌కు ఫిర్యాదుచేస్తే ఆమె వచ్చి మీ పని చేస్తదా.. మీరు వచ్చి నన్ను ఇలాగే నిలదీస్తే మీపై కేసులు పెట్టిస్తా సమస్య పరిష్కారం కాదు.. అంటూ బెదిరిస్తున్నదని వివరించారు.

పాస్ పుస్తకాలు ఆపింది వాస్తవం

మండలంలోని మరిపడిగ గ్రామ రెవెన్యూలో 129, 137, 138, 294 సర్వేనంబర్లలో వెల్లంకి వంశస్థులు, వారి కుటుంబసభ్యుల భూములు ఉన్నాయి. భాగపంపణీలో తేడాలున్నాయని, ఈ సర్వేనంబర్లలో పాస్‌పుస్తకాల జారీని నిలిపివేయాలంటూ ఆ కుటుంబసభ్యుల్లో ఇద్దరు తాసిల్దార్ ఫిర్యాదు చేశారు. ఆ కారణంగా ఈ నంబర్లలో ఉన్న భూములను పార్ట్ బీ లో ఉంచి పాస్‌పుస్తకాలు జారీచేయలేదు. వెల్లంకి శారదారెడ్డికి 137 సర్వేనంబర్‌లో 2.20 ఎకరాలు కూడా అందులోనే ఉండటంతో పాస్‌బుక్ జారీ చేయలేదు. ఆ సర్వేనంబర్‌కు సంబంధించిన భూమిలో డిజిటల్ సంతకాలు పూర్తికాలేదు. ఈ సర్వేనంబర్లలో సమస్యలు పరిష్కరించుకునేందుకు వెల్లంకి కుటుంబ సభ్యులకు మెమోలు జారీచేసి కుటుంబసభ్యుల సమక్షంలో, సివిల్‌కోర్టులో సమస్య పరిష్కరించుకోవాలని సూచించాం.
- తాసిల్దార్ గంగాభవానీ

1288
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles