త్వరలో వర్సిటీల్లో ఖాళీల భర్తీ

Fri,April 21, 2017 02:35 AM

పండుగలా ఉస్మానియా
విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు
26న ప్రారంభ వేడుకలకు రాష్ట్రపతి ప్రణబ్
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెల్లడి

kadiam
హైదరాబాద్, నమస్తే తెలంగాణ:ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాలను ఈ నెల 26, 27, 28 తేదీల్లో పండుగలా నిర్వహించేందుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని, అందరూ సహకరించాలని డిప్యూటీసీఎం కడియం శ్రీహరి కోరారు. మూడు రోజులు ప్రారంభవేడుకలని, ఆ తర్వాత ఏడాది పాటు ఉత్సవాలు కొనసాగుతాయన్నారు. ఓయూ శతాబ్ది ఉత్సవాలపై డిప్యూటీసీఎం కడియం గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే పురాతన విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఓయూ ఎందరో మేధావులు, రాజకీయ నాయకులు, గొప్పవాళ్లను ప్రపంచానికి అందించిందని చెప్పారు. తెలంగాణ యాస, భాష, సంస్కృతితో ఓయూకు అవినాభావ సంబంధం ఉన్నదన్నారు. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించిందని గుర్తుచేశారు. ఈ నిధులతో చేపట్టబోయే నిర్మాణాలకు ఈ నెల 26వ తేదీన రాష్ట్రపతి శంకుస్థాపన చేస్తారన్నారు. ఈ నెల 26వ తేదీన జరిగే శతాబ్ది ఉత్సవాల ప్రారంభ వేడుకలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, సీఎం కేసీఆర్, 27న జరిగే పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, 28న జరిగే జాతీయస్థాయి వీసీల సమావేశానికి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని వివరించారు.

తెలంగాణ జన జీవితాన్ని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. ఓయూలో గౌరవ వేతనాల పెంపునకు సంబంధించి మాజీ వీసీ తిరుపతిరావు ఆధ్వర్యంలో కమిటీ వేశారని, త్వరలోనే కమిటీ నివేదిక మేరకు జీతాల పెంపు ఉంటుందని చెప్పారు. వర్సిటీల్లోని ఖాళీలను భర్తీ చేయడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. సమీక్షలో ఎంపీ కేశవరావు, ప్రభుత్వ సలహాదారులు పాపారావు, రమణాచారి, ఉన్నతవిద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, పర్యాటక కార్యదర్శి బీ వెంకటేశం, సాంస్కతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, ఉస్మానియా వీసీ రామచంద్రం, రిజిస్ట్రార్ గోపాల్‌రెడ్డి, ఓఎస్‌డీ లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.
pranab

రాష్ట్రపతి పర్యటన షెడ్యూలు ఖరారు


ఓయూ శతాబ్ది వేడుకలకు రానున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన కార్యక్రమం ఖరారైంది. ఆయన ఈనెల 26వ తేదీన ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. 12.30 గంటలకు ఓయూలో జరిగే శతాబ్ది వేడులకు హాజరవుతారు. మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు కార్యక్రమం ముగించుకొని రాజ్‌భవన్‌కు వెళ్తారు. అక్కడ మధ్యాహ్న భోజనం చేస్తారు. 4 గంటలకు రాజ్‌భవన్ నుంచి బయల్దేరి గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతిసరోవరంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. సాయంత్రం 5.30 గంటలకు ఇఫ్లూ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి వెళ్తారు. అనంతరం బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు.

1047

More News

మరిన్ని వార్తలు...