వెల్లువెత్తిన తెలుగు కవిత


Wed,December 20, 2017 02:12 AM

Public reputations honored by the poets

- విజయవంతమైన బృహత్‌కవి సమ్మేళనం
- ఐదు రోజుల్లో 900 మంది కవుల కవితాగానం
- కవులను ఘనంగా సత్కరించిన ప్రజాప్రతినిధులు
gongidi-sunitha
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ కవితా సరస్వతి పులకించి పోయింది. ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో ఐదురోజుల పాటు అద్భుతంగా జరిగిన బృహత్‌కవిసమ్మేళనం తెలంగాణ కవితావైభవాన్ని అపూర్వంగా ప్రదర్శించింది. దాదాపు 900మంది కవులు తమ కవితాగానంతో తెలంగాణ తల్లికి అభిషేకం చేశారు. ఈ మహా కవిసమ్మేళనంలో కవితలను వినిపించేందుకు సమయం ఇచ్చే పరిస్థితి లేక మరో రెండు వేదికలను ఏర్పాటు చేయవలసి వచ్చిందంటే తెలంగాణలో కవితాస్రవంతి ఎంత మహోన్నతంగా ప్రవహిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. చివరిరోజైన మంగళవారం నాలుగు దశలుగా బృహత్‌కవి సమ్మేళనం జరిగింది. ఉదయం తొలి దశ కవిసమ్మేళనానికి హైదరాబాద్ నగర డిప్యూటీమేయర్ బాబా ఫసియుద్దీన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అక్షరానికి ఉన్న విలువ అమోఘమైనదని, అక్షరం అమ్ముడుపోదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
s-niranjan-reddy
కవి, కళాకారులు మనసుతో ఈ ప్రపంచాన్ని చూస్తారని, ఏ అంశాన్నైనా హృదయానికి హత్తుకొనేలా కవితలు రాస్తారని అభినందించారు. తనకు జన్మనిచ్చిన తల్లి ఉర్దూ నేర్పితే, తెలంగాణ తల్లి తెలుగు నేర్పిందని పేర్కొన్నారు. తరువాతి విభాగంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎస్ నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ సాహిత్యంలో ఎంతటి అసాధ్యమైన పనినైనా సాధించగల సత్తా ఉన్నదని చెప్పారు. భాష యాసకు అవమానం జరిగినందువల్లనే తెలంగాణలో ప్రజలు భాషాసాహిత్యాలనే ఆయుధంగా చేసుకొని స్వరాష్ట్రం తెచ్చుకొన్నారని గుర్తుచేశారు. తెలంగాణలో తెలుగును అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. సామాజిక మార్పుకోసం కవులు, కళాకారులు భావితరాల వారికి ఆదర్శంగా నిలువాలని కోరారు. తరువాతి దశలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మాట్లాడుతూ తెలుగు మహాసభలు పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయని, పరిపాలనంతా తెలుగులోనే నిర్వహించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. చివరి సదస్సుకు ప్రముఖ సాహిత్యవేత్త బెల్లియాదయ్య అధ్యక్షత వహించారు.
baba-fasiuddin

900 మంది కవులకు ఘన సన్మానం

ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం వేదికగా ఐదు రోజులపాటు జరిగిన బృహత్‌కవి సమ్మేళనంలో దాదాపు 900 మందికి పైగా కవులను రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ సాహిత్య అకాడమీ తరపున ఘనంగా సన్మానించారు. కవులను శాలువాలతో సన్మానం, ప్రశంసాపత్రం, మెమొంటో, రూ. 3వేల నగదుతో సత్కరించారు. మొత్తం 5 రోజుల్లో 31 విభాగాలుగా ఈ బృహత్‌కవి సమ్మేళనం జరిగింది. ప్రతి విభాగంలో దాదాపు 25మంది కవిలకు తమ కవితలను వినిపించే అవకాశం కలిగింది. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో సమయాభావం వల్ల 775 మందికి మాత్రమే అవకాశం లభించింది. దీంతో రెండో వేదికను ఏర్పాటు చేసి మరో 125 మంది కవులకు తమ కవితలను వినిపించేందుకు అవకాశం కల్పించారు. సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి ప్రత్యేక చొరువ చూపి కవులను సంతృప్తి పరిచారు.

4023
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles