పట్టాభూమి కరిగింది!


Wed,May 15, 2019 03:18 AM

removed land from records

-అప్పుడో ఎకరం పాయె.. ఇప్పుడో ఎకరం పాయె
-రెవెన్యూ టచ్!
-కొన్న భూమిని రికార్డుల్లోకి ఎక్కించడంలో జాప్యం
-రికార్డుల ప్రక్షాళనలో దరఖాస్తు చేస్తే ఉన్న భూమి రికార్డుల నుంచి తొలిగింపు
-పాస్‌బుక్‌లో నమోదుకు సర్వే వంక
-సర్వే చేయాలని మొత్తుకున్నా జాప్యం
-ఖమ్మం రూరల్ మండలం అధికారుల చెలగాటం
-ధర్మగంటను ఆశ్రయించిన రైతు సురేశ్‌కుమార్

ఇది రైతుతో రెవెన్యూ అధికారులు ఆడుతున్న చెలగాటం! పక్కా పత్రాలతో కొనుగోలు చేసిన భూమిని రికార్డులోకి ఎక్కించటానికి తీరికలేని అధికారుల లీలలివి! మొదట.. కొనుగోలుచేసిన భూమి మొత్తాన్నీ రికార్డులోకి ఎక్కించలేదు! అదేమంటే.. నీ భూమి ఎక్కడికీ పోదులే అంటూ ఎకసెక్కాలాడారు! భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలోనైనా తన సమస్య తీరుతుందని రైతు భావించి దరఖాస్తు చేసుకుంటే.. ఉన్న భూమిని రికార్డుల నుంచి ఎగురగొట్టారు! అధికారుల చుట్టూ తిరిగితే.. సర్వేనంబర్లలోనే తేడా ఉన్నదంటూ కొత్త మెలిక పెట్టారు! మళ్లీ సర్వే చేయాలన్నారు. అందుకు అంగీకరించినా.. సర్వే చేసేందుకు రావటం లేదు! ఇది ఖమ్మం రూరల్ మండలం మంగళగూడేనికి చెందిన రైతు వ్యథ! ముప్పుతిప్పలు పెడుతున్న అధికారుల చుట్టూ తిరిగి విసిగి వేసారిన రైతు.. ధర్మగంటను ఆశ్రయించారు.

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఖమ్మం జిల్లా రూరల్ మండలం తీర్థాల రెవెన్యూ పరిధిలోని మంగళగూడేనికి చెందిన కడారు సురేశ్‌కుమార్ 2008లో బోజడ్ల వెంకటయ్య వద్ద సర్వేనంబర్ 919లో మూడెకరాల 21 గుంటలు, సర్వేనంబర్ 110లో ఎకరం 27 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ద్వారా కొనుగోలుచేశారు. ఆ భూమిని సురేశ్‌కుమార్ కొలిచి తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఈ రెండు సర్వేనంబర్లలో ఉన్న ఐదెకరాల 8 గుంటల భూమిని సాగు చేసుకుంటున్నారు. ఈ మేరకు విక్రయించిన మేరకు భూమిని బోజడ్ల వెంకటయ్య ఖాతా నుంచి తొలిగించారు. కానీ కొనుగోలుచేసిన కడారు సురేశ్‌కుమార్‌కు పట్టాదార్ పాస్‌పుస్తకంలో మొత్తం భూమిని మాత్రం ఎక్కించలేదు. 919 సర్వేనంబర్‌లో మూడెకరాల 21 గుంటలకుగాను కేవలం రెండెకరాల 15 గుంటల భూమిని మాత్రమే ఎక్కించారు. సర్వేనంబర్ 110లో కొనుగోలుచేసిన ఎకరం 27 గుంటల భూమిని సరిగానే రికార్డులోకి ఎక్కించి పాస్‌పుస్తకంలో నమోదుచేశారు. సర్వేనంబర్ 919లో ఎకరం ఆరుగుంటల భూమిని తక్కువ నమోదుచేశారని, అంతమేరకు పాస్‌పుస్తకంలో నమోదుచేయాలని రైతు ఎన్నిసార్లు కోరినా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. వీఆర్వో, తాసిల్దార్లను ఎప్పుడు కలిసినా నీ భూమి ఎక్కడకు పోతుంది? ఎక్కిస్తాంలే! అని మాటలు చెప్పి పంపించేవారు.

patta-land

ఉన్నదీ ఊడగొట్టారు

తెలంగాణ ప్రభుత్వం 2017లో చేపట్టిన భూమి రికార్డుల ప్రక్షాళనలోనైనా సమస్య పరిష్కారం అవుతుందని ఆశించిన కడారు సురేశ్‌కుమార్‌కు.. ఉన్న భూమి కూడా రికార్డుల్లోంచి ఎగిరిపోయింది. భూ రికార్డుల ప్రక్షాళనలో సర్వేనంబర్ 110లో ఉన్న ఎకరం 27 గుంటల భూమిని కొత్త పట్టాదార్ పాస్‌పుస్తకంలోకి ఎక్కించలేదు. పాత పాస్‌పుస్తకంలో ఎకరం ఆరుగుంటల భూమిని ఎక్కించలేదు. ఇప్పుడైనా కొత్త పాస్‌పుస్తకంలో ఎక్కించమని కోరితే.. మరో ఎకరం 27 గుంటల భూమిని తొలిగించారని సురేశ్‌కుమార్ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. భూమిని రికార్డులోకి ఎక్కించమంటే సర్వేచేయాలంటున్న అధికారులు, రైతు సర్వే కోసం ఫీజు కడితే.. వచ్చి సర్వేచేయకుండా రైతుపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం సర్వేనంబర్‌లో ఆర్‌ఎస్సార్ రికార్డులో ఉన్న భూమి కంటే ఎక్కువగా రికార్డుల్లోకి వచ్చిందని, అందుకే తాము పట్టాదార్ పాస్‌పుస్తకంలోకి ఎక్కించలేదని అధికారులు రైతుకు చెప్పారు. దీంతో కడారు సురేశ్‌కుమార్ తాను కొనుగోలుచేసిన భూమిని మొత్తం సాగుచేసుకుంటున్నానని, తాను ఆనాడు భూమిని కొలిచే రిజిస్టర్ చేసుకున్నానని అధికారులకు వివరించారు.

మొత్తం ఈ సర్వేనంబర్లలోని భూమిని కొలిచి.. ఏ రైతుకు వాస్తవంగా ఎంత భూమి ఉన్నదో తేల్చి, ఆ మేరకు రికార్డులో నమోదుచేసి పాస్ పుస్తకాల్లో ఎక్కించాలని, దీంతో భూమి లేకున్నా పాస్ పుస్తకాల్లో ఎక్కువ భూమిని ఎవరు రాయించుకున్నారో తేలుతుందని సురేశ్‌కుమార్ కోరితే.. అధికారులు రకరకాల మాటలుచెప్పి తప్పించుకుంటున్నారు. వాస్తవంగా ఆర్‌ఎస్సార్ కంటే ఎక్కువ భూమి రికార్డుల్లో ఉన్నదని గుర్తిస్తే అధికారులే స్వయంగా ఆ సర్వేనంబర్‌లోని రైతులందరికీ నోటీసులు ఇచ్చి, సర్వే చేసి, ఎవరికి ఎంత భూమి ఉందో తేల్చి, రికార్డులు సరి చేయాలి. కానీ ఇవేవీ పట్టని అధికారులు రైతులు సాగుచేసుకుంటున్న భూములను ఇష్టంవచ్చినట్లు రికార్డుల నుంచి తొలిగించారు. అదేమని ప్రశ్నించేవారికి మాటలు చెప్పి పంపిస్తున్నారు.


కడారు సురేశ్‌కుమార్

కాలికేస్తే మెడకి.. మెడకేస్తే కాలికి..

కొనుక్కున్న భూమిని రికార్డులోకి ఎక్కించాలని కోరితే అధికారులు ఎక్కించటం లేదు. ఆర్‌ఎస్సార్‌లో ఉన్న విస్తీర్ణం కంటే అక్కడ భూమి ఎక్కువగా ఉందని అందుకే రికార్డులోకి ఎక్కడం లేదని అన్నారు. భూమిని కొలవాలన్నారు. భూమిని సర్వే చేయాలంటే సర్వేకు ఫీజు కూడా కట్టాను. ఫీజు కట్టిన రసీదు చూపిస్తే భూమి అంతా క్లీన్ చేయాలన్నారు. నేను సాగు చేసుకుంటున్న భూమిని క్లీన్ చేయగలను కానీ, ఇతరుల భూమిలోకి నేను ఎలా వెళతాను? అధికారులు కాలికేస్తే.. మెడకేస్తే కాలికి అన్నట్టు వ్యవహరిస్తున్నారు. చివరకు నేను సాగు చేసుకుంటున్న భూమిని కొలిచి అంతమేరకు రికార్డులోకి ఎక్కించాలని కోరినా పట్టించుకోవటం లేదు.
- కడారు సురేశ్‌కుమార్, మంగళగూడెం, ఖమ్మం రూరల్ మండలం, ఖమ్మం జిల్లా

3413
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles