మోదీది అధికార దుర్వినియోగం


Thu,December 6, 2018 02:50 AM

rahul gandhi fires on modi in Kodad

-కోదాడ సభలో రాహుల్‌గాంధీ విమర్శ
-బీజేపీకి హెలికాప్టర్లు తప్ప ఓట్లు లేవు: ఏపీ సీఎం చంద్రబాబు

కోదాడ టౌన్/అశ్వారావుపేట/ సత్తుపల్లి, నమస్తే తెలంగాణ: నరేంద్రమోదీ పాలనలో భారతదేశ శక్తి క్షీణిస్తున్నదని రాహుల్‌గాంధీ విమర్శించారు. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై దాడులుచేస్తూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. బుధవారం సూర్యాపేట జిల్లా కోదాడలో ప్రజాకూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమన్నారు. ఈ బహిరంగసభలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి కుంతియా, కాంగ్రెస్ అభ్య ర్థి పద్మావతి, కొడాలి నాని, బండ్ల గణేష్ పాల్గొన్నారు.

అశ్వారావుపేట, సత్తుపల్లిలో బాబు ప్రచారం

మోదీ పాలనలో దేశం క్లిష్టపరిస్థితుల్లోకి వెళ్లిందని, దేశ ప్రజల సంక్షేమం కోసమే 35 ఏండ్లుగా రాజకీయంగా విభేదించిన కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. మోదీ పాలనలో సీబీఐ సైతం అవినీతిమయమైందని ఆరోపించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో నిర్వహించిన ప్రజాకూటమి ఎన్నికల సభల్లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీకి ఓట్లులేవని, హెలికాప్టర్లు మాత్రమే ఉన్నాయని ఎద్దేవాచేశారు. మాయమాటలతో గారడీ చేయటంలో మోదీ దిట్ట అని విమర్శించారు. బీజేపీ దేశమంతా ముస్లింలపై దాడులు జరిపిస్తూ.. హిందూ ముస్లింలను వేరుచేస్తూ.. హిందువుల ఓట్ల కోసం కుట్రలు పన్నుతున్నదన్నారు.

ఫలితాల తర్వాతే సీఎం అభ్యర్థి నిర్ణయం

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ
ప్రజాఫ్రంట్ సీఎం అభ్యర్థిని ఎన్నికల ఫలితాల తర్వాతే నిర్ణయిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెప్పారు. కూటమి అధికారంలోకివస్తే.. రైతులకు ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లను అందుబాటులో ఉంచుతామన్నారు. బుధవారం తాజ్‌కృష్ణహోటల్‌లో ప్రజాఫ్రంట్ నేతలతోకలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ తీసుకున్న నోట్లరద్దు నిర్ణయంతో దేశ ఆర్థికవ్యవస్థ సర్వనాశనమైందన్నారు. కేవలం 15 మందికి రూ.మూడులక్షల కోట్లను మోదీ పంచిపెట్టారని ఆరోపించారు. తాము నిరుద్యోగులకు ఉపాధికల్పన, వ్యవసాయం, విద్యకు ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. జాతీయ రాజకీయాలకు తెలంగాణ ఎన్నికలు నాందికావాలన్నారు . టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాఫ్రంట్ అధికారంలోకివస్తే హైదరాబాద్ నుంచే పాలన సాగుతుందని చెప్పారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ అజెండా అమలు బాధ్యత తనదని పేర్కొన్నారు. సీపీఐ జాతీయకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సైద్ధాంతిక రాజకీయ విభేదాలున్నా.. కూటమిగా ఏర్పడ్డామని, ప్రజలకు స్వేచ్ఛను కల్పిస్తామన్నారు. సమావేశంలో గద్దర్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష మాదిగ, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

701
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS