నేడు తేలికపాటి వానలు

Wed,December 4, 2019 02:48 AM

-కొనసాగుతున్న ఉపరితల ద్రోణి
-హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
-పలు జిల్లాల్లో కమ్ముకున్న పొగమంచు

హైదరాబాద్/ హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. శ్రీలంక, దక్షిణ తమిళనాడు తీరాలకు దగ్గరలో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో తెలంగాణలోని చాలాచోట్ల ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడ్డాయని చెప్పారు. గురువారం నుంచి పొడి వాతావరణం ఉంటుందన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం తెల్లవారుజామున పొగమంచు కమ్ముకున్నది.

గ్రేటర్ హైదరాబాద్‌ను వణికిస్తున్న చలిగాలులు

గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను చలిగాలులు వణికిస్తున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉత్తర, ఈశాన్యం దిశ నుంచి వీస్తున్న బలమైన చలిగాలులతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గి చలితీవ్రత పెరిగింది. అర్ధరాత్రి సమయంలో చలిప్రభావం మరింత అధికంగా ఉంటున్నది. మంగళవారం రోజంతా వాతావరణం చల్లబడింది. గరిష్ఠ ఉష్ణోగ్రత 26.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 19.7 డిగ్రీలు, గాలిలో తేమ 91 శాతంగా నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. బుధవారం గ్రేటర్‌లోని అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని చెప్పారు. గడిచిన రెండ్రోజులుగా వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పులతో వృద్ధులు, చిన్నారులు, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ముంచెత్తిన పొగమంచు

ఆదిలాబాద్, నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఆదిలాబాద్ జిల్లాను పొగమంచు ముంచెత్తింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఉదయం 8.30 గంటలు దాటాక కూడా పొగమంచు ఉండటంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు లైట్లు వేసుకుని నడుపాల్సి వచ్చింది. మరికొందరు పార్కింగ్ లైట్లు వేసుకుని రహదారి పక్కన వాహనాలను నిలిపివేశారు. ఆదిలాబాద్ పట్టణంలో సైతం పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో ఇంతటి పొగమంచును తాము గతంలో ఎప్పుడూ చూడలేదని ప్రజలు అంటున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ఝరి గ్రామ పరిసరాల్లోనూ మంగళవారం పొగమంచు కమ్ముకొని.. వాహనదారులతోపాటు పొలాల వద్దకు వెళ్లే రైతులు ఇబ్బందులు పడ్డారు.
Rain1

1514
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles