మోసగాడు బెనర్జీ అరెస్ట్


Fri,July 12, 2019 02:20 AM

Rachakonda police arrest inter state criminal in Odisha

-విశాఖ కస్టమ్స్ అధికారినంటూ పరిచయాలు
-50 శాతం ధరకే బంగారం అంటూ బురిడీ
-పెట్టుబడికి 30% వడ్డీ ఇస్తానంటూ మోసం
-రెండున్నర ఏండ్ల తర్వాత దొరికిన మోసగాడు
-వివరాలు వెల్లడించిన రాచకొండ కమిషనర్ మహేశ్‌భగవత్

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మాయ మాటలు చెప్పి ప్రజలను పెద్ద మొత్తంలో మోసం చేయడంలో దిట్ట. రెండున్నర సంవత్సరాలుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరిగుతున్నాడు. చివరకు ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో పట్టుబడ్డాడు. నేరేడ్‌మెట్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో గురువారం సీపీ మహేశ్‌భగవత్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అంటిల్లా గ్రామానికి చెందిన సౌమెన్ బెనర్జీ 2013లో సొంతూరులో మెసాలకు పాల్పడి తన మకాంను హైదరాబాద్ శివారులోని చెంగిచర్ల ప్రాంతానికి మార్చాడు. వైజాగ్ పోర్ట్‌లో కస్టమ్స్ అధికారిగా పనిచేస్తున్నట్టు చెప్తూ స్థానికులతో పరిచయం పెంచుకొన్నాడు. అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన బంగారాన్ని 50 శాతం తక్కువ ధరకు ఇప్పిస్తానంటూ స్థానికంగా లక్షల్లో డబ్బు వసూలుచేశాడు.

నమ్మకం కుదిరేందుకు కొందరికి బంగారం బిస్కెట్లను ఇచ్చాడు. అనంతరం చెంగిచర్ల, మారేడ్‌పల్లిలో గ్రోసరీ దుకాణాలు పెట్టి.. పరిచయాలు పెంచుకొని వ్యాపారంలో పెట్టుబడి పెడితే 30 శాతం లాభం వచ్చేలా చేస్తానని చాలా మంది వద్ద పెద్దమొత్తంలో వసూలుచేశాడు. పలువురికి 30 శాతం వడ్డీ కూడా చెల్లించాడు. విలాసవంతమైన విందులు ఏర్పాటుచేస్తూ, విమానాల్లో పర్యటనలకు తీసుకెళ్తూ, ఖరీదైన కార్లు, విల్లాలు కొనుగోలు చేసి ఆకట్టుకొన్నాడు. చివరకు 31 జనవరి 2017 నుంచి కనిపించకుండాపోయాడు. మరుసటిరోజు నుంచి బెనర్జీ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ అయి ఉండటంతో మోసపోయామని గ్రహించిన పలువురు బాధితులు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదుచేశారు.

BENERJEE-ACCUSED2

బెనర్జీ మోసం ఐదు కోట్లు పైమాటే..

సౌమెన్ బెనర్జీ దాదాపు రూ.5 కోట్ల వరకు ప్రజలను మోసం చేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. బెనర్జీని పట్టుకునేందుకు ఎస్వోటీ పోలీసులు శ్రమిస్తున్న సందర్భంలో మహారాష్ట్ర నాగ్‌పూర్ రైల్వేస్టేషన్‌లో ఉన్నట్టు గుర్తించినా దొరుకలేదు. మరోసారి అమృత్‌సర్‌లో ఉన్నట్టు సమాచారం అందినా తప్పించుకొన్నాడు. అమృత్‌సర్‌లో కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసినట్టు తెలిసింది. అక్కడి నుంచి జార్ఖండ్‌కు.. ఒడిశాకు మకాం మార్చాడు. ఎస్వోటీ పోలీసులు భువనేశ్వర్ వెళ్లి బెనర్జీని అదుపులోకి తీసుకొన్నారు. కస్టమ్స్ అధికారిగా, యాంటీ కరప్షన్ ఇన్వెస్టిగేటర్‌తోపాటు వివిధ కంపెనీల జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నట్టు తప్పుడు ఐడీకార్డులు సృష్టించి మోసం చేసినట్టు గుర్తించారు.

ఆయన నుంచి 25 నకిలీ స్టాంపులు, ఓటరు ఐడీ కార్డులు, తన కుమారుడి కోసం తయారుచేసిన నకిలీ ఇంటర్‌మీడియట్ సర్టిఫికెట్, పలు సిమ్ కార్డులు, పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకొన్నారు. బెనర్జీని అరెస్టు చేయడంతో కుషాయిగూడ, మేడిపల్లి పీఎస్‌ల పరిధిలో నమోదైన కేసుల మిస్టరీ వీడిపోనున్నది. బెనర్జీని అరెస్టుచేసిన మల్కాజ్‌గిరి ఎస్వోటీ బృందాన్ని సీపీ మహేశ్‌భగవత్ అభినందించి రివార్డులు ప్రకటించారు. కస్టడీలోకి తీసుకొని మరింత లోతుగా విచారించేందుకు రాచకొండ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఎవరు కూడా తక్కువ ధరకు బంగారం అమ్మకం జరుపరు అనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని కమిషనర్ మహేశ్‌భగవత్ సూచించారు.

853
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles