పట్టాలుతప్పిన రైలింజిన్‌

Thu,October 10, 2019 03:39 AM

- కర్నూలు -కాచిగూడ మార్గంలో ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు
- పలు రైళ్ల దారిమళ్లింపు.. మరికొన్ని పాక్షికంగా రద్దు

మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి/నమస్తే తెలంగాణ: మహబూబ్‌నగర్‌ సమీపంలోని మన్యంకొండ స్టేషన్‌ దగ్గర క్రషర్‌ మిషన్‌ రైలింజిన్‌ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. కానీ, కాచిగూడ-కర్నూలు మార్గంలో రైళ్లన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. పట్టాల మరమ్మతులకు ఉపయోగించే బలాస్ట్‌ క్లీనింగ్‌ మెషిన్‌ (బీటీఎం) రైలు మన్యంకొండ స్టేషన్‌ వద్ద బుధవారం సాయంత్రం పట్టాలు తప్పడంతో కాచిగూడ -కర్నూలు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని మహబూబ్‌నగర్‌ స్టేషన్‌ మేనేజర్‌ ప్రసన్నకుమార్‌ చెప్పారు. పలు రైళ్లను సమీప స్టేషన్లలో ఆపేశామని, మరికొన్ని రైళ్లను దారి మళ్లించామన్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఆక్సిడెంట్‌ రిలిఫ్‌ వెహికిల్‌ (ప్రత్యేక రైలు) సిబ్బంది పట్టాలు తప్పిన రైలును ట్రాక్‌పైకి తీసుకొచ్చేందుకు అర్ధరాత్రి వరకు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బీటీఎం రైలును అక్కడినుంచి తరలించిన తర్వాత రైళ్ల రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నారు.

నిలిచిన తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌

బీటీఎం రైలు పట్టాలు తప్పడంతో ఆ సమయంలో కర్నూలు నుంచి సికింద్రాబాద్‌ వెళ్లాల్సిన తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ రైలును మన్యంకొండ వద్ద ఆపేశారు. రవాణా, పోలీసు శాఖాధికారులు పది ప్రత్యేక బస్సుల ద్వారా పలువురు ప్రయాణికులను హైదరాబాద్‌ తరలించారు. మిగతావారికి మ్యాక్సి క్యాబ్‌ ఏర్పాటుచేసి తరలించే ప్రయత్నంచేశారు. రైల్వే డీఆర్‌ఎం సీతా రాంప్రసాద్‌ ఘటన స్థలానికి చేరుకొని మరమ్మతు పనులను పర్యవేక్షించారు.

రైళ్ల దారి మళ్లింపు

కాచిగూడ వైపు నుంచి గద్వాల, కర్నూలు మీదుగా తిరుపతి, బెంగళూరు వైపు వెళ్లాల్సిన పలు రైళ్లను వికారాబాద్‌, రాయచూరు, గుంతకల్‌ మీదుగా దారి మళ్లించారు. తిరుపతి, చిత్తూరు, బెంగళూరు వైపు నుంచి కాచిగూడ రావాల్సిన రైళ్లను గుంతకల్‌, రాయచూర్‌, వికారాబాద్‌ మీదుగా దారి మళ్లించారు. కాచిగూడ నుంచి మహబూబ్‌నగర్‌ స్టేషన్‌ వరకు వచ్చిన కాచిగూడ- గుంటూరు ప్యాసింజర్‌ రైలు, కాచిగూడ- కర్నూలు హంద్రి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను మహబూబ్‌నగర్‌ వరకు నడిపి తిరిగి కాచిగూడ తిప్పి పంపించారు. కర్నూలు- కాచిగూడ తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ దేవరకద్ర రైల్వేస్టేషన్‌లోనే ఆపేశారు. రాయచూర్‌- కాచిగూడ డెమో రైలును గద్వాల స్టేషన్‌లో నిలిపేశారు. ఎక్కడి రైళ్లు అక్కడే ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దసరా ముగించుకొని గమ్యస్థానాలకు చేరుకొనే క్రమంలో చిన్నపిల్లలతో తల్లులు అవస్థలు పడ్డారు.

2358
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles