పీవీ పరబ్రహ్మశాస్త్రి కన్నుమూత


Thu,July 28, 2016 02:25 AM

pv parabrahma sastry passes away

-ప్రముఖ శాసన పరిశోధకుడు, చరిత్రకారుడు
-బ్రెయిన్ హెమరేజ్‌తో చికిత్స పొందుతూ మృతి
-నేడు అంత్యక్రియలు
-సీఎం కేసీఆర్ సంతాపం

నమస్తే తెలంగాణ, హైదరాబాద్ సిటీబ్యూరో, అంబర్‌పేట: తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణంలో అహర్నిశలు కృషిచేసిన చరిత్ర పరిశోధకుడు డాక్టర్ పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి (పీవీ పరబ్రహ్మ శాస్త్రి) బుధవారం కన్నుమూశారు. బ్రెయిన్ హెమరేజ్‌కు గురై దవాఖానలో చికిత్స పొందుతూ సాయం త్రం 5.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. 95 సంవత్సరాల శాస్త్రికి భార్య పుచ్చా మహాలక్ష్మి, కుమారుడు పీవీ రామ్, ముగ్గురు కుమార్తెలు జయలక్ష్మి, సరస్వతి, మీనా ఉన్నారు. సంస్కృతం, తెలుగు భాషల్లో సమాన ప్రతిభా సంపత్తులను సొంతం చేసుకున్న ఆయన ఎన్నో శాసనాలను, నాణాలను పరిశీలించి తెలంగాణ చరిత్రపై కొత్త వెలుగులు ప్రసరింపజేశారు. ఆయన రాసిన కాకతీయాస్ ఆఫ్ వరంగల్ గ్రంథం ఓరుగల్లు పాలకుల చరిత్రకు ప్రామాణికంగా నిలిచింది. పీవీ పరబ్రహ్మ శాస్త్రి గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామంలో పుచ్చా వెంకటేశ్వర్లు, రుక్మిణమ్మ దంపతులకు 1921 జూన్‌లో జన్మించారు. 1938లో ఓల్డ్ మద్రాస్ ప్రెసిడెన్సీలో పాఠశాల విద్యను, 1948లో బీఎస్సీ డిగ్రీని పూర్తి చేశారు.
PV
పిఠాపురంలో వ్యాకరణ, తర్క, వేదాల్లో నిష్ణాతులైన వారణాసి సుబ్రమణ్యశాస్త్రి దగ్గర శిష్యరికం చేశారు. 1948లో పోలీస్ యాక్షన్ తర్వాత వరంగల్ జిల్లా జనగాంకు వచ్చి అక్కడ తెలుగు మీడియం హైస్కూల్‌లో హెడ్ మాస్టర్‌గా చేరారు. మూడేళ్ల తర్వాత హైదరాబాద్‌కు వచ్చి కేశవ మెమోరియల్ హైస్కూల్‌లో గణితం, సైన్స్ ఉపాధ్యాయుడిగా సేవలందించారు. 1955లో బెనారస్ హిందూ యూనివర్శిటీ నుంచి సంస్కృతంలో డిగ్రీ పొందారు. 1959లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంలో ఎపిగ్రఫీ అసిస్టెంట్ ఉద్యోగంలో చేరారు. పురావస్తు శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్‌గా వివిధ హోదాలలో పనిచేసిన ఆయన 1981 పదవీ విరమణ పొందారు.
శాసన పరిశోధనలో అద్భుత ప్రజ్ఞ: తన సహాధ్యాయులతో కలిసి వరంగల్, కరీంనగర్, నల్గొండ, కడప జిల్లాల్లో అనేక గ్రామాలను తిరిగి శాసనాలను కనుగొని రికార్డు చేశారు.

ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖలో 25 సంవత్సరాలపాటు సేవలందించిన పీవీ పరబ్రహ్మశాస్త్రి 2 వేలకు పైగా శాసనాలను పరిష్కరించారు. శాసనగ్రంథాల రచనతోపాటు చరిత్ర రచన చేసిన పీవీ పరబ్రహ్మశాస్త్రి భారత చరిత్రకారులకు మార్గదర్శకుడిగా నిలిచారు. ఖమ్మంజిల్లా బయ్యారం చెరువు వద్ద లభించిన కాకతీయ శాసనాన్ని పరిష్కరించి, కాకతీయ చక్రవర్తుల వంశక్రమణికను పునర్నిర్మించారు. వరంగల్‌లో లభించిన శాసనం ఆధారంగా రాయగజకేసరి బిరుదు కాకతీయ చక్రవర్తులలో రాణీ రుద్రమదేవికే వర్తిస్తుందని తేల్చిచెప్పారు. గణపతి దేవుడు వేయించిన బయ్యారం చెరువు శాసనం కాకతీయ చరిత్రకు ఒక ముఖ్యమైన ఆధారం. కాకతీయులు ఎలా అవిర్భవించారు, పశ్చిమ చాళుక్యుల సామంతులుగా ఎలా హనుమకొండలో స్థిరపడ్డారనే విషయాన్ని ఈ శాసనం చెప్తుంది. వెయ్యిస్తంభాల గుడి శాసనంలో రెండో ప్రోలరాజు అతడి కుమారుడు రుద్రదేవునికి సంబంధించిన సమాచారాన్ని అంతకుముందు శాసన పరిశోధకులు సరిగా వ్యాఖ్యానించలేదని ఆయన భావించారు. పీవీ శాస్త్రి ఆ శాసనాన్ని పరిష్కరించి కాకతీయ రుద్రదేవుడు క్రీశ 1163లో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడానికి దారితీసిన పరిస్థితులను వివరించగలిగారు. పరబ్రహ్మశాస్త్రి తెలంగాణ చరిత్రకు ఇచ్చిన అత్యంత ముఖ్యమైన కానుక రుద్రమదేవి మరణానికి సంబంధించిన శాసనాన్ని పరిష్కరించడం. నల్గొండ జిల్లా చందుపట్ల శాసనాన్ని బట్టి రుద్రమదేవి క్రీ.శ.1290 నవంబర్‌లో మరణించారని ప్రకటించారు. కాయస్త అంబదేవుని తిరుగుబాటును అణచడానికి స్వయంగా రుద్రమదేవి కదనరంగానికి వెళ్లింది. ఆ యుద్ధంలోనే 80 ఏళ్ల వయసులో ఆమె మరణించిందని చెప్పారు. కాకతీయులపై పరిశోధనకు కర్నాటకలోని ధార్వాడ్ వర్శిటీ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.

బహుగ్రంధ కర్త: ప్రకాశం జిల్లా బబ్బేపల్లిలో లభించిన పల్లవరాజుల శాసనం ఆధారంగా పల్లవ రాజవంశానుక్రమణికను రూపొందించారు. చైతన్యపురిలో లభించిన ప్రాకృత శాసనం విష్ణుకుండిన మూలపురుషుడిదేనని తేల్చిచెప్పారు. శాసనాల పరిష్కారంతోపాటు వాటిని ప్రచురించడానికి ఆయన కృషి చేశారు. కరీంనగర్, వరంగల్, కడప జిల్లాల శాసన సంపుటాలను ఆయన ప్రచురించారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర సంకలనాలకు, 1964 నుంచి 69 వరకు పురావస్తుశాఖ వార్షిక శాసన గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. కాకతీయులు, కాకతీయుల శాసన సాహిత్యం, ప్రాచీనాంధ్ర చరిత్రలో గ్రామీణ జనజీవనం, తెలుగు భాష - పుట్టుపూర్వోత్తరాలు, ఎపిగ్రాఫీయా ఆంధ్రికా గ్రంథాలు రచించారు. భారతీయ ఇతిహాసిక పరిశోధనా మండలి ప్రచురించిన ఆంధ్రప్రదేశ్‌లో విజయనగర శాసనాలు గ్రంథాన్ని రాశారు. శాసన పరిశోధన, చరిత్ర రచనలో విస్తృతంగా సేవలందించిన పీవీ పరబ్రహ్మశాస్త్రి అనేక అవార్డులు అందుకున్నారు. ఇండోర్‌లోని కుంద కుండాచార్య జ్ఞానపీఠం ఆయనకు ప్రతిష్టాత్మకమైన కుంద కుండాచార్య అవార్డు, తామ్ర ప్రశంసాపత్రంతో గౌరవించింది.

నేడు అంత్యక్రియలు: డాక్టర్ పీవీ పరబ్రహ్మ శాస్త్రి భౌతికకాయాన్ని అభిమానులు, బంధుమిత్రుల సందర్శనార్థం గురువారం ఉదయం 10 గంటల వరకు నల్లకుంటలో ఉన్న ఆయన నివాసంలో ఉంచుతున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. 10:30 గంటలకు బన్సీలాల్‌పేట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తామని బంధువులు పేర్కొన్నారు.

ప్రముఖుల నివాళి: పీవీ పరబ్రహ్మ శాస్త్రి తెలంగాణ చరిత్ర, తెలుగు భాష, లిపిపై చేసిన పరిశోధన ఎనలేనిదని ఇంటాక్ తెలంగాణ కన్వీనర్ వేదకుమార్ పేర్కొన్నారు. తెలంగాణ చరిత్ర పునర్నినిర్మాణ కాలంలో ఆయన మరణించడం తీరని లోటని వేదకుమార్ అన్నారు. డాక్టర్ పీవీ పరబ్రహ్మ శాస్త్రి మృతితో గొప్ప శాసన పరిశోధకుడిని, చరిత్రకారుడిని కోల్పోయామని ఏపీ పురావస్తు శాఖలో ఉద్యోగవిరమణ చేసిన స్థపతి ఈమని శివనాగిరెడ్డి పేర్కొన్నారు.

కాకతీయ పరబ్రహ్మం..!


వరంగల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి: ప్రముఖ చరిత్రకారుడు వీపీ పరబ్రహ్మశాస్త్రి మరణవార్త విని ఓరుగల్లు దిగ్భ్రాంతి చెందింది. కాకతీయులపై సాధికారికమైన, ఆధారభూతమైన పరిశోధనలు చేసిన గొప్పవ్యక్తి వీపీ పరబ్రహ్మశాస్త్రి అని కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన పలువురు చరిత్ర పరిశోధకులు నివాళులు అర్పించారు. కాకతీయుల చరిత్రపైన క్షేత్రస్ధాయిలో పరిశోధనలు చేసిన తొలి వ్యక్తి అని, ఇవాళ ఎవరు కాకతీయులపైన ఏ కోణంలో పరిశోధనలు చేసినా వారికి తొలి గురువుగా పరబ్రహ్మశాస్త్రి ది కాకతీయాస్ సిద్థాంత గ్రంథమే నిలుస్తుందని ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రిసెర్చ్ (ఐసీహెచ్‌ఆర్) చైర్మన్ ప్రొఫెసర్ వై సుదర్శన్‌రావు పేర్కొన్నారు. దక్షిణ భారత దేశంలో శాసనాధారిత చరిత్ర అధ్యయనం చేసిన అతికొద్దిమందిలో పరబ్రహ్మశాస్త్రి ఒకరని ఆయన అన్నారు. ప్రముఖ చరిత్రకారుడు బీఎన్ శాస్త్రితో కలిసి పరబ్రహ్మశాస్త్రి చేసిన అధ్యయనాలు, పరిశోధనలు చాలా విలువైనవని అంటూ ఇటీవలే ఐసీహెచ్‌ఆర్ పరబ్రహ్మశాస్త్రికి నేషనల్ ఫెలోషిప్ ప్రకటించిందన్నారు. కాకతీయులపై సాధికారికమైన గ్రంథం ఇప్పటికీ ఎప్పటికీ పరబ్రహ్మశాస్త్రి రాసిన కాకతీయాస్ మాత్రమేనని కాకతీయ విశ్వవిద్యాలయం చరిత్రశాఖ ప్రొఫెసర్ కే విజయబాబు అన్నారు. వయస్సు మీద పడ్డా హిస్టరీ కాంగ్రెస్ సభకు, సెమినార్లకు, సదస్సులకు వెళ్లేవారని, ఆయనలోని జ్ఞానతపన చరిత్ర విద్యార్థులకు ఆచరణీయమన్నారు.

సీఎం కేసీఆర్ సంతాపం
ప్రముఖ చరిత్రకారుడు, శాసన పరిశోధకుడు పీవీ పరబ్రహ్మశాస్త్రి మృతిపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం ప్రకటించారు. శాస్త్రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. శాసనాలు, నాణేల పరిశోధనలో సుప్రసిద్ధుడైన శాస్త్రి చరిత్రకారులకు ఆదర్శంగా నిలిచారని సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు.

2249
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles