అడవి దొంగల వేట


Sun,January 13, 2019 02:42 AM

Proposals for using the PD Act on 15 people

-450 మంది బడా స్మగ్లర్ల జాబితా రెడీ..
-పోలీస్, అటవీశాఖ సంయుక్త దాడులకు నిర్ణయం
-15 మందిపై పీడీ చట్టం ప్రయోగించేందుకు ప్రతిపాదనలు

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ / ఇచ్చోడ / గాంధారి: అడవులను మింగే అనకొండల కోసం అటవీ, పోలీస్‌శాఖల వేట మొదలైంది. వేటగాళ్లను పట్టు కోవడానికి అధికారులు, పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. కట్టెకోత మిల్లుల్లో సోదాలు జరుపుతూ అక్రమ కలపను స్వాధీనం చేసుకొని అనుమానితులను అదుపులోకి తీసుకొంటున్నారు. మొదటిదశలో 450 బడా స్మగ్లర్లు, వేటగాళ్ల జాబితాను అటవీశాఖ సిద్ధంచేసింది. 15మంది హ్యబిచువల్ అఫెండర్స్‌పై (తరచుగా అటవీ నేరాలకు పాల్పడేవారు) ప్రివెన్టివ్ డిటెన్షన్ యాక్ట్ (పీడీ యాక్ట్) కింద కేసులను నమోదుచేసే విషయాన్ని కలెక్టర్లు పరిశీలిస్తున్నారు. అడవులను కాపాడటానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులతో ఇటీవల జరిపిన సమీక్షా సమావేశంలో ఆదేశించారు. అటవీ సంపదను కొల్లగొడుతున్న స్మగర్లపై ఉక్కుపాదం మోపాల్సిందేనని స్పష్టంచేయడంతో అటవీశాఖలో కదలిక వచ్చింది. జిల్లాలవారీగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లను రంగంలోకి దింపి మెరుపుదాడులను చేపట్టింది. ఉద్యోగులకు పండుగ సెలవులను కూడా రద్దుచేసింది. అటవీనేరాల అదుపు, అడవుల రక్షణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అధ్యక్షతన వచ్చేవారం ఉన్నతస్థాయి సమావేశం జరిపేందుకు నిశ్చయించారు. పోలీస్, అటవీ, గిరిజన, గ్రామీణాభివృద్ధిశాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్న ఈ సమావేశంలో.. అడవుల సంరక్షణ, అభివృద్ధిపై ఉమ్మడి వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు.

పీడీ యాక్ట్ ప్రయోగానికి ప్రతిపాదనలు

అడవులను ధ్వంసంచేస్తున్న స్మగర్లపై అటవీశాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. వారి కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతూ దాడులు చేస్తున్నది. అధికారులు రెండురోజులుగా ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ఇచ్చో డ, ఖానాపూర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లా ఎల్లమ్మగూడ తదితర ప్రాంతాల్లో మెరుపుదాడులు చేసి పెద్దమొత్తంలో కలప పట్టుకొని, పలువురిని అదుపులోకి తీసుకొన్నారు. స్మగ్లర్లను పట్టుకోవడంలో, అటవీనేరాలను అదుపుచేయడంలో అటవీశాఖకు సహకారమందించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్ని జిల్లాల పోలీస్ అధికారులకు లేఖ రాశారు. జిల్లాలవారీగా అటవీ, పోలీసు అధికారుల నేతృత్వంలో జాయింట్ యాక్షన్ కమిటీలు ఏర్పడి అటవీ పరిరక్షణకు నడుం బిగించాయి. ఉత్తర తెలంగాణలో దాదాపు వంద ప్రాంతాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించి దాడులు చేపట్టారు. అటవీ భూమిని కబ్జా చేసినవారినీ గుర్తిస్తున్నారు. అక్రమ కలప నిల్వ ఉంచుతున్న కోత మిల్లులను గుర్తించి నోటీసులు జారీచేస్తున్నారు. కలప స్మగ్లింగ్‌నే వృత్తిగా పెట్టుకొన్న ముల్తానీలు, గుత్తికోయల కదలికలపై దృష్టిసారించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొంటూనే మరోవైపు వారికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపేలా ద్విముఖ వ్యూహంతో ముందుకు కదులుతున్నారు. తొలిదశగా 15 మందిపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించేందుకు అధికారులు రంగం సిద్ధంచేశారు.

smugglers2

అటవీ సిబ్బంది ముమ్మర దాడులు

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ఎల్లమ్మగూడలో శనివారం కవ్వాల్ టైగర్ జోన్ సిరిచెల్మ రేంజ్ సిబ్బంది దాడులు చేసి రూ.1.6 లక్షల విలువైన 15 దుంగలను, కలప రవాణా కోసం సిద్ధంచేసిన రెండు ట్రాక్టర్లను పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని నేరల్‌తండాలో శనివారం గబ్బర్‌సింగ్ నివాసంలో అక్రమంగా నిలువ ఉంచిన రూ.8 వేల విలువైన 19 టేకు దుంగలను అటవీశాఖ అధికారులు పట్టుకొన్నారు.

2046
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles