నేడు టీ హబ్ ప్రారంభం


Thu,November 5, 2015 02:28 AM

Ratan Tata to inaugurate country's largest technology incubator T-Hub tomorrow

-ముఖ్య అతిథులుగా గవర్నర్ నరసింహన్,
పారిశ్రామికవేత్త రతన్‌టాటా
-70 వేల చ.అ. విస్తీర్ణంలో కాటలిస్ట్
-వంద స్టార్టప్‌ల కార్యకలాపాలకు అనువు
-స్టార్టప్‌లకు కొండంత అండ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:ఐటీ ప్రపంచంలో హైదరాబాద్ ఖ్యాతిని మరింత ఉన్నతస్థానానికి తీసుకెళ్లేందుకు అంతర్జాతీయస్థాయిలో సిద్ధం అయిన ఇంక్యుబేటర్ సెంటర్ టీ హబ్ గురువారం ప్రారంభం కానుంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాత సదుపాయాలతో టీ హబ్‌కోసం కాటలిస్ట్ పేరుతో ప్రత్యేక భవనం నిర్మించారు. దేశంలోనే ప్రభుత్వం రంగంలో నిర్మితమైన ఇంక్యుబేటర్ సెంటర్ ఇదే కావడం విశేషం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, స్టార్టప్ కంపెనీలకు అండదండలిస్తారనే పేరున్న ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటా హాజరుకానున్నారు.

T-HUB


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రతిష్ఠను మరోమారు ప్రపంచ యవనికపై మెరిపించేందుకు ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఐటీరంగంలో స్టార్టప్‌లకు ఉన్న అవకాశాలను, ఔత్సాహికులకు ప్రోత్సాహం అందించడం ద్వారా హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపును తెచ్చే అవకాశాన్ని గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగి టీ హబ్ పేరుతో ఇంక్యుబేటర్ సెంటర్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధంచేశారు.

ఇదే అసలు ఉద్దేశం
రాష్ట్రంలోనేకాకుండా.. దేశవ్యాప్తంగా వినూత్న ఆవిష్కరణలుచేసే వారికి కొదువలేదు. వీరికి ఆర్థికంగా సహకరించేందుకు పలువురు పారిశ్రామికవేత్తలూ సిద్ధంగా ఉన్నారు. అయితే వీరిద్దరినీ అనుసంధానం చేసే సరైన వేదిక కావాలి. ప్రైవేటురంగంలో కొందరు వేదికలను ఏర్పాటుచేసినప్పటికీ అనుమతులు, సాంకేతికపరమైన సమస్యలకు పరిష్కారం దొరకకపోవడం, ట్రేడ్ చిక్కులు తదితరాల్లో తీవ్ర అస్పష్టత ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఔత్సాహికులకు వర్క్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం టీ హబ్‌ను ఏర్పాటుచేసింది.

ఇందుకోసం ప్రపంచస్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ ట్రిపుల్‌ఐటీ ప్రాంగణంలో 70,000 చదరపు అడుగులతో సొంత భవనాన్ని నిర్మించింది. మౌలిక సదుపాయాలు, భవన నిర్మాణంకోసం రూ.10 కోట్లు తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. 1జీబీ ఇంటర్నెట్, అన్‌లిమిటెడ్ వైఫై సదుపాయం, అత్యున్నత సదుపాయాలతో జీ+5 విధానంలో టీ హబ్ భవంతిని నిర్మించింది. ఈ భవనానికి కాటలిస్ట్ పేరును ఖరారు చేసి, గ్రీన్‌బిల్డింగ్‌గా, ఎనర్జీని ఎఫిషియెంట్‌గా తీర్చిదిద్దింది. కేవలం మౌలిక వసతులతో భవనం నిర్మించి వదిలేయకుండా.. స్టార్టప్‌లకు అండగా నిలిచేందుకు అత్యున్నత సంస్థలనూ భాగస్వామ్యం చేసింది.

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ), ఐఐఐటీ, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం కూడా ఇందులో భాగస్వాములే. కేవలం మెంటార్లుగా వ్యవహరించడంతో సరిపెట్టకుండా ఈ ప్రముఖ సంస్థలతోపాటు పలు దిగ్గజ కంపెనీలతో డైరెక్టర్ల బోర్డును ఏర్పాటుచేసింది. టీ హబ్‌కు ఔత్సాహిక స్టార్టప్‌లను ఎంపికచేయడంతోపాటు ఆయా ఆలోచనలను పూర్తి వ్యాపారకోణంలో తీర్చిదిద్దేందుకు ఈ బోర్డు కృషిచేయనుంది.

బిజినెస్ ప్లాన్ ఎలా రాయాలి? స్టార్టప్‌లను వ్యాపారపరంగా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి? ఈ క్రమంలో పాటించాల్సిన విధివిధానాలేంటి? అనే విషయంలో ఐఎస్‌బీ మెంటార్లు సూచనలిస్తారు. స్టార్టప్‌లు పరిగణనలోకి తీసుకోవాల్సిన టెక్నికల్ అంశాలను ఐఐఐటీ మెంటార్లు సూచిస్తారు. పేటెంట్లు, ఇంటలెక్చువల్ రైట్స్, లీగల్ అంశాల్లో నల్సార్ నిపుణులు మార్గదర్శకం చేస్తారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగంలో స్టార్టప్‌లకు ఓ వేదిక అంటూ ఏదీ లేదు. ఆ విధంగా మొట్టమొదటి ప్రభుత్వ రంగ ఇంక్యుబేటర్‌గా ఇది ప్రఖ్యాతిపొందనుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతోపాటు రెండు రాష్ర్టాలకు చెందిన ప్రతినిధులు కాటలిస్ట్‌ను సందర్శించారు. ఈ భవనంలోని అత్యున్నత ప్రమాణాలు నచ్చి ఇప్పటికే గూగుల్ సంస్థ తమ స్టార్టప్‌లకోసం క్యాబిన్‌లను బుక్ చేసుకున్నట్లు సమాచారం.

ఔత్సాహికుల అభివృద్ధే అసలు లక్ష్యం


టీ హబ్‌లో జీ+5 ఫ్లోర్‌లలో దాదాపు 100 స్టార్టప్‌లు తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వారి వారి అవసరాలను బట్టి క్యాబిన్ లేదా డెస్క్ స్పేస్ కేటాయిస్తారు. కెఫ్టేరియా, ఉత్సాహపరిచే రీతిలో ఇంటిరీయర్ డిజైనింగ్, స్ఫూర్తి కలిగించేలా మహామహాహుల సూక్తులు, ఆసక్తికరమైన చిత్రాలు.. తదితర ప్రత్యేక ఆకర్షణలు ఎన్నో ఈ భవంతిలో ఉన్నాయి.

కాటలిస్ట్‌లో ఒక్కో స్టార్టప్‌కు ఏడాదిపాటు సమయం ఇవ్వనున్నారు. ఆ సమయం తర్వాత వారి ఆలోచన సఫలం కాకపోతే నిరాశలో కూరుకుపోకుండా, ఐఎస్‌బీద్వారా ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ కూడా అందజేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఐటీరంగంలో హైదరాబాద్ పేరెన్నికగన్నది కాబట్టి ఎక్కువగా ఐటీకి చెందిన స్టార్టప్‌లే ఆసక్తి చూపిస్తున్నప్పటికీ హెల్త్‌కేర్ విభాగంలోని సంస్థలు, ఔత్సాహికులు సైతం ముందుకువస్తున్నారు. టీ హబ్‌లో ఇప్పటికే 120 స్టార్టప్‌లకు అవకాశం ఇవ్వగా.. మరో 200 కంపెనీలు అనుమతికోసం ఎదురుచూస్తున్నాయని సమాచారం. మరోవైపు టీహబ్ అభివృద్ధి కోసం ఉద్దేశించిన ప్రస్తుత రూ.10 కోట్ల నిధిని 100 మిలియన్ డాలర్లకు పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రచించింది.

రెండో దశకు రంగం సిద్ధం


మొదటి దశ ప్రారంభోత్సవానికి వేగిరంగా సిద్ధమవుతూనే టీహబ్ రెండో ఫేజ్‌ను సిద్ధం చేసేందుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధతీసుకుంటున్నారు. రాయదుర్గంలోని ప్రతిపాదిత గేమ్‌సిటీ సమీపంలోని 15 ఎకరాల్లో టీహబ్ ఫేజ్-2 క్యాంపస్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు పలు డిజైన్లను స్వయంగా పరిశీలించిన మంత్రి కేటీఆర్.. మరింత అత్యున్నత డిజైన్లను ఆహ్వానించారు.

టీ హబ్ రెండోదశ భవనం 3లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటుకానుంది. దీనిని రూ.150 కోట్లు వెచ్చించి మూడేండ్లలో పూర్తిచేయనున్నారు. పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్(పీపీపీ) విధానంలో రెండో దశను అందుబాటులోకి తేవాలని ప్రయత్నిసున్నారు. ఇదిలాఉండగా గ్రామీణ ప్రాంతాల్లోని ఔత్సాహికులకు చేరువ అయ్యేందుకు వరంగల్ నిట్- రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిగినట్లు సమాచారం.

5723
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS