రవిప్రకాశ్‌వి తప్పుడు ఆరోపణలు


Wed,June 12, 2019 02:41 AM

Ravi Prakash making false claims to divert probe

-ఆయనపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం
-టీవీ9 అమ్మకం పారదర్శకంగా పూర్తయినా అడ్డగోలు వాదనలు
-లావాదేవీల వివరాలను వెల్లడించిన టీవీ 9 కొత్త, పాత ప్రమోటర్లు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఫోర్జరీ, నిధుల మళ్లింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఈవో రవిప్రకాశ్ అరెస్టు కాకుండా ఎలాగైన ముందస్తు బెయిల్ పొందాలనే అసత్య, నిరాధారమైన ఆరోపణలను చేస్తున్నారని టీవీ 9 కొత్త, పాత యాజమాన్యాలు పేర్కొన్నాయి. విచారణ అధికారుల ఎదుట, కోర్టుల్లోనూ రవిప్రకాశ్ చేసిన ఆరోపణలకు ఆధారాల్లేవని, ఆయనపై న్యాయపరమైన చర్యలకు పూనుకుంటామని సంస్థ నూతన యాజమాన్యం అలంద మీడియా, పాత యాజమాన్యం శ్రీనిరాజు సంస్థలయిన చింతలపాటి హోల్డింగ్స్, ఐల్యాబ్స్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ ప్రకటించాయి. కోర్టులో రవిప్రకాశ్ తరఫు న్యాయవాది చేసిన వాదనల ఆధారంగా మీడియాలో వచ్చిన వార్తలను ఖండించాయి. ఫోర్జరీ, చీటింగ్ కేసుల్లో విచారణను పక్కదారి పట్టించేందుకే తప్పులు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నాయి. అలంద మీడియా, శ్రీనిరాజు సంస్థల మధ్య చెల్లింపులు హవాలా మార్గం లో జరిగాయంటూ రవిప్రకాశ్ చేసిన వాదనలు అవాస్తవమని తెలపాయి. వాస్తవాలను అందరి ముందుంచేందుకు టీవీ 9 విక్రయ లావాదేవీలను ప్రకటిస్తున్నామని సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. ఆ ప్రకటన సారాంశం ఇలా ఉంది.

2018 ఆగస్టు నాటికి చింతలపాటి హోల్డింగ్స్, ఐల్యాబ్స్, క్లిపోర్డ్ ఫెరీరా, ఎంవీకేఎన్ మూర్తిలకు టీవీ 9 మాతృసంస్థ ఏబీసీఎల్‌లో 90.54 శాతం వాటా ఉన్నది ఈ వాటా మొత్తాన్ని 2018 ఆగస్టు 24న అలంద మీడియా కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ.414 కోట్లు. షేర్ పర్చేజ్ ఒప్పందాన్ని చట్టబద్ధంగా చేసుకుని, నిధుల బదిలీని బ్యాంకుల ద్వారానే జరిపింది. ఈ వ్యవహారంలో ఎక్కడా నగదు లావాదేవీలు జరుగలేదు. ఏబీసీఎల్‌కు అప్పటికే ఉన్న బకాయిల ను చెల్లించడానికి అలంద మీడియా రూ.150 కోట్లను నేరుగా సంస్థ ఖాతాల్లోకి బదిలీ చేయగా, మిగతా రూ.264 కోట్లను పాత ప్రమోటర్లకు బ్యాంకుల ద్వారా చెల్లింపులు జరిగాయి. ఈ లావాదేవీలు పాత, కొత్త ప్రమోటర్ల రికార్డుల్లో స్పష్టంగా నమోదయ్యాయి. సంస్థ యాజమాన్య బదిలీపై కేంద్ర సమాచారం ప్రసార మంత్రిత్వశాఖకు కూడా సమాచారం ఇచ్చాం. ఈ వ్యవహారం అంతా చట్టపరిధిలోనే జరిగింది తప్ప, ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదు. ఈ బదిలీ వ్యవహారం అంతా ఆగస్టు 2018లోనే జరిగింది. ఆ సమయంలో టీవీ 9 సీఈవోగా ఉన్న రవిప్రకాశ్, షేర్ పర్చేజ్ అగ్రిమెంట్‌పై సంతకం కూడా చేశారు.

9 నెలల తర్వాత రవిప్రకాశ్ ఈ ఆరోపణల్ని చేయడం చూస్తుంటే, ఫోర్జరీ కేసుల విషయంలో తాను ఎదుర్కొంటున్న క్రిమినల్ విచారణను పక్కదారి పట్టించడానికే చేస్తున్న పని అని అర్థమవుతున్నది. సైఫ్ త్రీ మారిషస్‌తో కుదిరిన సెటిల్మెంట్ వ్యవహారంపై రవిప్రకాశ్ చేసిన ఆరోపణలు అవాస్తవం. టీవీ9 విక్రయం జరిగే సమయానికి హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో సైఫ్ త్రీ కంపెనీ వేసిన ఓ కేసు పెండింగ్‌లో ఉన్నది. ఐ విజన్‌లో ఉన్న వాటాల విషయంలో సైఫ్ త్రీ ఈ కేసు వేసింది. అయితే, అది సెటిల్మెంట్ అగ్రిమెంట్ ద్వారా పరిష్కారమైంది. ఆర్బీఐ నియమ నిబంధనలకు లోబడి బ్యాంకుల ద్వారానే చెల్లింపు జరిగింది. నిధులను స్వీకరించిన తర్వాత సైఫ్ త్రీ కేసును ఉపసంహరించుకోవడానికి ఎన్‌సీఎల్‌టీ అనుమతి కూడా ఇచ్చింది. తమ పరువుకు భంగం కలిగించేలా అసత్యమైన, అవాస్తవమైన ఆరోపణలను రవిప్రకాశ్ చేసినందుకు చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.

1212
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles