ఉద్యోగాల పేరిట కోట్లకు టోకరా


Thu,February 21, 2019 02:49 AM

Rachakonda CP Mahesh Bhagwat Press Meet on fake job consultancy

-దేశవ్యాప్తంగా వందమందికి టోపీ
-ఎస్బీఐ, ఇన్‌కంట్యాక్స్,రైల్వే ఉద్యోగాలంటూ వసూళ్లు
-కోల్‌కతా కేంద్రంగా ఆపరేషన్
-బాధితుల్లో తెలుగు రాష్ర్టాలవారు

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నిలువుదోపిడీ చేస్తున్న నలుగురు మోసగాళ్లను రాచకొండ ఎస్వోటీ, ఉప్పల్ పోలీసులు అరెస్టుచేశారు. వీరినుంచి రూ.30 లక్షల విలువచేసే సొత్తును స్వాధీనం చేసుకొన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్‌కంట్యాక్స్, రైల్వేల్లో ఉద్యోగాలంటూ మోసం చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కన్సల్టెన్సీ ముసుగులో నిరుద్యోగులను సమకూరుస్తున్న శ్రీకాంత్ అనే వ్యక్తిని ఇప్పటికే రిమాండ్‌కు తరలించారు. ఒడిశాకు చెందిన మాస్టర్‌మైండ్ కాలూచరణ్‌పాండా నేతృత్వంలో ఏర్పాటైన ఈ ముఠా పశ్చిమబెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో నిరుద్యోగులను మోసం చేసేందుకు సిద్ధమైందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. బుధవారం ఎల్బీనగర్‌లోని రాచకొండ క్యాంపు కార్యాలయంలో కమిషనర్ మహేశ్‌భగవత్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని బెర్హంపూర్ పట్టణానికి చెందిన కాలూచరణ్‌పాండా 2015లో హైదరాబాద్‌లోని ఓ కన్సల్టెన్సీలో పనిచేశాడు. తర్వాత మకాంను కోల్‌కతాకు మార్చి అక్కడ కన్సల్టెన్సీని ప్రారంభించాడు. ఎస్‌బీఐ ట్రైనింగ్ సెంటర్ పేరుతో నిరుద్యోగులను ఆకట్టుకొన్నాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్‌కంట్యాక్స్, రైల్వేల్లో బ్యాక్‌డోర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ప్రచారంచేశాడు. ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు డిమాండ్‌చేసి వసూలుచేశాడు. హైదరాబాద్‌లో పనిచేస్తున్నప్పుడు పరిచయమైన వనస్థలిపురానికి చెందిన చింతకింది శ్రీకాంత్‌ను 2017లో సంప్రదించి నిరుద్యోగులను తనవద్దకు పంపాలని, భారీగా కమిషన్ ముట్టజెప్తానని ఆశపెట్టాడు.

దాంతో శ్రీకాంత్ కోల్‌కతా వెళ్లి తన పేరును సుధామగా మార్చుకుని ఓ గదిలో ఆఫీసు ప్రారంభించాడు. తెలుగు రాష్ర్టాల్లోని నిరుద్యోగులకు గాలంవేసివారిని కోల్‌కతాకు పిలిపించుకొని మూడునెలల శిక్షణ అంటూ కొన్ని తరగతులను నిర్వహించేవారు. డబ్బు వసూలుచేసి పాండాతో కలిసి నకిలీ అపాయింట్‌మెంట్ లేఖలు ఇచ్చి ఉద్యోగం వచ్చిందంటూ పంపేవారు. లేఖలతో సంబంధిత శాఖలను సంప్రదించగా నకిలీవిగా తేలింది. మోసపోయామని గుర్తించిన కొందరు రాచకొండ పోలీసులను ఆశ్రయించారు. రాచకొండ పోలీసులు ఈ నెల 18న శ్రీకాంత్‌ను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తులో కాలూచరణ్‌పాండా, శ్రీకాంత్‌కు సహకరించిన మరికొందరి పాత్రను గుర్తించారు. బుధవారం కాలూచరణ్‌పాండాతోపాటు మురళీకృష్ణ, మేదపాటి వీరరాఘవరెడ్డి, కడియాల సంధ్యరాణిని అరెస్టుచేశారు. కాళీనాథ్, హేమంత్, అనిల్, రాజీవ్‌కార్తీక్, పానుగంటి వెంకటేశ్, అశోక్‌రావు, అలోక్‌వర్మ పరారీలో ఉన్నారు.

నిందితుల నుంచి కారుతోపాటు మూడు ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్, ఏడు మొబైల్‌ఫోన్లు, పాస్‌పోర్టు, బంగారునగలు, నగదు, నకిలీ అపాయింట్‌మెంట్ లేఖలను స్వాధీనంచేసుకొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురి నుంచి రూ.మూడు కోట్లు వసూలు చేసినట్టు తేలింది. దేశవ్యాప్తంగా దాదాపు వందమందికిపైగా నిరుద్యోగులను నిలువుదోడిపీ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏపీ గుంటూరులో కన్సల్టెన్సీ నిర్వాహకురాలు సంధ్యరాణి.. శ్రీకాంత్‌తో చేయికలిసి నిరుద్యోగులకు ఎరవేసి పోలీసులకు దొరికిపోయింది. ఆమె 35 మంది నుంచి రూ.1.6 కోట్లు వసూలుచేసి రూ.80 లక్షలను శ్రీకాంత్‌కు చెల్లించినట్టు విచారణలో తేలింది.
job-gang
నిరుద్యోగుల సొమ్ముతో నిందితుల జల్సాలు
నిరుద్యోగుల నుంచి రూ.1.5 కోట్ల మేర దోచుకొన్న కాలూచరణ్‌పాండా కోల్‌కతాలో ఓ ఫ్లాట్‌ను కొనుగోలు చేసి అడ్వాన్సుగా రూ.50 లక్షలు చెల్లించాడు. బ్యాంకాక్ వెళ్లి జల్సాలు చేశాడు. శ్రీకాంత్ తాను వసూలుచేసిన మొత్తంతో స్విఫ్ట్ డిజైర్ కారు కొని.. కొంత మొత్తాన్ని కుటుంబసభ్యుల వద్ద దాచాడు. నిరుద్యోగులు ఎవరైనా బ్యాక్‌డోర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నమ్మవద్దని, పోలీసులకు సమాచారం ఇవ్వాలని రాచకొండ కమిషనర్ మహేశ్‌భగవత్ సూచించారు. ముఠాను అదుపులోకి తీసుకొన్న ఎస్వోటీ, ఉప్పల్ పోలీసులను అభినందించారు. మీడియా సమావేశంలో అదనపు డీసీపీ (ఎస్వోటీ) సురేందర్‌రెడ్డి, మల్కాజిగిరి ఏసీపీ సందీప్ తదితర అధికారులు పాల్గొన్నారు.

919
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles