దిగ్విజయం


Wed,December 20, 2017 02:51 AM

Prapancha Telugu Mahasabhalu 2017 Closing Ceremony

-అంగరంగ వైభవంగా ముగిసిన తెలుగు మహాసభలు పక్కా ప్రణాళిక.. పకడ్బందీగా ఏర్పాట్లు
-కీలక పాత్ర పోషించిన వివిధ కమిటీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన సీఎం కేసీఆర్
-మే నెలలో బీజం.. డిసెంబర్‌లో విశ్వవ్యాప్తం ప్రతినిధులకు ఏర్పాట్లు, వసతులు, ఆతిథ్యంపై సర్వత్రా హర్షం

PrapanchaTMS
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన.. ప్రణాళిక.. వాటిని క్షేత్రస్థాయిలో పక్కాగా అమలుచేసిన అధికార, అనధికార యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, సలహాదారుల కృషి.. ఫలితమే న భూతో.. న భవిష్యతి.. అన్న రీతిలో విజయవంతమైన ప్రపంచ తెలుగు మహాసభలు! మహాసభలను మొదటినుంచి తుదివరకు దిగ్విజయం చేయడం, విశ్వవ్యాప్తం చేయడంలో, సుమారు 42 దేశాల నుంచి వచ్చిన అతిథులు.. ఆహా! అని ప్రస్తుతించేలా చేయడంలో ప్రభు త్వం ఏర్పాటు చేసిన కమిటీలు ప్రధాన పాత్ర పోషించాయి. అలాగే సుమారు 14 శాఖలన్నీ సమిష్టిగా కదులుతూనే.. ఒక్కొక్కటిగా తీసుకున్న చర్యలతో ప్రపంచ తెలుగు మహాసభలంటే ఇలా ఉండాలి అనేవిధంగా ముగింపునిచ్చాయి. సభలకు వచ్చిన ప్రతి ఒక్కరు తెలుగు ఘుమఘుమలు.. ఆతిథ్య మాధుర్యాన్ని.. తెలుగు వంటకాల రుచులను.. సాహిత్య ఝరులను ఆసాంతం ఆస్వాదించడం వెనుక పెద్ద కసరత్తే సాగింది.

కర్తగా కేసీఆర్..

దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ పేరు ప్రఖ్యాతులు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలను ప్రపంచం నలుమూలలా వ్యాప్తి చేయాలనే ఆలోచన.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి చూపు మాతృరాష్ట్రంపై కేంద్రీకరించేలా.. వారందరినీ ఒక్కతాటిపైకి తేవాలన్న ఆలోచనల్లోంచి పుట్టిందే ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ! గతంలో సభలను ఎలా నిర్వహించారో చాలామందికి తెలియదు. అయితే భవిష్యత్తు తరాలుకూడా గుర్తించేలా.. గుర్తుంచుకునేలా ఈ సభలను నిర్వహించాలని ముఖ్యమంత్రి తలచారు. అందుకు ఈ ఏడాది మే నెలలో బీజం పడింది. మహాసభలను ఎలా నిర్వహించాలి.. ఎవరు ఏయే పాత్రలను పోషించాలి.. ఎవరు ఏయే పనులు చేయాలి.. ప్రపంచం నలుమూలలనుంచి తెలుగువారిని ఎలా సమీకరించాలి.. ఇలా అన్ని అంశాలపై పక్కా ప్రణాళిక రచించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మహాసభలకు కర్తగా నిలిచారు. తన ఆలోచనలు, ప్రణాళికలకు అనుగుణంగా సీఎం కమిటీలను ఏర్పాటుచేశారు. ఇందులో ఆహ్వాన (రిసెప్షన్) కమిటీ అతి ముఖ్యమైనది. దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్ నేతృత్వం వహించారు. క్షేత్రస్థాయిలో ప్రణాళికలను అమలుచేయడంలో రిసెప్షన్ కమిటీ పెద్దన్న పాత్ర పోషించింది. ఎప్పటికప్పుడు 14 శాఖల ఉన్నతాధికారులను సమన్వయం చేసుకుంటూ.. అతిథులకు స్వాగతం పలికి వారిని విడిదులకు చేర్చడంపై దృష్టి సారించింది. రాత్రనక, పగలనకా సీఎస్ శ్రమిస్తున్నారని ఎస్పీ సింగ్‌ను ముఖ్యమంత్రి ప్రశంసించడం ప్రస్తావనార్హం.

కీలకంగా వ్యవహరించిన కోర్‌కమిటీ

మహాసభల నిర్వహణ, సాహిత్య సదస్సులు, కవిసమ్మేళనాలు, గోష్ఠులను నిర్వహించడంలో కోర్‌కమిటీ కీలకంగా వ్యవహరించింది. ఎక్కడ ఏ అవసరాలున్నా.. వెంటనే తీర్చుతూ సమన్వయం చేసింది. ఇందులో రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, అధికార భాషాసంఘం అధ్యక్షులు దేవులపల్లి ప్రభాకర్‌రావు, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ, సీఎంవో ఓఎస్డీ దేశ్‌పతి శ్రీనివాస్ తదితరులు ఉండగా.. దీనికి సభ్య కన్వీనర్‌గా సాంస్కృతిక, పర్యాటక, క్రీడల శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం కొనసాగారు.

సమన్వయం చేసిన క్యాబినెట్ కమిటీ

మహాసభల కోసం ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వం వహించారు. మంత్రులు చందూలాల్, తుమ్మల నాగేశ్వర్‌రావు, తలసాని శ్రీనివాసయాదవ్, ఈటల రాజేందర్ సభ్యులుగా సమిష్టిగా పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు సీఎంతో సమావేశమై.. ఆయన ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని.. వాటి క్షేత్రస్థాయి అమలుకు సమన్వయం చేశారు.

ఎస్పీ సింగ్ నేతృత్వంలో నిర్వహణ కమిటీ

దాదాపు 14 శాఖల ముఖ్య అధికారులతో కూడిన నిర్వహణ కమిటీకి సీఎస్ ఎస్పీసింగ్ నేతృత్వం వహించారు. శాఖల అధిపతులు తమ శాఖ పరంగా ఏర్పాట్లు, పర్యవేక్షణ చూస్తూనే సమిష్టిగానూ కదిలారు. దీనితో ఎక్కడా లోటుపాట్లనేవి కానరాలేదు. ప్రచార బాధ్యతలను ఐఅండ్‌పీఆర్ శాఖ సంతృప్తికరంగా నిర్వహించింది. ఉపాధ్యాయులు, గ్రంథాలయాల పాత్ర కూడా కీలకంగా ఉంది. మహాసభల సందర్భంగా ఇచ్చిన మినహాయింపులతో రాష్ట్రవ్యాప్తంగా తెలుగు పండితులు, భాషా పండితులలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. గ్రంథాలయాల్లో నిర్వహించిన సన్నాహక సదస్సులు ప్రజలను మహాసభలకు రప్పించేందుకు దోహదంచేశాయి. ప్రారంభ వేడుకలకు ఉపరాష్ట్రపతి, ముగింపు ఉత్సవాలకు రాష్ట్రపతి, ఇతర ముఖ్యులు రావడంతో.. భద్రతాపరంగా ఎలాంటి రాజీలేని ఏర్పాట్లు చేస్తూనే.. వేల సంఖ్యలో తరలివచ్చే భాషాభిమానులు, సాహిత్యపిపాసులకు కూడా ఇబ్బంది కలుగకుండా పోలీసులు చూశారు. విద్యాశాఖ, పర్యాటక, సాంస్కృతిక శాఖ, ప్రజా సంబంధాలు, పౌర సరఫరాల శాఖ, పురపాలక, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, రవాణాశాఖ, పోలీసు, ఐటీ, సినిమా అటోగ్రఫీ, విద్యుత్ లాంటి శాఖల ముఖ్య అధికారులు, సిబ్బంది సేవలు వెల కట్టలేనివి. ఇలా ఒక్కొక్కరుగా.. సమిష్టిగా ముందుకు కదులుతూ.. ప్రపంచానికి తెలంగాణ ఖ్యాతిని చాటిచెప్పారు.

వ్యక్తిగతంగానూ..

శాఖలపరంగా సాగిన కృషి ఒక ఎత్తయితే, కొందరి వ్యక్తిగత శ్రద్ధ మరో ఎత్తు. ఇందులో ముఖ్యంగా..
ఎస్పీ సింగ్: అన్ని శాఖలకు, కమిటీలకు పెద్దన్న పాత్ర పోషించారు. రాత్రనకా.. పగలనకా శ్రమించారు. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. ఇతర శాఖలను సమన్వయంచేశారు. ప్రణాళిక ప్రకారం సాహితీ కార్యక్రమాలు, అతిథులకు మర్యాదలు, మహామహులకు స్వాగత సత్కారాలు.. ఇలా అన్నింటిలోనూ తెలంగాణ ప్రభుత్వ ముద్ర కనపడేలా కృషి చేశారు.
నందిని సిధారెడ్డి: సాహిత్య అకాడమీ చైర్మన్‌గా సీఎం ఆలోచనలనుంచి కిందిస్థాయిలో అతిథిమర్యాదల వరకు.. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారిని గుర్తించి ఆహ్వానించడంనుంచి.. సాహితీ సదస్సులు, కవితా ఝరులను ప్రవహింపజేయడంలో ఆయన పాత్ర ఆమోఘం. అన్నింటా తానై రాష్ట్ర ఔన్నత్యం, తెలుగు భాష మధురిమలు ప్రపంచం యావత్తూ చాటేలా వ్యవహరించారు.
కేవీ రమణాచారి: ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి క్షేత్రస్థాయిలో కళాకారుడు, సాహితీవేత్త, రచయిత వరకు సమన్వయం చేసుకుంటూ.. తెలంగాణ పేరు ప్రఖ్యాతులకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తూనే.. భాషా సాహిత్యాలను ప్రపంచ ప్రతినిధులకు పరిచయం చేయడంలో తనదైన ముద్రవేశారు. సీనియర్ ఐఏఎస్‌గా ఆయన అనుభవం ఎంతగానో ఉపకరించింది.
బుర్రా వెంకటేశం: తెలుగు మహాసభలకు బీజం పడినప్పటి నుంచి ముగింపు ఉత్సవాలవరకు అహరహం శ్రమించారు. రాష్ట్రంలోని కళాకారులు, సాహితీవేత్తలు, రచయితలు, కవులను గుర్తించి సన్మానించడం, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు, అతిథి మర్యాదలు, కార్యక్రమాలను విజయవంతంగా ముగించడంలో ఆయన పాత్ర మర్చిపోలేనిది.

దేశపతి శ్రీనివాస్ : సీఎంవో ఓఎస్డీగా.. తెలంగాణ కళలు, కళాకారులు, భాష, సాహిత్యంపై ఉన్న ఎనలేని అవగాహన, పట్టును మహాసభల విజయవంతానికి ఉపయోగించారు. సభల నిర్వహణపై మొదటి నుంచి ముఖ్యమంత్రికి చేదోడువాదోడుగా ఉంటూ.. తెలంగాణ కీర్తి పతాకాన్ని, భాష ఖ్యాతిని ఇనుమడింపజేయడంలో ఆయనది పెద్ద చేయి.
సీవీ ఆనంద్: వ్యక్తిగతంగా పలువురు అధికారులు తెరముందు కనిపించగా.. తెరవెనుక ఉండి.. అతిథులందరితోనూ ఆహా అనిపించిన అధికారి పౌరసరఫరాల కమిషనర్ ఆనంద్. వేలమంది అతిథులు లొట్టలేస్తూ తెలంగాణ రుచులను ఆస్వాదించేలా చూసింది ఆనందే. మళ్ళీ అవకాశం ఉంటే.. ఇలాంటి భోజనసత్కారాలకు రావాలనే విధంగా ఏర్పాట్లుచేసి అతిథులను మెప్పించారు.

అయాచితం శ్రీధర్: గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ సన్నాహక సదస్సులు, సమావేశాలు నిర్వహించి.. తెలంగాణ సాహిత్యం, కవులు, కళాకారులు, భాషాభిమానులను మహాసభలకు రప్పించేలా ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు.
ఏనుగు నర్సింహారెడ్డి : సాహిత్య అకాడమీ కార్యదర్శిగా మహాసభల నిర్వహణలో వివిధ కమిటీలను సమన్వయం చేయడంలో ముఖ్య భూమిక నిర్వహించారు. మహాసభల కార్యాలయాన్ని, కమిటీలను సమన్వయంచేస్తూ.. సభల విజయవంతానికి కృషిసల్పారు.

2747
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles