మ్యుటేషన్ కోసం.. ముప్పుతిప్పలు


Thu,May 16, 2019 02:34 AM

revenu officers neglects for mutation

-30 నెలలుగా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
-కూతురుకి భూమి గిఫ్ట్ డీడ్‌చేసి కాళ్లరిగేలా తిరుగుతున్న వైనం
-పట్టించుకోని రెవెన్యూ అధికారులు
-ధర్మగంటను ఆశ్రయించిన సిరిసిల్ల జిల్లా నేరెళ్ల రైతు భీంరావు

సిరిసిల్ల రూరల్: మ్యుటేషన్ కోసం రెవెన్యూ అధికారులు ముప్పుతిప్పలు పెడుతున్నారని ఉమ్మడి సిరిసిల్ల మండలంలోని నేరెళ్ల గ్రామానికి చెందిన రైతు భీంరావు ఆవేదన వ్యక్తంచేశారు. తన భూమిని తన బిడ్డపేరిటకు మార్చాలని కోరుతూ మ్యుటేషన్ కోసం 30 నెలల తిరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. చివరకు నమస్తే తెలంగాణ ధర్మగంటను ఆశ్రయించి తన గోడు వెల్లబోసుకున్నాడు. బాధితుడి కథనం ప్రకారం.. తంగళ్లపల్లి మండలం నేరెళ్లకు చెందిన తాండ్ర భీంరావుకు సర్వే నంబర్ 62అ/బిలో 2.065 ఎకరాలు, 28ఇ/1లో 10 గుంటలు, 42/1లో 6.050 గుంటలు, 57/5లో 17 గుంటలు, 58/4లో 2. 25 గుంటలు, 529/1లో 0.0450 గుంటలు, 675అ/1లో 0.0450 గుంటలు మొత్తం 3.34 ఎకరాల పట్టా భూమి ఉన్నది. అందులో నుంచి సర్వేనంబర్ 62అ/బి లో ఉన్న 2.065 ఎకరాల భూమిని తన కూతురు తాండ్ర జ్యోతికి గిఫ్ట్‌గా రాసిచ్చాడు.

ఈ మేరకు ఆ గిఫ్ట్ డీడ్‌ను 2016 అక్టోబర్ ఒకటిన రిజిస్టర్ చేయించాడు. అనంతరం భూమిని మ్యుటేషన్ చేయాలని కోరుతూ 2016 డిసెంబర్ 21న మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకుని తాసిల్దార్ కార్యాలయంలో అందజేశాడు. నాటినుంచి అధికారులెవరూ పట్టించుకోవడం లేదని భీంరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మ్యుటేషన్ కోసం అనేక కొర్రీలు పెడుగూ ముప్పుతిప్పలు పెడుతున్నారని వాపోతున్నాడు. 50 ఏండ్ల్లుగా భూమిలో తానే కాస్తులో ఉన్నానని, నకిలీ పత్రాలు సృష్టించి కొందరు తన భూమి లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారని, వారికే రెవెన్యూ అధికారుల వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా భూమిని తన కూతురి పేరిటకు మార్చాలని విజ్ఞప్తిచేస్తున్నాడు.

కలెక్టర్ పరిశీలనలో ఉంది: తాసిల్దార్ రాంరెడ్డి

ఇదే విషయమై తంగళ్లపల్లి తాసిల్దార్ రాంరెడ్డిని నమస్తే తెలంగాణ సంప్రదించగా సిరిసిల్ల ఉమ్మడి మండలం ఉన్నప్పుడే మ్యుటేషన్ కోసం భీంరావు దరఖాస్తు చేసుకున్నారు. ఆయన పేరిట 2018లోనూ పాస్‌బుక్ వచ్చింది. అయితే గతంలోనే భీంరావు ఆ భూమి అమ్ముకున్నాడని ఫిర్యాదుఅందింది. అందువల్లే మ్యుటేషన్‌ను పెండింగ్‌లో పెట్టాం. ఈ విషయమై గ్రామంలో విచారణ జరిపి పూర్తి నివేదికను కలెక్టర్‌కు అందించాం. ప్రస్తుతం అది కలెక్టర్ పరిశీలనలోనే ఉంది అని తెలిపారు.

228
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles