తిప్పించుకు తిరుగువారు


Thu,May 16, 2019 02:54 AM

Revenue Officer who is turning a woman farmer For Land Registration

- నేను చాలా బిజీ..!
-ఉన్న భూమిని తొలిగించారు
-సవరించమంటే తీరిక లేదంటారు
-అడ్డగోలుగా తప్పులు చేస్తారు
-లంచాల కోసం వేధిస్తారు
-అందినకాడికి దండుకుంటారు
-రెవెన్యూ శాఖకు చెలగాటం
-అన్నదాతకు ప్రాణసంకటం
-ఘట్‌కేసర్‌లో మహిళా రైతును తిప్పించుకుంటున్న రెవెన్యూ అధికారి

కంచే చేనుమేయడమంటే.. రెవెన్యూ అధికారులను చూసి తెలుసుకోవచ్చు. రాష్ట్రంలో ఉన్న భూములను రక్షించాల్సిన అధికారులు.. భూముల నిర్వహణనే అస్తవ్యస్తంగా మార్చేసి పరిష్కారానికి సైతం సాధ్యంకాని విధంగా జటిలం చేశారు. వాళ్ల లీలలు అన్నీ ఇన్నీ కావు. రైతులకు వాస్తవంగా ఉన్న భూమిని తక్కువ రాస్తారు.. లేకుంటే వేరేవాళ్ల పేరిట మార్పిడిచేస్తారు.. ఇంకా తెగిస్తే అసలు సర్వే నంబర్లే లేకుండా చేస్తారు.. రికార్డులను సవరించాలని వచ్చినవారిని పదుల సార్లు తిప్పించుకొంటారు. తాము చేసిన తప్పును సవరించడానికి బాధితుల నుంచి అందినకాడికి సొమ్ములు గుంజుకుంటారు.. ఇందుకు ఉదాహరణలు తెలంగాణలోని ప్రతి పల్లెలో కనిపిస్తాయి. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కట్కూరులో ఇద్దరు సోదరులకు వచ్చిన వారసత్వ భూమిని ఇతరులకు పట్టాచేశారు. ఇదేమని అడిగితే లక్ష రూపాయలు ఇస్తే రికార్డులు సవరిస్తామని చెప్పారు. వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం చాకలిపల్లి గ్రామంలో ఓ మాజీ సైనికుడి భార్యకు చెందిన భూమిలో ఓ సర్వే నంబర్‌నే తొలిగించారు. ఇదేమంటే.. రేపుమాపంటూ సతాయిస్తున్నారు. ఇక సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఓ రైతు భూ రికార్డులను రైతుకు తెలియకుండానే సవరించారు. పదెకరాల ఆసామిని రెండెకరాల సన్నకారు రైతుగా మార్చేశారు. నిజామాబాద్ జిల్లాలోనూ ఎడవల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో రైతు భూమిని రికార్డుల్లో తగ్గించేశారు. రికార్డులను సవరించడానికి అధికారులకు తీరిక చిక్కడంలేదు. మేడ్చల్‌జిల్లా ఘట్‌కేసర్ మండలం అంకుశాపూర్‌లో మహిళా రైతును రెవెన్యూ అధికారులు తిప్పించుకున్నంతగా ఎవరూ తిప్పించుకోలేదేమో..

ఘట్‌కేసర్: హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌కు చెందిన కే స్వప్నకు ఘట్‌కేసర్ మండలం అంకుశాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్లు 271 ఇ, 272 ఈ, 273 ఈ లో మొత్తం 2.13 ఎకరాల ఉన్నది. ఈ భూమి స్వప్నకు ఆమె తండ్రి ఎం బుచ్చిరెడ్డి 2003లో గిఫ్ట్‌డీడ్ చేశారు. తర్వాత సర్వే చేయించుకుని హద్దు రాళ్లు నాటించుకొని పొజిషన్‌లో ఉండి వ్యవసాయం చేస్తున్నారు. 2004లో పట్టాదారు పాస్‌బుక్, టైటిల్‌డీడ్‌ను తాసిల్దార్ కార్యాలయం నుంచి పొందారు. అప్పటి నుండి ఆ భూమిలోనే స్వప్న కాస్తులో ఉన్నది. 2018లో కొత్త పాస్‌బుక్‌లు మంజూరు చేయడానికి అధికారులు వన్ బీ ఫారం ఇచ్చారు. అందులో భూమి వివరాలు సరిగ్గానే ఉన్నాయి. తీరా కొత్తపాస్‌బుక్ వచ్చేసరికి అందులో ఏకంగా 17 గుంటల భూమి మాయమైంది. కొత్త పాస్‌బుక్‌లో రైతుకు గల సర్వేనంబర్ 271ఇ లో ఏడు గుంటలు, 273 ఈ లో గల పది గుంటల భూమిని అధికారులు నమోదు చేయలేదు.

చిక్కరు.. దొరుకరు..

కొత్త పాస్‌బుక్‌లో తన భూమి తగ్గిపోవడంపై అడగడానికి వెళ్లిన రైతు స్వప్నకు రెవెన్యూ అధికారులు చుక్కలుచూపించారు. మొదటిసారి కలిసినప్పుడు ఇప్పుడు కుదరదు దరఖాస్తు పెట్టి కొద్ది రోజుల తర్వాత కలువండని వీఆర్వో పంపించారు. కొన్ని రోజుల తర్వాత కలిస్తే ఇప్పుడు బీజీయని ముక్తసరిగా జవాబిచ్చారు. మరికొన్ని రోజుల తర్వాత కలిస్తే మీ భూమిపై పక్కవాళ్లు అభ్యంతరం చెప్తున్నారన్నారు. ఎవరు చెప్పారో.. లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఏమైనా ఉందా అని అడిగితే.. మీ పక్కవాళ్లను వెంటపెట్టుకురమ్మంటూ పంపించారు. తన భూమికి పక్కనున్న రైతులను తీసుకొని వెళ్లి.. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, స్వప్నకు ఉన్న భూమిని రికార్డుల్లో రాయమని వారితో చెప్పిస్తే.. సరే మంచిది.. ఇప్పుడు బిజీగా ఉన్నా.. కొద్దిరోజుల తర్వాత రమ్మని మళ్లీ వెనక్కి పంపించారు. ఇంకా ఓపిక చావని ఆ మహిళా రైతు.. కొద్దిరోజుల తర్వాత వెళ్లి ఆ అధికారిని కలిస్తే.. మీ భూమి విషయంలో పూర్వపు రికార్డులు సరిపోవడంలేదని.. మీతోపాటు పక్కనున్న రైతుల భూమి నుంచి కూడా కొంత భూమిని తొలిగిస్తున్నామని చావుకబురు చల్లగా చెప్పారు. ఇదేంటి సార్ ఇలా మాట్లాడుతున్నారని ఆ మహిళా రైతు అడిగితే.. సీఎం సార్ భూ ప్రక్షాళన చేయమన్నరు కదా..

భూ ప్రక్షాళనలో మీకు 9 గుంటలు తక్కువ వస్తుంది. మిగతాది ఒక సర్వే నంబర్‌లో ఏడు గుంటలు రికార్డుల్లో ఎక్కిస్తానని హామీ ఇచ్చారు. ఏడాది కాలంగా తిప్పించుకొని ఇప్పుడిలా మాట్లాడుతున్నారేమిటని ప్రశ్నిస్తే.. మీతోపాటు మీ పక్కనున్న రైతులతో సర్వే చేయించడం కోసం చలానా కట్టిరమ్మని సలహా ఇచ్చారు. దానికీ సరేనంటూ.. రైతులందరితో కలిసి చలానా కడితే.. సర్వేయర్‌కు తీరిక దొరకదు. పదిహేనురోజుల తర్వాత కలువమంటారు. చివరకు భూ రికార్డుల పట్ల బాగా అవగాహన ఉన్న వ్యక్తిని వీఆర్వో దగ్గరకు తీసుకెళ్లి పూసగుచ్చినట్లు వివరంగా చెప్తే.. ఓహో అలాగా.. వీరు మొదట చెప్పలేదు.. ఇప్పుడర్థమైంది అన్నారు. ఇప్పుడైనా చేస్తారా సార్ అని అడిగితే.. మేడం (మహిళా తాసిల్దార్) లేరు. మేడంతో మాట్లాడి చేస్తానని మళ్లీ దాటవేత ప్రదర్శించారు. ఇలా నమోదు కాని తన భూమి విషయంలో మహిళారైతు స్వప్న మండల రెవెన్యూ కార్యాలయం చుట్టూ సంవత్సర కాలంలో 20 సార్లకు పైగా తిరిగినట్టు తెలిపారు. అధికారులకు ఉన్న అభ్యంతరాలన్నీ నివృత్తిచేసినా పాస్‌బుక్ మంజూరు చేయకుండా కర్ర విరుగదు, పాము చావదన్న చందాన సమస్యను పొడిగిస్తూ.. వెళ్లినప్పుడల్లా కొత్త సమస్యలు సృష్టిస్తూ భూ యాజమానులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తనకు రికార్డుల్లో ఎక్కని 17 గుంటలతో కలిపి 2.13 ఎకరాల భూమిని నమోదు చేసి కొత్త పాస్‌బుక్ మంజూరు చేయాలని కొరారు.

సమస్య పరిష్కరిస్తా

గ్రామంలోని కే స్వప్నకు చెందిన భూమిలో కొంత పూర్వపు రికార్డుల్లో రావడం లేదు. కొంత భూమి ప్లాట్లు అయ్యాయి. 271 ఇ సర్వే నంబర్‌లోని ఏడు గుంటల భూమిని రికార్డుల్లో రాస్తున్నా. మిగతా భూమి విషయంలో కొంత సందిగ్ధత నెలకొని ఉన్నది. విచారణ పూర్తయినాక సమస్య పరిష్కరిస్తా
- వెంకటస్వామి, అంకుశాపూర్ వీఆర్వో

4282
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles