బరిలో బంధుగణం


Sat,January 19, 2019 02:37 AM

Relatives became political opponents

-రసవత్తరంగా పంచాయతీ రాజకీయం.. ప్రత్యర్థులుగా దగ్గరి బంధువులు.. పోటాపోటీగా ప్రచారం
నమస్తే తెలంగాణ నెట్‌వర్క్: పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికరమైన పోటీ ఆవిష్కృతం అవుతున్నది. దగ్గరి బంధువులే ఒకరిపై ఒకరు పోటీకి సై అంటున్నారు. అన్నదమ్ములు, అక్కాచెల్లెలు, బావా బామ్మర్దులు.. ఇలా సమీప బంధువులే రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక గ్రామాల్లో ఇలాంటి సన్నివేశాలు కనిపిస్తున్నాయి.

పోటాపోటీగా వదిన, మరదలు

కరీనగర్ జిల్లా గన్నేరువరం మండలం గునుకులకొండాపూర్ సర్పంచ్ పోరులో వదినామరదళ్లు నిలిచారు. సర్పంచ్ స్థానం బీసీ మహిళ రిజర్వేషన్ రావడంతో మాజీ సర్పంచ్ సుధగోని మల్లేశం తన భార్య రజితను బరిలో నిలుపగా, ఆయన బామ్మర్ది తాళ్లపెల్లి శ్రీనివాస్ తన భార్య లతతో నామినేషన్ వేయించారు. బరిలో మరో ముగ్గురు ఉన్నా వీరిద్దరి పోటీపైనే ఆసక్తి నెలకొన్నది.

బావ, బామ్మర్ది సవాల్

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయి సర్పంచ్ బరిలో బావ, బామ్మర్ది నిలిచారు. టీఆర్‌ఎస్ బలపరచిన దొంగల లక్ష్మీనారాయణపై ఆయ న సొంత బావ లిక్కి వెంకటయ్య పోటీలో నిలిచారు. దీంతో వీరి మధ్య పోటీ ఆసక్తి నెలకొన్నది.

అక్కాచెల్లెళ్ల సై

పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మల్యాలలో సర్పంచ్ పదవి కోసం అక్కాచెల్లెళ్లు పోటీపడుతున్నారు. లంక రాజేశ్వరి, ఆకునూరి పద్మ బరిలో నిలవడంతో ఆసక్తికర పోటీ నెలకొంది. ఎవరికి వారే ప్రచారంలో నిమగ్నమయ్యారు.

బోయినపల్లిలో తల్లీ కూతుళ్లు..

సిరిసిల్ల జిల్లా బోయినపల్లి సర్పంచ్ బరిలో వరుసకు తల్లీకూతుళ్లు బరిలో నిలిచారు. మొత్తం నలుగురు అభ్యర్థులు పోటీ పడుతుండగా సంబ బుచ్చమ్మ, గుంటి లతశ్రీ వరుసకు తల్లీకూతుళ్లు కావడం ఆసక్తిని రేపుతున్నది. బుచ్చమ్మ గతంలో సర్పంచ్‌గా పనిచేశారు.

బరిలో అత్తాకోడళ్లు

నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని పేపర్‌మిల్ పంచాయతీ బరిలో అత్తాకోడళ్లు బరిలో ఉన్నారు. నఫీజ్ సుల్తానా, ఆమె అన్నకూతురు ఫోజియా నాజ్ సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు.

బరిలో ముగ్గురు అన్నదమ్ములు

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో నూతనంగా ఏర్పడిన బసంత్‌నగర్ పంచాయతీలో ముగ్గురు అన్నదమ్ములు పోటీపడుతున్నారు. గ్రామానికి చెందిన సొంత అన్నదమ్ములైన పాత రవీందర్, పాత దేవేందర్‌తోపాటు వారికి వరుసకు సోదరుడయ్యే పాత లింగమూర్తి కూడా నామినేషన్ దాఖలు చేసుకుంటున్నారు. వారి కుటుంబసభ్యులు ఎవరికివారే ప్రచారం చేసుకుంటున్నారు. సర్పంచ్ బరిలో పదిమంది ఉన్నా ఈ ముగ్గురు వ్యాపారుల మధ్య పోటీ గ్రామంలో చర్చనీయాంశమైంది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..: వాంకిడి మండలంలోని ఖిర్డి, సరండి పంచాయతీలకు నిర్వహిస్తున్న ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులుగా అన్నదమ్ములు బరిలో నిలిచారు. ఖిర్డి పంచాయతీలో 18 ఏండ్లుగా అంబారావు కుటుంబం నుంచే సర్పంచ్‌గా ఎన్నికవుతున్నారు. ఈసారి మాజీ సర్పంచ్ అంబారావు బరిలో ఉండగా, ఆయనకు పోటీగా తమ్ముడు గంగారం నామినేషన్ వేశారు. ఖిర్డి నుంచి విడివడి కొత్తగా ఏర్పడిన సరండి గ్రామ పంచాయతీలోనూ ఇదే పరిస్థితి. గ్రామానికి చెందిన దుర్గం తిరుపతి నామినేషన్ వేయగా, ఆయనకు పోటీగా తమ్ముడు దుర్గం కమలాకర్ బరిలో నిలిచారు.
మంచిర్యాల జిల్లాలో..: జన్నారం మండలం ధర్మారం గ్రామంలోనూ అన్నదమ్ములు సర్పంచ్ పదవికి పోటీపడుతున్నారు. గ్రామానికి చెందిన దుర్గం గంగాధర్, దుర్గం చంద్రశేఖర్ ఈసారి పోటాపోటీగా నామినేషన్లు వేశారు. వీరు గతంలోనూ ఇలాగే సర్పంచ్ పదవి కోసం పోటీపడ్డారు. మూడోవక్తి గెలిచారు. దీంతో ఇప్పుడు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు.

అనుముల శ్రీనివాస్‌రెడ్డి వర్సెస్ అనుముల శ్రీనివాస్‌రెడ్డి

నల్లగొండ జిల్లా త్రిపురారం పంచాయతీ పోరులో ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. సర్పంచ్ స్థానానికి పోటీ చేసేందుకు బాబాయ్, కొడుకు సిద్ధమయ్యారు. వారు బంధువులే కాకుండా.. ఇద్దరి పేర్లు కూడా ఒక్కటే కావడం విశేషం. దీంతో స్థానికులు తికమకకు గురవుతున్నారు.
Thirmanam
నిడమనూరు మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ అనుముల శ్రీనివాస్‌రెడ్డి(కొడుకు) పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌పార్టీ తరపున అనుముల శ్రీనివాస్‌రెడ్డి(బాబాయ్) పోటీ చేస్తున్నారు. బాబాయ్‌కి సీనియర్ నాయకుడిగా పేరుండగా, కొడుకుకు తెలంగాణ ఉద్యమకారుడిగా పేరున్నది. దీంతో ఇద్దరూ గెలుపుపై ధీమాగా ఉన్నారు.

భర్త సర్పంచ్, భార్య ఉపసర్పంచ్

జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం గుడుదొడ్డిలో భార్యాభర్తలు సర్పంచ్, ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు. సర్పంచ్ అభ్యర్థిగా హనుమంతురెడ్డి, ఆయన భార్య రాధమ్మ ఒకటో వార్డు సభ్యురాలిగా నామినేషన్ దాఖలు చేశారు. మిగతా ఏడువార్డులకు సైతం ఒక్కొక్కరే నామినేషన్‌వేశారు. దీంతో గ్రామం ఏకగ్రీవమైంది. గ్రామస్థులు ఉప సర్పంచ్‌గా రాధమ్మకు మద్దతు పలికారు.

1206
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles