తెలంగాణకు కృష్ణమ్మ వెలుగులు


Thu,September 12, 2019 02:49 AM

reservoirs overflowing with flood water

-వరదనీటితో పొంగిపొర్లుతున్న రిజర్వాయర్లు
-గరిష్ఠస్థాయిలో జలవిద్యుత్ ఉత్పత్తి
-గత ఐదేండ్లలో ఇదే అత్యధికం
-ఇప్పటికే 1044 మి.యూ. ఉత్పత్తి
-విద్యుత్ సంస్థలకు తగ్గుతున్న భారం
-రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో 25% తీరుస్తున్న కృష్ణమ్మ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కృష్ణానదికి వచ్చిన వరద తెలంగాణకు సాగునీటితోపాటు జలవిద్యుత్ ఉత్పత్తికికూడా గరిష్ఠంగా ఉపయోగపడుతున్నది. గడిచిన ఐదేండ్లలో ఎన్నడూ రానంతగా వరద, అందులోనూ ఒకే సీజన్‌లో రెండుసార్లు రావడంపై విద్యుత్‌వర్గాలు హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నాయి. గతంలో ఎన్నడూ ఈ విధమైన వరద రాకపోవటంతో పూర్తిస్థాయిలో జలవిద్యుత్ ఉత్పత్తి సాధ్యంకాలేదు. కానీ ఈ వర్షాకాలంలో కృష్ణానది పరివాహక ప్రాంతమైన కర్ణాటక, మహారాష్ట్రల్లో భారీవర్షాలు కురవటంతో స్వల్ప సమయంలోనే రెండోసారి కృష్ణానదికి వరదలు పొంగిపొర్లుతున్నాయి. తెలంగాణ పరిధిలో కృష్ణానదిపై ఉన్న మొత్తం ప్రాజెక్టుల నుంచి భారీగా వరదనీటిని కిందకు వదులుతుండటంతో జలవిద్యుత్ ఉత్పత్తికి గరిష్ఠంగా అవకాశం ఏర్పడింది. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్న తెలంగాణ జెన్‌కో.. కృష్ణానదిపై ఉన్న అన్ని యూనిట్లను గరిష్ఠంగా నడిపిస్తూ.. వీలైనంత జలవిద్యుత్‌ను రాష్ట్ర అవసరాలకు అందిస్తున్నది. ఇలా ఇప్పటికే 1044 మిలియన్ యూనిట్ల జలవిద్యుత్ మన రాష్ట్ర అవసరాలకు ఉపయోగపడటం గమనార్హం.

రాష్ట్ర అవసరాల్లో 25% వరకు

రాష్ట్రంలో రోజూ దాదాపు 200 మిలియన్ యూనిట్ల వరకు గరిష్ఠ విద్యుత్ వినియోగం ఉంటున్నది. మంగళవారం గరిష్ఠంగా 205 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను రాష్ట్ర అవసరాలకు వినియోగించారు. ఇందులో జలవిద్యుత్ భాగస్వామ్యం సుమారు 25 శాతం వరకు ఉండటం విశేషం. ఎగువన జూరాల మొదలుకుని.. దిగువన పులిచింతల వరకు మొత్తం యూనిట్ల ద్వారా జలవిద్యుత్ ఉత్పత్తిని చేపట్టడంతో సగటున రోజుకు 45 నుంచి 50 మిలియన్ యూనిట్ల వరకు మనకు జలవిద్యుత్తు అందివస్తున్నది. రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడంలో ఈసారి కృష్ణమ్మ తన వంతు భాగస్వామ్యాన్ని అందిస్తున్నదని జెన్‌కో డైరెక్టర్ (హైడల్) వెంకట్రాజం ఆనందం వ్యక్తంచేశారు.

ఐదేండ్లలో..

తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత నాలుగేండ్లలో జలవిద్యుత్ అంతంత మాత్రంగానే ఉత్పత్తి అయింది. ఈ ఏడాది 1044 మిలియన్ యూనిట్లకుపైగా జలవిద్యుత్ అందిరావడంపై అధికారులు హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు. గడిచిన ఐదేండ్లలో గరిష్ఠంగా ఈ సీజన్‌లోనే జలవిద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సీజన్‌లో బుధవారం వరకు పరిశీలిస్తే.. గతంలో ఏ సంవత్సరంలోనూ లేనంత స్థాయిలో తెలంగాణ పరిధిలో కృష్ణపై ఉన్న అన్ని రిజర్వాయర్లు పొంగిపొర్లుతున్నాయి. చాలారోజులవరకు జలవిద్యుత్ ఉత్పతికి అవకాశం ఉన్నది. పైగా కృష్ణానదిపై ఉన్న మొత్తం 32 యూనిట్ల ద్వారా జలవిద్యుత్ ఉత్పత్తి జరుగుతుండటం గమనార్హం. రాష్ట్రంలో మొత్తం 40 జలవిద్యుత్ ఉత్పత్తి యూనిట్లు ఉండగా.. గరిష్ఠంగా 2441 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నది.గోదావరిపై ఉన్న పోచంపాడులోని యూనిట్ల ద్వారా నామమాత్రంగా ఉత్పత్తి అవుతున్నది. నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టులు వట్టిపోతుండటంతో ఎలాంటి జలవిద్యుత్‌కు అవకాశం లేదు. కృష్ణానదికి రెండుసార్లు వచ్చిన వరదతో నదిపై ఉన్న మొత్తం 32 యూనిట్ల ద్వారా జలవిద్యుత్ ఉత్పత్తి అవుతున్నది.

PRABHAKARRAO

కొంత ఆర్థికభారాన్ని తగ్గిస్తున్న కృష్ణమ్మ

గతంలో ఎన్నడూ లేనివిధంగా కృష్ణానదికి వరదలు పోటెత్తుతున్నాయి. ఇది మన వ్యవసాయరంగంతోపాటు విద్యుత్‌రంగానికి ఎంతగానో మేలుచేస్తున్నది. స్వల్ప సమయంలో రెండుసార్లు వరద రావడంతో కృష్ణానదిపై ఉన్న మొత్తం 32 యూనిట్ల ద్వారా జలవిద్యుత్ ఉత్పత్తి అవుతున్నది. ఇది చాలా సంతోషించాల్సిన అంశం. గడిచిన ఐదేండ్లలో ఈ సీజన్‌లో జలవిద్యుత్ ఉత్పత్తి గరిష్ఠంగా ఉండే అవకాశం ఉన్నది. థర్మల్‌తో పోల్చుకుంటే జలవిద్యుత్ చవక. ఇప్పుడు జలవిద్యుత్ మనకు అందిరావడంతో విద్యుత్ సంస్థలపై భారం కృష్ణానది పుణ్యమాని తగ్గుతున్నదనే చెప్పవచ్చు. కృష్ణానదికి వరద రాకపోయి ఉంటే మన అవసరాల మేరకు సగటున యూనిట్‌కు రూ.4 వరకు ఖర్చుపెట్టాల్సివచ్చేది. అదే జలవిద్యుత్ అయితే రూ.2.50 పైసల వరకే ఉండనుంది. అందుకే ఈ సీజన్‌లో కృష్ణకు వచ్చిన వరద మన విద్యుత్ సంస్థకు లాభం చేసిందనే చెప్పవచ్చు. ఇది శుభపరిణామంకూడా.
- దేవులపల్లి ప్రభాకర్‌రావు
ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ


krishna-river

144
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles