రిటైర్డ్ సార్జెంట్‌కు తిప్పలు


Wed,June 19, 2019 02:11 AM

Retired Jawan suffering Revenue Officers Neglect For Land Registration

-ఆర్మీ కోటాలో అధికారులే ఇచ్చిన భూమి వివాదంలోకి
-భిన్న వాదనలు.. వేర్వేరు నివేదికలు
-అయోమయంలో ఆదిలాబాద్ జిల్లా తాంసి తాసిల్ యంత్రాంగం
-తనకు భూమి పట్టాచేయాలని రిటైర్డ్ జవాను వేడుకోలు

భారత వాయుసేనలో 18 ఏండ్లపాటు నిర్విరామ సేవలందించిన రిటైర్డ్ సార్జెంటుకు రిక్వెస్టు మేరకు బెనిఫిట్ పథకం కింద ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం పాలొడి గ్రామ శివారులో ఐదెకరాల భూమిని అసైన్డ్‌చేసింది. ఆ భూమిలో రెండు బోర్లు వేయించి, చుట్టూ ట్రెంచ్ తవ్వించి గతేడాది నుంచి సాగుచేస్తున్నారు. ఉన్నట్టుండి కొందరు వచ్చి ఆ భూమి తమదేనని, ప్రభుత్వం తమకు ఇచ్చిందని ఫిర్యాదుచేశారు. గతంలో ప్రభుత్వం పలు దఫాలుగా నిరుపేదలకు భూపంపిణీ చేసింది. ఈ క్రమంలో ఏడో రౌండ్ భూపంపిణీలో ప్రభుత్వం నుంచి అసైన్డ్ పొందిన రైతులు ఈ భూమి తమదేనంటూ ఫిర్యాదుచేయడంతో రిటైర్డ్ జవానుకు పాస్‌పుస్తకాన్నివ్వడం నిలిపివేశారు. అప్పట్లో అన్నీ పరిశీలనల అనంతరమే రిటైర్డ్ జవానుకు భూమి ఇచ్చిన అధికారులు.. ఇప్పుడు అయోమయంలో పడ్డారు.
Abhay

పర్యవసానంగా సదరు రిటైర్డ్ సైనికుడికి తిప్పలు మొదలయ్యాయి.

భీంపూర్: ఆదిలాబాద్ పట్టణంలో నివాసం ఉండే లుందే అభయ్‌కుమార్ 1993లో భారత ఎయిర్‌ఫోర్స్‌లో చేరి 18 ఏండ్లు సేవచేసి 2011లో పదవీవిరమణ పొందారు. రిటైర్డ్ ఆర్మీ జవాను కోటాలో జీవనోపాధి బెనిఫిట్ పథకం కింద తాంసి మండలం పాలొడి గ్రామ శివారులోని 150.33 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అసైన్డ్ భూమిలో నుంచి సర్వే నంబర్ 102 (పట్టా నంబర్ కాదు- పార్టిషన్ నంబర్)లో ఐదెకరాలు కేటాయిస్తూ అధికారులు ప్రొసీడింగ్ ఇచ్చారు. 12-02-2018న ల్యాండ్ రికార్డ్ సర్వేశాఖ అధికారులు అభయ్‌కుమార్‌కు కేటాయించిన భూమి పొజిషన్‌కు సంబంధించి మ్యాపులో స్థలం చూపించారు. తాంసి తాసిల్ అధికారులు సర్వేచేసి ఆ భూమిని చూపించారు. ఈ మేరకు బీ/979/2015, తేదీ 12-06-2018న ప్రొసీడింగ్‌ను మండల మెజిస్ట్రేట్ అయిన తాసిల్దార్ జారీచేశారు. దీంతో లబ్ధిదారు అభయ్‌కుమార్ ఆ భూమిలో సాగు మొదలుపెట్టారు. తర్వాత పట్టాదారు పాస్‌పుస్తకం కోసం దరఖాస్తుచేశారు. కానీ ఈ భూమి తమకు చెందినదంటూ ఇద్దరు వ్యక్తులు ఫిర్యాదుచేయడంతో ప్రస్తుతానికి పాస్‌పుస్తకం ఇవ్వలేమని అధికారులు తేల్చిచెప్పారు. దీంతో బాధితుడు ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వ అధికారులే సర్వేచేసి.. ఇచ్చిన భూమి ఇతరులది ఎలా అవుతుందన్న సందేహంతో వాస్తవ సమాచారంకోసం సమాచారహక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకొన్నారు. పాలొడి గ్రామానికే చెందిన ఇద్దరు రైతులు 2018, సెప్టెంబర్ 18న ఆ భూమి తమదేనంటూ తాంసి తాసిల్దార్‌కు ఫిర్యాదుచేసినట్టు తేలింది. కాస్తులోనూ ఈ రైతులు పంటలు వేసినట్టుగా పహాణీ అడంగళ్‌లో నమోదైంది. ఒకవేళ ఏడోరౌండ్ భూపంపిణీలో ఈ భూమి ముందే కేటాయింపు అయినట్టయితే.. అదే భూమిని రిటైర్డ్ జవాను కోటా కింద తనకెందుకు ఇచ్చినట్టని ప్రశ్నిస్తున్నారు.

భూమి ప్రస్తుత పరిస్థితి

ఏడో రౌండ్ భూపంపిణీలో భూమి పొందిన రైతులంతా వేరే పొజిషన్‌లో సాగుచేసుకుంటున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం అభయ్‌కుమార్ ఐదెకరాల్లో వానకలం పనులు పూర్తిచేసుకొని విత్తనాలు వేయడానికి సిద్ధమవుతున్నారు. ఫిర్యాదుదారులు ఎప్పుడూ తమ వ్యవసాయ పనులకు అడ్డురాలేదని వారి అసైన్డ్ భూముల్లో వారు సాగుచేసుకుంటున్నారని అభయ్‌కుమార్ చెప్తున్నారు. ఒకే సమయంలో భిన్నమైన వాదనలతో నివేదికలిస్తూ అధికారులు గందరగోళం చేస్తున్నారంటున్నారు. ఈ భూమిని తనకు పట్టాచేయడం కుదరదని చెప్తే, తనకు రావాల్సిన భూమికోసం మరోసారి దరఖాస్తు పెట్టుకుంటానని విన్నవించుకుంటున్నారు. ఒకవేళ వివాదం లేదనుకుంటే తనకు కేటాయించిన ఐదెకరాల భూమికి పాస్‌పుస్తకం ఇవ్వాలని కోరుతున్నారు.

న్యాయం చేస్తాం


వసంత, తాసిల్దార్, తాంసి

మండల సర్వేయర్‌తో సర్వేచేయిస్తాం. వాస్తవ పరిస్థితి తెలుసుకుంటాం. ఇతర అసైన్డ్ రైతులకు ఇటు రిటైర్డ్ వాయుసేన సార్జెంట్‌కు న్యాయం జరిగేలా చూస్తాం. అసైన్డ్ లబ్ధిదారులైన రైతులు ఏటా సాగుచేస్తేనే మంచిది. అ ప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉండదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కేటాయించిన భూమికి సంబంధించి పట్టా అందించే ప్రయత్నంచేస్తాం.



రీసర్వేచేసి అధికారులకు నివేదిస్తాం

రిటైర్డు ఆర్మీ జవానుకు ప్రభుత్వ ఆదేశాల అనుసారం భూమి కేటాయించాల్సిందే. ఏడోరౌండ్ భూపంపిణీ అనేది పాత స్టాఫ్ హయాంలో జరిగింది. కొంత అయోమయం ఉన్న విషయం వాస్తవమే. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మళ్లీ ఎంసీతో సర్వేచేస్తున్నాం. సర్వేయర్ల కొరత ఉన్నది. సర్వేతో తాజాగా పొజిషన్‌లో ఉన్నవారు తెలిసిపోతారు. అప్పుడు నివేదిక రూపొందించి అధికారులకు ఇస్తాం. 150 ఎకరాలకుపైగా విస్తీర్ణం ఉన్న ఈ ప్రభుత్వ భూమిలో ఇంకా మిగులు భూమి ఉంటుంది. కాబట్టి అందరికీ న్యాయం జరుగుతుంది.
- ప్రేంనివాస్, డిప్యూటీ తాసిల్దార్, తాంసి

నాక్కూడా కన్ఫ్యూజ్‌గానే ఉన్నది

నిజానికి ఈ భూమి విషయంలో నాకు కూడా అయోమయంగానే ఉన్నది. ఏడో విడుత భూపంపిణీ కాలంలో నేను ఇక్కడ లేను. క్షేత్రస్థాయి పరిస్థితి అధికారులకు విన్నవించాం. పరిశీలించి చర్య తీసుకుంటారు.
- అజయ్‌కుమార్, వీఆర్వో, పాలొడి

527
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles