ఏడెకరాలకు ఏడిపిస్తుండ్రు


Thu,May 16, 2019 02:45 AM

records have been changed if not give bribe

-రూ. లక్ష లంచం ఇవ్వకుంటే రికార్డులు మార్చారు
-అనుభవదారుగా కాంగ్రెస్ నేత సోదరుడు
-ఇప్పుడు కబ్జాలో ఉన్నదీ ఆయనే!
-ముస్లిం మహిళ ఆవేదన ఆలకించని తాసిల్దార్

రూ.లక్ష లంచం ఇవ్వకపోవటంతో రికార్డులు తారుమారుచేశారు. అనుభవదారుగా కాంగ్రెస్ నేత సోదరుడి పేరుచేర్చారు. దాని సాకుగా తీసుకొని భూకబ్జాకు పాల్పడ్డాడు. ఇదేమని ప్రశ్నిస్తే ఎకరాకు రూ.8 లక్షలు ఇస్తానంటూ దబాయిస్తున్నాడు. భూరికార్డుల ప్రక్షాళన సమయంలో ఈ తతంగం జరిగిందని బాధితురాలు వాపోతున్నారు. మెదక్ జిల్లా రేగోడ్ మండలం ఆర్ ఇటిక్యాల గ్రామానికి చెందిన అన్వర్ ఉన్నీసా ఆవేదన ఇది..

హైదరాబాద్,నమస్తే తెలంగాణ: మెదక్ జిల్లా రేగోడ్ మం డలం ఆర్ ఇటిక్యాల గ్రామానికి చెందిన అన్వర్ ఉన్నీసాబేగానికి సర్వే నంబర్ 49లో ఉన్న ఏడెకరాల 11 గుంటల భూమిని భూరికార్డుల ప్రక్షాళనలో రేగోడ్ తాసిల్దార్ రాణాప్రతాప్‌సింగ్ ఏకంగా అన్వర్ ఉన్నీసా బేగం కుమారుడిని పిలిచి నీ భూమి నీకు కావాలంటే రూ.లక్ష ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. రికార్డులన్నీ సక్రమంగా ఉన్నా.. తామెందుకు లంచం ఇవ్వాలని ఆయన ప్రశ్నించడంతో తాసిల్దార్ కన్నెర్రజేశారు. ఈ భూమిని కబ్జా చేయాలని ఎప్పటి నుంచో కన్నేసిన గడిల మాణిక్‌రావు సోదరుడు వెంకట్రావు పేరును అనుభవదారు కాలంలో చేర్చారు. తర్వాత చాలా రోజులపాటు పాస్‌పుస్తకం కూడా ఇవ్వలేదు. అన్వర్ ఉన్నీసాబేగానికి న్యాయం చేయాలని, పాస్‌పుస్తకం ఇవ్వాలని మంత్రి ఆల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సిఫారసు చేసినా సదరు తాసిల్దార్ వినలేదు. అప్పటి జాయింట్ కలెక్టర్ చెప్పినా పెడచెవిన పెట్టాడు. మంత్రితో తానే మాట్లాడుతానని, అన్వర్ ఉన్నీసాబేగానికి ఏమీ చేయలేనని కరాఖండిగా చెప్పినట్టు తెలిసింది. ఎట్టకేలకు అన్వర్ ఉన్నీసాబేగానికి పాస్‌పుస్తకం ఇచ్చారు కానీ, పహణీలోని అనుభవదారు కాలమ్‌లో కబ్జాదారు పేరు నమోదు చేశారు.

2018 వరకు పహాణీలో అన్వర్ ఉన్నీసాబేగం పేరే..

అన్వర్ ఉన్నీసా బేగం 2015 వరకు భూమిని స్వయంగా సాగు చేసుకున్నారు. 2015లో కొడుకు ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌కు వచ్చారు. అప్పటికే ఈ భూమిపై కన్నేసిన గడిల వెంకట్రావు అదను చూసుకొని వీరు హైదరాబాద్‌కు రాగానే కబ్జాచేశారు. ఈ భూమిని ఇతరులకు కౌలుకు ఇవ్వబోతే ఎవ్వరినీ చేయనిచ్చే వారు కాదని, తన కన్నుసన్నల్లో ఉండేలా చూసుకున్నారని బాధితురాలు తెలిపారు. భూరికార్డుల ప్రక్షాళనలో తాసిల్దార్‌ను పట్టుకొని ఏకంగా 7 ఎకరాల 11 గుంటల భూమికి అవకాశం ఉంటే పట్టాదారుగా కూడా రాయించుకొనేవారేమో.. కానీ అవకాశం లేకపోవడంతో అనుభవదారు కాలంలో కొనసాగుతున్నారని చెప్పారు. 2018, మే 28 వరకు పహాణీలో అన్వ ర్ ఉన్నీసాబేగం పేరు పట్టాదారుగా, అనుభవదారుగా ఉన్నారు. ఇది 2018 డిసెంబర్ 14వ తేదీనాటికి అనుభవదారు కాలమ్‌లో గడిల వెంకట్రావు పేరు నమోదైంది. సదరు రెవెన్యూ అధికారి అడిగినంత లంచం ఇవ్వనందుకే తమ భూమిని గడిల వెంకట్రావు పేరును ఎక్కించారని అన్వర్ ఉన్నీసాబేగం ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.


అన్వర్ ఉన్నీసాబేగం

భూకబ్జా చేసి బెదిరిస్తున్నాడు

నా కుమారుడు ఓ చిరుద్యోగి. హైదరాబాద్‌కు బదిలీ కావటంతో అక్కడే ఉంటున్నాం. మా భూమిని గడిల వెంకట్రావు కబ్జా చేశాడు. పైగా మీ భూమి మీకు రాదని బెదిరించాడు. కావాలంటే మొత్తం రూ.8 లక్షలు ఇస్తానని ఒకసారి, మరోసారి రూ. 15 లక్షలు ఇస్తానని, భూమి మాత్రం ఇవ్వనన్నాడు.. తాసిల్దార్ దగ్గరకుపోతే నీ భూమి నీకు కావాలంటే రూ. లక్ష ఇవ్వాలన్నారు. నేను డబ్బులు ఇవ్వలేని చెప్తే.. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో.. నీ భూమి నీకు రాదని కరాఖండిగా చెప్పాడు. మా ఊరి భూస్వామి గడిల వెంకట్రావు పేరిట రాశాడు. దయచేసి రెవెన్యూ అధికారులు మా భూమి మాకు వచ్చేలా చూడాలి.
- అన్వర్ ఉన్నీసాబేగం, ఆర్ ఇటిక్యాల గ్రామం, రేగోడ్ మండలం, మెదక్ జిల్లా

చర్యలు తీసుకుంటాం

ఎన్నికలకు ముందు నేను బదిలీపై ఇక్కడికి వచ్చాను. ఈ విషయం ఇప్పుడే నా దృష్టికి వచ్చింది. అనుభవదారు కాలంలోకి ఎలా వచ్చిందో పరిశీలిస్తాను. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాను. నోటీసులు జారీ చేస్తాను.
- హేమమాలిని, తాసిల్దార్, రేగోడ్ మండలం

947
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles