పరిహారం.. ఇష్టానుసారం!


Sat,May 25, 2019 02:12 AM

Rangareddy Farmer Suffering Revenue Officers Neglect For Land Registration

-భూసేకరణలో చెల్లించిన రూ. 45 లక్షలపై వివాదం
-2008లో తాసిల్దార్ మ్యుటేషన్ చేయడంతోనే ఇబ్బందులు
-వారసత్వంపై వివాదం.. ఒక్కడికే పరిహారం
-అభ్యంతరం చెప్పినా.. పరిహారం చెల్లించిన ఆర్డీవో
-మళ్లీ తానే రికవరీకి క్రిమినల్ కేసు రిజిష్టర్‌చేయాలని ఆదేశం

రంగారెడ్డిజిల్లా, నమస్తే తెలంగాణ: ప్రభుత్వం అక్కడ ఓ ప్రముఖ పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టి భూ సేకరణ చేపట్టింది. భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం మంజూరు చేసింది. నిజానికి ఈ భూమి కొన్నేండ్ల కిందట ప్రభుత్వమే పేదరైతులకు అసైన్‌మెంట్ చేసి ఇచ్చింది. ఇప్పుడు ఈ భూమే పరిశ్రమకు అవసరం కావడంతో రైతుల నుంచి తిరిగి సేకరించింది. కానీ అధికారులు రికార్డులు తారుమారు చేసి అనర్హులకు పరిహారం ఇప్పించిన ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందన్‌వెళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. నమస్తే తెలంగాణ ధర్మగంటకు ఫిర్యాదు చేసిన బాధితుల కథనం ప్రకారం.. చందన్‌వెల్లి గ్రామంలో ప్రభుత్వం చాలా ఏండ్ల క్రితం నిరుపేదలకు భూమిని పంచింది. ఇందులో భాగంగా సర్వే నంబర్ 190/87లో ఐదు ఎకరాలను బట్టిగారి బాలయ్యకు అసైన్‌మెంట్ చేశారు. బట్టిగారి బాలయ్యకు సంతానం లేదు. 25 ఏండ్ల క్రితమే భార్య విడిపోయింది. బాలయ్యకు నా అన్నవారు లేకపోవడంతో ఈ భూమిపై పాలివాండ్ల కన్నుపడింది. బాలయ్యకు దత్త పుత్రుడినంటూ బట్టిగారి యాదగిరి అనే వ్యక్తి రంగంలోకి దిగాడు. ఇది గమనించిన బాలయ్య తమ్ముడి కుమారులు పెద్దనాన్న అస్తిని పాలివాండ్లు తన్నుకుపోతున్నారని గ్రహించి అధికారులకు ఫిర్యాదుచేశారు. అయితే అధికారులు పట్టించుకోలేదు.

ఫిర్యాదు చేసినా పరిహారం చెల్లింపు

బాలయ్యకు వారసులే లేరని అక్రమంగా మ్యుటేషన్‌చేసి పరిహారం కాజేస్తున్నారని బాలయ్య సోదరుల కుమారులు బట్టిగారి నర్సింహ, రాంచంద్రయ్య ఎమ్మార్వో, ఆర్డీవోలకు ఫిర్యాదుచేశారు. కానీ బట్టిగారి బాలయ్య బతికి ఉండగానే ఆయన భూమిని 2008 నవంబర్‌లో బట్టిగారి యాదగిరి పేరిట అప్పటి షాబాద్ తాసిల్దార్ మ్యుటేషన్‌చేశారు. అందులో యాదగిరి తండ్రి బాలయ్య అని పేర్కొన్నారు. సంతానం లేని బాలయ్యకు బట్టిగారి యాదగిరి కుమారుడు కాదని అభ్యంతరం తెలిపినా పట్టించుకునేవారు లేకుండాపోయారు. భూమిని పారిశ్రామికవాడ నిమిత్తం సేకరించిన క్రమంలో ఎకరానికి రూ.9 లక్షల పరిహారం చెల్లించారు. దాని ప్రకారం బట్టిగారి యాదగిరి పేరుపై రూ.45 లక్షల చెక్‌ను పంపిణీ చేయడానికి అధికారులు సిద్ధమయ్యారని తెలిసి బట్టిగారి నర్సింహ, రాంచంద్రయ్య తమకు వాటాగా ఎకరం 10 గుంటల చొప్పున నష్టపరిహారం రావాలని కోరుతూ అప్పటి చేవెళ్ల ఆర్డీవోకు రాతపూర్వకంగా మార్చి 19, 2018న అభ్యంతర లేఖ రాశారు. షాబాద్ తాసిల్దార్ వాస్తవాలను గుర్తించి అసైన్‌దారు బాలయ్య బతికి ఉండగానే యాదగిరి పేరున పట్టామార్పిడి చేసిన విషయాన్ని (నంబర్ బీ/10533/17, 2018 జూన్ 21) చేవెళ్ల ఆర్డీవోకు తదుపరి చర్య నిమిత్తం లేఖ రాశారు.

వాస్తవంగా బట్టిగారి బాలయ్యకు వారసులైన సోదరులందరికీ నష్టపరిహారం చెల్లించాల్సి ఉండగా, ఒక్కరికే నష్టపరిహారం చెల్లించవద్దని చేవెళ్ల ఆర్డీవోను కోరినప్పటికీ జూలై 2, 2018న చెక్ నంబర్ 573150 ద్వారా రూ.45 లక్షలను బట్టగారి యాదగిరికి చెల్లించారు. ఈ విషయంపై తిరిగి అప్పటి చేవెళ్ల ఆర్డీవోను సంప్రదించగా తాను ఇచ్చిన మొత్తాన్ని బట్టిగారి యాదగిరి నుంచి రికవరీ చేస్తామని, అతనిపై క్రిమినల్ కేసు రిజిష్టర్ చేయాలని ఆగస్టు 11, 2018న, లేఖ నంబర్ 1483/18 ద్వారా షాబాద్ తాసిల్దార్‌ను ఆదేశించారు. అనర్హుడికి నష్టపరిహారం చెల్లించవద్దని అభ్యంతరం తెలిపినప్పటికీ ఆర్డీవో లబ్ధిదారుతో కుమ్మకై, నష్టపరిహారం చెల్లించి, మళ్లీ తానే ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని క్రిమినల్ కేసు రిజిష్టర్ చేసేందుకు ఆదేశించడం విచిత్రమని, ఇక్కడే అతను అవినీతికి పాల్పడ్డారని స్పష్టమైందని బాధితులు ఆరోపించారు. బాలయ్య సొంత తమ్ముళ్ల కుమారులకు రెవెన్యూ అధికారులు పరిహారం విషయంలో మొండిచేయి చూపా రు. జిల్లా కలెక్టర్ విచారణ జరిపి అర్హులకు నష్టపరిహారం అందేలా చూడాలని బాధితులు కోరుతున్నారు. అక్రమాలు చేసిన చేవెళ్ల రెవెన్యూ డివిజన్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ధర్మగంట ద్వారా జిల్లా కలెక్టర్‌ను కోరారు.
narsimulu

దత్తపుత్రుడ్ని.. భూమి నాదే

నన్ను బాలయ్య పెంచుకున్నాడు. 20 ఏండ్ల క్రితం దత్తత తీసుకున్నాడు. అందుకే నాకు భూ హక్కులు ఇచ్చాడు. వారసులు లేకపోవడంతో నేనే వారసుడిగా ఉన్నాను. షాబాద్ మండల రెవెన్యూ రికార్డుల ప్రకారం భూమి నాదే. 20 ఏండ్లుగా కాస్తులో ఉండి సాగుచేస్తున్నాను. ఫిర్యాదు చేసినవారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. ఇటీవలి ఎన్నికల్లో వారికి వ్యతిరేకంగా ఉండటంతో ఇబ్బంది పెడుతున్నారు.
- బట్టిగారి యాదగిరి

628
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles