కవి శేషం రామానుజాచార్య కన్నుమూత


Sun,April 17, 2016 02:26 AM

ramanujacharya  passes away

-1969 ఉద్యమంలో చురుకైన పాత్ర
-తెలుగు, సంస్కృతం, ఇంగ్లిష్‌భాషలపై సాధికారిక ప్రజ్ఞ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సుప్రసిద్ధ కవి, బహుగ్రంథకర్త, ఆకాశవాణి రిటైర్డ్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ శేషం రామానుజాచార్య (73) శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ శనివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ దవాఖానాలో మరణించారు. శనివారం సాయంత్రం ఆయన పార్థివదేహానికి అంత్యక్రియలు జరిగాయి. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె, మనుమలు ఉన్నారు. నల్లగొండ జిల్లాలోని నకిరేకల్‌లో జన్మించిన ఆయన, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివి.. తెలుగు భాషా ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1969లో సాగిన తెలంగాణ ఉద్యమంలో నల్లగొండ జిల్లాలో చురుకుగా పాల్గొన్నారు. విద్యార్థులారా! ప్రత్యేక రాష్ట్రం కోసం కదలండి అనే శీర్షికన ఆయన రాసిన పద్యాలను నాటి ఉద్యమ సమయంలో నల్లగొండలో జరిగిన ప్రతి బహిరంగసభలో చదివి వినిపించేవారు. ఆకాశవాణిలో ఉన్నతాధికారులతో పోరాడి.. తెలంగాణ ఒగ్గు కళాకారులకు అవకాశం కల్పించారు.

సాహితీ రంగానికి అమూల్యమైన సేవ


ఆకాశవాణిలో మూడుదశాబ్దాలపాటు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన రామానుజాచార్య.. చైతన్యరేఖలు (అభ్యుదయ కవిత్వం), తిరుప్పావై (పద్యరూప అనువాదం), అహో ఆంధ్రభోజా (పద్యకృతి), సమాలోచన వ్యాస సంకలనం చింతనామృతం (ఆధ్యాత్మిక వ్యాస సంకలనం), రంగనాథ వైభవం తదితర పుస్తకాలు రాసి అమూల్యమైన సాహిత్య సేవచేశారు. యామినీపూర్ణ తిలకం పేరుతో ఆయన రాసిన రేడియోనాటకం సంచలనం సృష్టించింది. దీనికి దాశరథి, ఆచార్య రవ్వాశ్రీహరి, కేశవపంతుల నరసింహశాస్త్రి, పాలెం ఓరియంటల్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీరంగాచార్య ప్రశంసలు అందించారు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్ సాహిత్యంపై ఆయనకు సాధికారిక ప్రజ్ఞ ఉండేది. ఇంటింటాగ్రంథాలయం పుస్తక ప్రచురణ సంస్థల కోసం చాలా పుస్తకాలు పరిష్కరించిన రామానుజాచార్య.. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి, తిరుమల తిరుపతి దేవస్థానం ఉత్సవాల వ్యాఖ్యాతగానూ వ్యవహరించారు. యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో ప్రవచనాలు వినిపించి అందరి మెప్పు పొందారు. దశాబ్దకాలంగా శ్రీ వైష్ణవ సేవాసంఘానికి ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. 2014లో ఉగాది పురస్కారం అందుకున్న రామానుజాచార్య.. ఉత్పల సత్యనారాయణాచార్య, జ్ఞానానందకవి, దాశరథి తదితర కవులతో కలిసి ఉగాది కవి సమ్మేళనాల్లో పాల్గొన్నారు.
ramanujucharyulu

కేవీ రమణాచారి తదితరుల శ్రద్ధాంజలి


రామానుజాచార్య పార్థివదేహాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి దర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. పద్య సాహిత్యంపై సాధికారిక ప్రజ్ఞ కలిగిన అరుదైన తెలంగాణ పండిత కవుల్లో అగ్రగణ్యుడు రామానుజాచార్య అని నివాళులర్పించారు. సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ రామానుజాచార్య నల్లగొండ సాహిత్య శిఖరాల్లో ఒకరని పేర్కొన్నారు. పాటలు రాస్తున్నప్పుడు పద బంధాలు కూర్చుకోవడానికి రామానుజాచార్యతో పలుమార్లు సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకున్నట్లు గుర్తు చేసుకున్నారు. సీనియర్ జర్నలిస్ట్ హనుమంతరావు, వేణుగోపాలాస్వామి, శ్రీవైష్ణవ సేవాసంఘం అధ్యక్షుడు ఎస్‌టీ చారి, శ్రీవైష్ణవ సేవాసంఘం ట్రస్ట్ అధ్యక్షుడు కండ్లకుంట యాదగిరి ఆచార్య, విశ్వహిందూపరిషత్ (వీహెచ్‌పీ) జా తీయ నాయకులు చిలకమర్రి లక్ష్మీనాథాచార్య, టీఆర్‌ఎస్ ఎల్బీనగర్ ఇన్‌చార్జి ఎం రామ్మోహన్‌గౌడ్, కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్‌రెడ్డి, మధుమోహన్ తదితరులు ఆయనకు నివాళులు అర్పించారు.

1171
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS