వడ్డెర్లు.. గొప్ప ఇంజినీర్లు


Mon,June 17, 2019 02:09 AM

Rajyaiah MLA at Waddera Sangam National Convention

-ప్రజాప్రతినిధులు మరింత పురోగతిదిశగా పయనించాలి
-వడ్డెర సంఘం జాతీయ మహాసభలో ఎమ్మెల్యే రాజయ్య

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: వడ్డెర్లు.. నైపుణ్యమున్న గొప్ప ఇంజినీర్లు అని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. వడ్డెర కులంలోని ప్రజాప్రతినిధులు మరింత పురోగతిదిశగా పయనించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ రవీంద్రభారతి ప్రధాన వేదికపై ఆదివారం మధ్యాహ్నం వడ్డెర సంఘం జాతీయ మహాసభ జరిగింది. ఈ సందర్భంగా వడ్డెర కులంలోని సర్పంచ్, ఉపసర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, మున్సిపల్ చైర్మన్, కార్పొరేటర్ల వరకు ప్రజాప్రతినిధులను సన్మానించారు. వడ్డెర సంఘం మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. చదువుతో అజ్ఞానాన్ని పారదోలిన వాళ్లమవుతామని చెప్పారు. ఒకప్పుడు తాను పశువుల కాపరిగా ఉన్నానని, తదుపరి డాక్టర్‌ను అయ్యానని, అనంతరం తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశానని.. ఇదంతా చదువుకోవడంవల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. పనిచేసే ప్రభుత్వానికి అందరం చేయూతనివ్వాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో బీసీలమంతా నిరాదరణకు గురయ్యామని బీసీ కమిషన్ సీనియర్ సభ్యు డు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు చెప్పా రు. చట్టసభల్లో అవకాశం వస్తే సత్తా చాటుతామని, ఉద్యమ నాయకుడు, సీఎం కేసీఆర్‌కు తమ హక్కుల గురించి విన్నవించుకుంటున్నామని తెలిపారు.

తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరారు. ఓయూలోని ఆర్ట్స్ కాలేజీని తీర్చిదిద్దిన ఘనత వడ్డెర జాతిదని, బండలను చీల్చి, కంకరగా మల్చి రోడ్లు, భవనాలను నిర్మించిన గొప్ప చరిత్ర వడ్డెర సోదరులదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. వడ్డెర ఫెడరేషన్‌ను కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, వడ్డెరలను ఎస్టీలో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. వడ్డెర్లకు రాజకీయ అవకాశాలు, నామినేటెడ్ పదవులతోపాటు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు వేముల వెంకటేశ్ కోరారు. వడ్డెర్లకు ప్రమాద బీమా రూ.10 లక్షలు కల్పించాలని, వడ్డెర పిల్లలకు ఉచిత విద్యను అందించాలని విజ్ఞప్తిచేశారు. ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపల్ చైర్‌పర్సన్ అనితా నాగరాజు, తార్నాక కార్పొరేటర్ ఆలకుంట సరస్వతి, నాగరాజు, వల్లెపు మొగిలి, తెలుగు రాష్ర్టాల వడ్డెరలు, ఇతర రాష్ర్టాల ప్రతినిధులు కుంచాల ఏడుకొండలు, గుజ్జ కృష్ణ, వేముల రామకృష్ణ, బత్తుల లక్ష్మీకాంతయ్య, చెంబేటి విజయలక్ష్మి, వేముల భవాని, బండారు శ్రీరాములు, ఈశ్వర్, పీట్ల శ్రీధర్, కతాల్, ఎత్తరి మారయ్య, శివకుమార్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

1610
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles