కనిపించని శత్రువుతో.. కనబడని యుద్ధం!


Mon,April 16, 2018 04:40 PM

Rachakonda worst in cyber crime

-ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు ఊహించుకోవడం
-తమకేదో జరిగిపోతున్నట్టు గాభరా పడిపోవడం
-అతీంద్రియ శక్తులు వెంటాడుతున్నట్టు అనుమానాలు
-తమ మైండ్‌ను శాటిలైట్ ద్వారా ఇతరులు హ్యాక్ చేసినట్టు ఆందోళన
-పోలీసులకు చుక్కలు చూపిస్తున్న మానసిక వ్యాధిగ్రస్థులు
-చిత్రవిచిత్రమైన ఫిర్యాదులతో తలనెప్పి

వారు మనలోకంలో ఉన్నట్టే ఉంటారు. కానీ మానసికంగా విహరించేది మరోలోకంలో. అభూతకల్పనల్లో అజ్ఞాత శతృవును చూస్తుంటారు. ఆ శత్రువు వెంటాడుతున్నట్టు ఊహించుకుంటారు. అదే నిజమనుకుని ఆందోళనకు గురవుతుంటారు. ఎవరో తమను వశపర్చుకున్నట్టు, తమ ఆలోచనలను ఒడిసిపట్టినట్టు, తమను అంతం చేయాలని పథకాలు వేస్తున్నట్టు కాల్పనిక జగత్తులో బితుకుబితుకుమంటూ గడుపుతుంటారు. శత్రువు చుట్టుముట్టినట్టు గాభరా పడిపోతుంటారు. వారిలో కొందరు పోలీసులను ఆశ్రయించి తమ ఊహాలోక శత్రువు భరతం పట్టమని ఫిర్యాదులు చేస్తుంటారు. తీరా దర్యాప్తు మొదలుపెడితే ఏమీ ఉండదు. చివరకు అవన్నీ భ్రమలే అని తేలుతుంది. పోలీసులను పరుగులు పెట్టిస్తున్న ఇలాంటి వింత మానసిక ఫిర్యాదులపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం..

ParanoidSchizophreni
-గోవిందు రవికుమార్
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: 65 ఏండ్ల వృద్ధురాలు ఓ ఫార్మా కంపెనీలో పనిచేసి రిటైరైంది. సోషల్‌మీడియా లింక్‌డిన్‌లో తన ప్రొఫైల్‌ను అప్‌లోడ్ చేసింది. ఫార్మా రంగానికి చెందిన మరోవ్యక్తి ప్రొఫైల్ కూడా అందులో ఉండడంతో ఇద్దరు ఒకట్రెండు సార్లు ఈమెయిల్ ద్వారా వృత్తిపరమైన అంశాలపై చర్చించారు. కొన్నిరోజుల తరువాత.. లింక్‌డిన్ ద్వారా పరిచయమైన వ్యక్తిపై సదరు మహిళ రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వ్యక్తి తనను హోటల్‌కు తీసుకెళ్లాడని తనతో గడిపాడని తనను వెంబడించి వేధించాడని ఫిర్యాదులో పేర్కొన్నది. రాచకొండ పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. ఆమె ఫిర్యాదు ఇచ్చిన సమయంలో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి జర్మనీలో ఉన్నాడు. అయితే కొన్నాళ్ల తర్వాత ఆయన ఇండియాకు రావడంతో పోలీసులు విచారణ కోసం పిలిపించారు. తాను ఒకటిరెండు సార్లు ఈమెయిల్స్, ఫోన్లలోని వృత్తిపరమైన విషయాలు మాట్లాడుకోవడం తప్ప ఆమెతో ముఖాముఖి ఎప్పుడూ కలుసుకోలేదని సాక్ష్యాధారాలతో సహా నిరూపించాడు. ఈ విషయాలపై మరోసారి ఆ వృద్ధురాలితో ఆరాతీయగా.. ఆయన చెప్పేది నిజమేనని తేలింది. తనను వెంబడించడం, వేధించడం, హోటల్‌కు తీసుకొని పోవడం వంటివన్నీ కేవలం ఆమె భ్రాంతి చెందిన విషయాలే తప్ప నిజానికి అలా జరగలేదని విచారణలో రూఢి అయ్యింది. దీంతో అవాక్కవడం పోలీసుల వంతైంది.

ఊహాలోకంలో భయాలతో.. ఆందోళనలతో..

నా కలలో నాగుపాము వచ్చింది. మా ఇంటికి ఎదురుగా ఉన్న పాస్టర్ అదే విషయాన్ని టీవీలో చెప్తున్నాడు. నాకు వస్తున్న కలలన్నీ ఆయనకు తెలిసిపోతున్నాయి. నా మైండ్‌ను ఆయన హ్యాక్ చేస్తున్నాడు. ఆయన ప్రసంగాలన్నీ నాకొచ్చిన కలలోని అంశాలే. ఆ పాస్టర్ నన్ను టార్గెట్ చేశాడు. నా మైండ్‌ను తన గుప్పిట్లోకి తీసుకున్నాడు. ఎలా చేశాడో ఏం చేశాడో తెలుసుకొని ఆయనపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలి. సైబర్‌క్రైమ్ పోలీసులకు ఓ మహిళ చేసిన ఫిర్యాదు ఇది.
ఈ రెండు ఘటనల్లో అవతలివాళ్లను వాళ్లు చూడలేదు. వాళ్లే శత్రువును ఊహించుకుంటారు. ఆ శత్రువుతో ఊహాలోకంలో నిరంతరం యుద్ధం చేస్తుంటారు. ఏవేవో తమను చుట్టుముడుతుంటాయి. జరుగని విషయాలు జరిగినట్టు అనిపిస్తుంటాయి. తమనెవరో వెంబడిస్తుంటారు. కానీ ఆ వెంబడించేవాళ్లెవరో అస్సలు కనబడరు. తమ మెదడును తమ ప్రమేయం లేకుండా అదుపులోకి తీసుకున్నట్టు భ్రమిస్తుంటారు. భ్రాంతికి గురవుతుంటారు. తెలియని ఒక మాయాప్రపంచంలోకి కూరుకుపోతుంటారు. కారణం ఏదైనా మొత్తానికి రకరకాల మానసిక వైకల్యాలకు లోనవుతున్నారు.
ParanoidSchizophreni1
ఆ కనిపించని శత్రువులను ఎలాగైనా సరే పట్టుకొని శిక్షించాలని పోలీసుల వెంటపడి ఫిర్యాదులు చేస్తుంటారు. చుట్టూ పదిమంది ఉన్నా ఒంటరవుతున్నారు. ఆనందం, సంతోషం, సుఖం, దుఃఖం, ఆక్రోశం, బాధ, ఆవేదన పంచుకునేందుకు సరైన వ్యక్తులు తగినంత వ్యవధి లేక మనుషులు లోలోపలే మానసికంగా కృంగిపోతున్నారు. వంశపారంపర్యంగా వచ్చే మానసిక లక్షణాలు కూడా వీటికి తోడవుతుండడంతో ఈ తరహా సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ప్యారనాయిడ్ స్కీజోఫ్రేనియా అనే మానసిక వ్యాధితో బాధపడుతూ.. తమను మానసిక శక్తితో లేదా టెక్నాలజీపరంగా ఇతరులు ఇబ్బందులు పెడుతున్నారంటూ పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు చేసేవారి సంఖ్య కూడా పెరుగుతున్నది. తమ మెదడులో వచ్చే ఆలోచనలను ఇతరులు చోరీ చేస్తున్నారని, అందుకు కొందరు శాటిలైట్‌ను కూడా ఉపయోగిస్తున్నారంటూ సైబర్‌క్రైమ్ పోలీసులకు వింతవింత ఫిర్యాదులు అందుతున్నాయి. ఇలాంటి ఫిర్యాదులతో పోలీసులు పరేషాన్ అవుతున్నారు. ప్రతినెల ఒకటిరెండు కేసులు ఇలాంటివి హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు వస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కోరకమైన కారణాన్ని చూపుతూ ఫిర్యాదులు చేస్తున్నారు. కొందరు హాలీవుడ్ సినిమాలను తలపించే విధంగా, ఊహాజనితమైన ఆలోచనలతో ఇతరులపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలాంటి ఫిర్యాదులపై పోలీసులు కూడా వెంటనే గాభరాపడకుండా, వారి మానసిక పరిస్థితిని అధ్యయనం చేస్తున్నారు. వారిచ్చే ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, కుటుంబ సభ్యులందరిని పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. కొందరు మాత్రం తమ ఫిర్యాదులు పోలీసులు సరిగా పట్టించుకోవడం లేదంటూ ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదులు చేస్తున్నారు. ఫలింతగా ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారులను వాకబు చేయాల్సి వస్తున్నది.

సైబర్‌క్రైమ్ పోలీసులకు ఇటీవల వచ్చిన ఫిర్యాదులు కొన్ని...

నాపై ఒక గుర్తుతెలియని వ్యక్తి లైంగికదాడి జరిపాడు. అయితే అది వర్చువల్‌గా జరిగింది. అతనెవరో మీరు దర్యాప్తు చేసి తెలుసుకోవాలి.. నన్నే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడు.. అతడు కన్పిస్తే చంపేయాలని ఉంది. నాకు అతనిపై కోపం కట్టలు తెంచుకుంటున్నది.. మీరు అతనిని వెంటనే గుర్తించి పట్టుకోవాలని ఫిర్యాదు అందింది. అని ఓ మహిళ పిర్యాదు.
నాకు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌చేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు.. వాళ్లను పట్టుకోవాలి. నేను వారిని గుర్తించేందుకు ప్రయత్నించాను. నా ఫోన్‌లో మాత్రం వేధింపులకు గురిచేస్తున్నవారి ఫోన్ నంబర్ డిస్‌ప్లే కావడం లేదు. దాంతో పాటు నా కాల్‌డేటాలోనూ వారి ఫోన్ నంబర్లు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకు వాళ్లు ఎయిర్‌టెల్ సర్వర్‌నే హ్యాక్ చేశారు. దీంతో మీరు కాల్‌డేటాను ఉపయోగించి వాళ్లను పట్టుకోవాలన్నా అది సాధ్యం కాదు. నన్ను ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా.. ఎయిర్‌టెల్ సర్వర్‌నే హ్యాక్ చేసినవారిని మీరు పట్టుకోవాలి అంటూ మరో మహిళ ఫిర్యాదు.
ParanoidSchizophreni2
నేను ఉదయం టీవీ పెట్టగానే చంద్రబాబునాయుడే కనిపిస్తున్నాడు.. ఏ చానల్ పెట్టినా అతడే వస్తున్నాడు.. చంద్రబాబునాయుడు మా టీవీని హ్యాక్ చేశాడు.. మేం వేరే చానళ్లు చూడలేకపోతున్నాం.. కేబుల్ టీవీ ఆపరేటర్‌ను అడిగితే మిగతావారికంతా బాగానే వస్తుంది మీకే ఎందుకు అలా వస్తుందో మాకు అర్థం కావడం లేదంటూ పట్టించుకోవడం లేదు. మా ఇంట్లోని టీవీని హ్యాక్ చేయాల్సిన అవసరం బాబుకు ఎందుకొచ్చింది. మా టీవీని హ్యాక్ చేసినవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి అంటూ ఇంకో మహిళ ఫిర్యాదు.నా మైండ్‌ను కొందరు హ్యాక్ చేశారు.. నేను నా మైండ్‌లో అనుకుంటున్నవన్ని వాళ్లు చేసేస్తున్నారు. నా పక్క నుంచే వెళ్తూ వారు నా మైండ్‌ను హ్యాక్ చేస్తున్నారు. ఇందుకు శాటిలైట్‌ను ఉపయోగిస్తున్నారు. శాటిలైట్ ద్వారా నా మైండ్‌ను మొత్తం వారు తమ అధీనంలోకి తీసుకుంటున్నారు. నా మైండ్‌లో వచ్చే విలువైన ఆలోచనలను చోరీ చేస్తున్నారు. నా మైండ్‌ను హ్యాక్ చేసినవారిని మీరు అరెస్ట్ చేయాలి అంటూ ఓ యువకుని ఫిర్యాదు. సారు నన్ను అమ్మాయిలు ఏడ్పిస్తున్నారు.. నేను ఒక కోచింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటున్నాను.. నన్ను చదవనీయడం లేదు. నేను చదువుదామని అనుకోగానే అమ్మాయిలు వచ్చి నాపై లైంగికదాడికి పాల్పడుతున్నారు.. పక్కరాష్ట్రంలో మా బావ మంత్రిగా ఉన్నాడు.. అయనను పిలిపించండి. అతడు వచ్చి అన్నీ చూసుకుంటాడు.. నన్ను వేధిస్తున్న యువతులపై చర్యలు తీసుకోండి అంటూ మరో యువకుడి ఫిర్యాదు.

అసలు ఎందుకిలా..!

తీవ్రమైన మానసిక సమస్యలున్నవారు ఇలాంటి ఆలోచనలు చేస్తుంటారు. వారు సమస్యలను ఊహించుకుంటారు. ఎక్కువగా వంశపారంపర్యంగా మానసిక వ్యాధులున్న కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు కనిపిస్తుంటాయి. ప్రస్తుతం సమాజంలో చోటుచేసుకుంటున్న మార్పులను తట్టుకోలేనివారు, ఏకాంతంగా ఉంటూ ఆలోచన చేసేవారు, ఇతరులను కలిస్తే వాళ్లు ఏమనుకుంటారోనని ఆందోళనకు గురయ్యేవారు, వయస్సు పెరుగుతుంటే ఇతరులను కలుసుకునేందుకు జంకుతూ ఒంటరితనానికి అలవాటు పడేవారు, అనారోగ్యాలతో ఉండేవారిలో వారిలో ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. ఏవేవో జరిగినట్టు ఊహించుకుంటుంటారు. చెవిలో మాటలు విన్పించినట్టు అనిపిస్తుంది. ఏదో ఊహించుకొని అది నిజమని నమ్మేసి పోలీసులకు వద్దకు పరుగెత్తుతారు. తక్షణమే తమ సమస్య పరిష్కారం కావాలని పోలీసుల వెంట పడుతారు.

ప్యారనాయిడ్ ష్కీజోఫ్రేనియా లక్షణాలు

-ఏవేవో ఊహలు కలుగుతుంటాయి. ఎవరో తరుముతున్నట్టు భావిస్తారు.
-తమ ప్రతి చర్యను ఎవరో గమనిస్తున్నట్టు, ప్రభుత్వం తమ మీద నిఘాపెట్టినట్టు ఆందోళనకు గురవుతుంటారు.
-చుట్టూ ఉన్న ప్రతిఒక్కరూ తమను దెబ్బతీయాలని చూస్తున్నట్టు భ్రమలు కలుగుతుంటాయి.
-చెవిలో ఏవో శబ్దాలు వినపడుతుంటాయి. ఎవరో తన గురించే మాట్లాడినట్టు అనిపిస్తుంది.
-ఎవరో తమ మీద దాడికి ప్రయత్నిస్తున్న భావనలు కలుగుతాయి. దాడి జరిగిపోయినట్టు కలవరపడిపోతుంటారు.
-తోటి ఉద్యోగి, లేదా ఇరుగుపొరుగు తమపై విషప్రయోగం చేసినట్టు అనుమానాలు పడుతుంటారు.
-ఇవన్నీ భ్రమలే, అనవసరంగా అన్నీ ఊహించుకుంటున్నారు అని చెప్తే ఒప్పుకోకుండా తగాదాకు దిగుతారు.

కుటుంబసభ్యులను పిలిపిస్తున్నాం

Cyber-crimes-Ci
ఇటీవలికాలంలో మాకు ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. ఇలాంటి కేసులు వచ్చినప్పుడు మొదట్లో గందరగోళానికి గురయ్యేవాళ్లం. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై ఒకటిరెండు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని పిలిపించి విచారణ చేశాం. అయితే వాళ్లకు వీళ్లతో ఎలాంటి పరిచయాలు కూడా లేకపోవడం, వీరు చెప్పేదానికి ఎలాంటి పోలిక లేకపోవడంతో మాకు ఏం చేయాలో తోచలేదు. ఇలాంటి కేసులపై మానసికనిపుణులతో కూడా చర్చించాం. వారిద్వారానే అనేక విషయాలు తెలుసుకున్నాం. ఆ తరువాత ఇలాంటి ఫిర్యాదులు ఇచ్చినవారితో కలివిడిగా మాట్లాడుతున్నాం. ఫిర్యాదుదారుల మానసిక పరిస్థితిని అంచనా వేస్తున్నాం. వారు ఇచ్చిన ఫిర్యాదులపై సమగ్ర దర్యాప్తు జరిపామని అవన్నీ నిజం కాదనే విషయాన్ని వారికి తెలిసేవిధంగా వివరిస్తున్నాం. వారి కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఏది ఊహ అనే విషయాలపై స్పష్టత ఇస్తున్నాం. ఫిర్యాదుదారుడి కుటుంబసభ్యుల్లో కూడా ఇలాంటి లక్షణాలుంటే వారిని కూడా పిలిపిస్తున్నాం. వారి వ్యాధి గురించి అర్థం చేయించి కౌన్సెలింగ్ ఇస్తున్నాం.
-చాంద్‌భాషా, సైబర్‌క్రైమ్స్ ఇన్స్‌పెక్టర్

తమకు ఏ సమస్యా లేదంటారు

gowridevi
మానసిక సమస్యలతో బాధపడేవారిలో ఇలాంటి సమస్య కనిపిస్తుంటుంది. దీనికి మానసిక వైద్యులను తప్పనిసరిగా సంప్రదించాల్సిన అవసరముంటుంది. కొన్నాళ్లు మందులు వాడితే వారి మానసిక పరిస్థితిలో మార్పు వస్తుంది. ప్యారనాయిడ్ స్కీజోఫ్రేనియా లక్షణాలు ఉన్నవారు ఇలా చేస్తుంటారు. ఇలాంటి మానసికవ్యాధితో బాధపడేవారు చెప్పే విషయాలు మానసిక పరిపక్వత లేనివిగా ఉంటాయి. ఈ లక్షణాలతో ఉన్న వారు మాత్రం తమకు ఎలాంటి సమస్య లేదంటూ ఇతరులతో కొట్లాడుతారు. ఇలాంటివారు ఇచ్చే ఫిర్యాదులపై పోలీసులు దర్యాప్తు చేయడం వల్ల వారి సమయం వృధా అవుతుంది. కుటుంబంలో ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉన్నాయా అని ఆరా తీయాలి, ఎక్కువగా వంశపార్యంపరంగా ఈ లక్షణాలు వస్తుంటాయి. దానికితోడు ప్రస్తుతం సమాజంలో చోటుచేసుకుంటున్న మార్పులతో ఒంటరితనం, ఇతరులతో కలిసి ఉండలేని స్వభావం వల్ల కూడా ఇవి కన్పిస్తున్నాయి. ఇలాంటి లక్షణాలు కన్పిస్తే కుటుంబ సభ్యులు వెంటనే వారిని మానసిక వైద్యులకు చూపించి, సరైన చికిత్స చేయించడం వల్ల వారు తిరిగి కోలుకుంటారు. ఒకరి మైండ్‌ను మరొకరు దోచేస్తారనడంలో నిజం లేదు.
- గౌరీదేవి, మానసిక వైద్యురాలు

4932
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS