కాళేశ్ 'వ‌రం'


Wed,June 19, 2019 02:26 PM

Projects are completed in a phased manner

-వందశాతం పూర్తయ్యేదాక ప్రారంభించకుండా ఉండరు
-45 ఏండ్లయినా నాగార్జునసాగర్ కాల్వలు ఇంకా తవ్వుతున్నారు
-కాళేశ్వరం ప్రాజెక్టులో 64 శాతం పనులు పూర్తయ్యాయి
-మేడిగడ్డ-ఎల్లంపల్లి వరకు 90 శాతానికిపైగా పూర్తి
-యావత్తు తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరాన్ని అడ్డుకోవద్దు
-జాతీయహోదా సాధించేలా మద్దతివ్వండి
-తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం హితవు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సాగునీటి ప్రాజెక్టును ప్రారంభించాలంటే వందశాతం పనులు పూర్తయ్యేదాక వేచి చూడరని.. ఒకసారి ప్రా రంభించి నీటిని విడుదల చేశాక దశలవారీగా పనులు జరుగుతూనే ఉంటాయని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధానకార్యదర్శి ఎం శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పరిధిలో అందుబాటులోకి వచ్చిన కాల్వల నిర్మా ణం ఆధారంగా రిజర్వాయర్లలో నీటిని నింపుకుని సాగునీటిని విడుదల చేస్తారని.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీటివిడుదల చేసిన సమయంలోనూ నాల్గింట ఒకవంతు కాల్వల నిర్మాణం కూడా జరగలేదని చెప్పారు. 45 ఏండ్లయినా ఇంకా ఈ ప్రాజెక్టు కింద కాల్వల నిర్మాణం జరుగుతూనే ఉన్నదన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్యాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు 64 శాతం పూర్తయ్యాయని.. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు 90 శాతానికి పైగా పనులు జరిగాయని తెలిపారు. కాళేశ్వరం పనులు 15 శాతం మాత్రమే పూర్తయ్యాయని, ఈ పనులకే రూ.50 వేల కోట్లు ఖర్చు చేశారంటూ కొందరు చేస్తున్న విమర్శలు సరికాదని హితవుపలికారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు పనుల ఒప్పంద విలువ రూ.11 వేల కోట్లు అని.. సవరణ అంచనా వ్యయాలు రూ.2 వేల కోట్ల వరకు పెరిగే అవకాశముంది తప్ప రూ.50 వేల కోట్లు అనడం విడ్డూరంగా ఉన్నదన్నారు.

మరోవైపు ప్రాజెక్టు పూర్తికాకుండానే నీటిని విడుదల చేస్తున్నారంటూ కొందరు మాట్లాడుతుండటం విచిత్రంగా ఉన్నదని.. ఏ ప్రాజెక్టు నుంచయినా దశలవారీగా నీటి విడుదల చేయడం సర్వసాధారణమని తెలిపారు. గతంలో ఎస్సారెస్పీ ద్వారా ఏకంగా 7-8 దశల్లో నీటిని విడుదలచేసినట్టు గుర్తుచేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నుంచి అందుబాటులో ఉన్న వ్యవస్థల ద్వారా సాగునీటిని అందిస్తారని చెప్పారు. కాళేశ్వరం ద్వారా 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించడంతోపాటు మరో 18.75 లక్షల ఎకరాల స్థిరీకరణ అనేది కూడా అంతర్భాగమేనన్న విషయాన్ని మరచిపోవద్దని అన్నారు. కాళేశ్వరం నీటి విడుదలతో శ్రీరాంసాగర్ రెండుదశల కింద ఉన్న ఆయకట్టు స్థిరీకరణ జరుగనుండటం హర్షణీయమని శ్యాంప్రసాద్‌రెడ్డి అన్నారు. నిన్నటివరకు శ్రీరాంసాగర్‌లోకి వరద వస్తేనే ఈ ఆయకట్టుకు సాగునీరందేదని.. కానీ ఇప్పుడు మేడిగడ్డ నుంచి తరలించే నీటితో ఎస్సారెస్పీ-1, 2 దశల కింద ఉన్న ఆయకట్టుకు పుష్కలంగా అందించవచ్చని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణం జరిగేకొద్దీ ఆయకట్టు విస్తీర్ణాన్ని కూడా పెంచుతారని వివరించారు.

మన ప్రాజెక్టులపై మనమే కేసులా?

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై ఇక్కడి నాయకులే కేసులు వేయడం దురదృష్టకరమని శ్యాంప్రసాద్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. గోదావరి జలాలు వృథాగా సముద్రంలోకి పోకుండా ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రాజెక్టులను చేపడుతుంటే అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. గతంలో ఎస్సారెస్పీ కాల్వల్లో 2-3 వేల క్యూసెక్కులు పారడమే గగనంగా ఉండేదని, కానీ తెలంగాణ సర్కారు రూ.800 కోట్లతో చేపట్టిన ఆధునీకరణ పనులతో పూర్తిస్థాయి డిశ్చార్జి ప్రవాహం కూడా ఉంటుందన్నారు. దీంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో 141 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతున్నందున.. వరుసగా రెండు, మూడేండ్లు వర్షాలు సకాలంలో రాకున్నా తాగు, సాగునీటికి ఢోకా ఉండదని వివరించారు. ఈనెల 21న జరగనున్న కాళేశ్వరం ప్రాజెక్టు నీటివిడుదలను ఒక పండగలా జరుపుకోవాలని, తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులందరూ ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఒక్క పంటకోసం మాత్రమే చేపట్టాలని సూచించారని.. కానీ సీఎం కేసీఆర్ మాత్రం రెండు పంటల కోసం రీడిజైన్ చేశారని రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ వెంకట్రామారావు తెలిపారు. ఈ నేపథ్యంలో రూ.40 వేల కోట్లున్న ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80 వేల కోట్లకు పెరుగడంలో విడ్డూరమేమీ లేదని చెప్పారు. గతంలో 16 లక్షల ఎకరాల కోసం డిజైన్ చేస్తే.. ఇప్పుడు ఏకంగా స్థిరీకరణతోసహా 37 లక్షల ఎకరాలకు సాగునీరందించేలా డిజైన్ చేయడం విశేషమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకే కాకుండా యావత్తు తెలంగాణకూ వరప్రదాయిని అని, ప్రాజెక్టుపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడవద్దని విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు చంద్రమౌళి సూచించారు.

జేపీది దుష్టబుద్ధి

తెలంగాణకు ఎత్తిపోతల పథకాలు భారమంటూ లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్‌నారాయణ మాట్లాడటం ఆయన దుష్టబుద్ధికి నిదర్శనమని రిటైర్డ్ ఇంజినీర్ భూమయ్య అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఎకరాకు రూ.40-50 వేల విద్యుత్ చార్జీలు అవుతాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వాస్తవంగా రూ.1000-1500 మించవని తెలిపారు. రైతుకొచ్చే ఆదాయంలో ఇది పది శాతమేనని.. అయినా ప్రభుత్వమే విద్యుత్తు ఛార్జీలు భరించేందుకు ముందుకొస్తుండగా రైతులకు భారం ఎలా అవుతుందని ప్రశ్నించారు. కాళేశ్వరం బహుళార్థక సాధక ప్రాజెక్టు అని, దీనిద్వారా వ్యవసాయం, దాని అనుబంధ రంగం, పర్యాటకం, మత్స్య, ఉపాధి రంగం అభివృద్ధితోపాటు పట్టణాలకు తాగునీరు పుష్కలంగా లభిస్తుందని పేర్కొన్నారు. సమావేశంలో విశ్రాంత ఇంజినీర్లు కెప్టెన్ జనార్దన్, సత్తిరెడ్డి, దామోదర్‌రెడ్డి, రాంరెడ్డి, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

3306
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles