సమగ్ర విద్యుత్ విధానం


Mon,August 19, 2019 02:55 AM

Power Finance Corporation CMD Rajeev Sharma Meets CM KCR In Pragathi Bhavan

-దేశంలో చీకట్లను పారదోలేందుకు ఇది అవసరం
-పవర్‌ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎండీతో భేటీలో సీఎం కేసీఆర్ అభిలాష
-స్థాపిత సామర్థ్యంలో సగంకూడా వాడుకోవటంలేదు
-ఈ పరిస్థితి పోవాల్సిన అవసరం ఉన్నది
-తెలంగాణ ఏర్పడ్డ ఆరునెలల్లోనే విద్యుత్‌కోతలు ఎత్తేశాం
-అన్నిరంగాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నాం
-పవర్ ఫైనాన్స్ సహకారం ఎంతగానో దోహదం చేసింది : కేసీఆర్
-మేమందించిన సహకారం నూరుపాళ్లు సద్వినియోగమైంది
-మీరు ఏం చెప్పారో.. అది నేడు కండ్లముందు కనిపించింది
-కాళేశ్వరం గురించి యావత్ దేశం గొప్పగా చెప్పుకొంటున్నది
-సీఎం కేసీఆర్‌తో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎండీ రాజీవ్‌శర్మ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రం ఏర్పడిన ఆరునెలల్లోనే విద్యుత్‌కోతలు ఎత్తివేశామని, ఇప్పుడు అన్నిరంగాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎండీ రాజీవ్‌శర్మకు తెలిపారు. ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయని, మూడు షిఫ్టుల్లో పరిశ్రమలు పనిచేస్తున్నాయని వివరించారు. ఇదేతీరుగా దేశవ్యాప్తంగా అన్నిరంగాలకు అన్నివేళలా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడమే లక్ష్యంగా సమగ్ర విద్యుత్ విధానం రావాల్సిన అవసరం ఉన్నదని అభిలషించారు. దేశంలో ప్రస్తుతమున్న స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో సగం కూడా వినియోగించుకోవడం లేదని, ఇంకా చాలాప్రాంతాలు చీకట్లోనే మగ్గుతున్నాయని సీఎం అన్నారు. దేశవ్యాప్తంగా విద్యుత్‌కోతలు అమలవుతున్నాయని, ఈ పరిస్థితి పోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. మూడురోజులపాటు రాష్ట్రంలోని పవర్‌ప్లాంట్లు, కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన పీఎఫ్‌సీ సీఎండీ రాజీవ్‌శర్మ ఆదివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను
మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో, దేశంలో ఉన్న విద్యుత్ పరిస్థితిపై ఇరువురు చర్చించారు.

సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడినప్పుడు తీవ్రమైన విద్యుత్ సంక్షోభం ఉండేది. రాష్ట్రప్రగతికి ఆనాడు విద్యుత్ సమస్యే తీవ్ర అవరోధంగా నిలిచింది. విద్యుత్ సమస్యను పరిష్కరించనిదే రాష్ట్ర పురోగతి సాధ్యంకాదని ఆనాడు భావించాం. విద్యుత్‌రంగాన్ని తీర్చిదిద్దటానికి సమగ్రవ్యూహం అనుసరించాం. ఆరునెలల్లో విద్యుత్‌కోతలు ఎత్తివేశాం. ఇప్పుడు అన్నిరంగాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా వ్యవసాయానికి 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నాం. ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి. తెలంగాణలో పరిశ్రమలు మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నాయి. దీనివల్ల ఉపాధి పెరిగింది. రాష్ట్ర ఆదాయం పెరిగింది. లో ఓల్టేజీ లేకుండా ఉండేందుకు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోకుండా చూసేందుకు విద్యుత్ పంపిణీ, సరఫరా వ్యవస్థలను మెరుగుపరిచాం. ప్రస్తుతం 20వేల మెగావాట్ల విద్యుత్‌ను వాడుకోవడానికి అనుగుణమైన వ్యవస్థ సిద్ధమైంది అని వివరించారు.

పీఎఫ్‌సీ సహకారం ఎంతో ఉపయోగపడింది

రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, ఇతర విద్యుత్ సంబంధ వ్యవస్థలను తీర్చిదిద్దడానికి, విద్యుత్ సంక్షోభాన్ని చాలా తక్కువ సమయంలో పరిష్కరించుకొని, మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ అడుగులు వేయడానికి పీఎఫ్‌సీ అందించిన ఆర్థికసహకారం ఎంతో దోహదం చేసిందని సీఎం కేసీఆర్ అన్నారు. విద్యుత్ ప్రాజెక్టులతోపాటు, రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు కూడా ఆర్థిక సహకారం అందించినందుకు సీఎండీ రాజీవ్‌శర్మకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
CMKCR1

ఇది.. పీఎఫ్‌సీకి గౌరవం: రాజీవ్‌శర్మ

రాష్ట్రంలో దార్శనిక ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో రికార్డు సమయంలో అటు పవర్‌ప్లాంట్లు, ఇటు నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తిచేస్తున్నారని పీఎఫ్‌సీ సీఎండీ రాజీవ్‌శర్మ ప్రశంసించారు. పవర్‌ప్లాంట్లయినా, నీటిపారుదల ప్రాజెక్టులైనా ఇంత త్వరగా పూర్తికావడం తానెక్కడా చూడలేదన్నారు. అనుమతులు పొందటం, నిధులు సమీకరించటం, భూసేకరణ, ఇతర రాష్ట్రాలతో ఒప్పందాలు తదితర తతంగమంతా ఉంటుంది కాబట్టి.. ఆలస్యమవుతుంటుందని, కానీ తెలంగాణలో మాత్రం శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నదని అన్నారు. రాష్ట్రంలోని విద్యుత్‌ప్లాంట్లు, నీటిపారుదల ప్రాజెక్టులకు తామందించిన ఆర్థికసహకారం నూటికి నూరుపాళ్లు సద్వినియో గం అయిందంటూ సంతోషం వ్యక్తంచేశారు. తెలంగాణ అభివృద్ధిలో పీఎఫ్‌సీ భాగస్వామికావటం తమకెంతో గౌరవంగా, గర్వంగా ఉన్నదని అన్నారు.

మూడున్నరేండ్ల కింద హైదరాబాద్‌కు వచ్చినప్పుడు కేసీఆర్ మాకు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్పారు. ప్రాజెక్టు ఎలా ఉండబోతున్నదో స్క్రీన్‌పై చూపించారు. అది విన్న నేను ఆశ్యర్చపోయాను. ఇది సాధ్యమేనా అనుకున్నాను. కానీ నేను నిన్న కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించాను. బరాజ్‌లు, పంపుహౌస్‌లు కండ్లారా చూశాను. గోదావరి నీటిని పంప్‌చేసే విధానం చూశాను. నిజంగా అద్భుతం. మూడున్నరేండ్ల కింద కేసీఆర్ నాకు ఏది చెప్పారో అది కండ్లముందు కనిపించింది. ఇలాంటి ప్రాజెక్టును ఇంత త్వరగా నిర్మించడం మాటలు చెప్పినంత తేలికకాదు. కేసీఆర్ కృషి ఫలించింది. కల నెరవేరింది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి యావత్‌దేశం గొప్పగా చెప్పుకొంటున్నది. అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విజయగాథను ప్రదర్శిస్తున్నారు అని రాజీవ్‌శర్మ సీఎం కేసీఆర్‌ను అభినందించారు.

విద్యుత్‌రంగం విజయాల వెనుక ప్రభాకర్‌రావు కృషి

రాష్ట్రంలో విద్యుత్‌రంగం సాధించిన విజయాల వెనుక జెన్‌కో- ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు కృషి ఉన్నదని సీఎం కేసీఆర్, పీఎఫ్‌సీ సీఎండీ రాజీవ్‌శర్మ, సీఎస్ ఎస్కేజోషి ప్రశంసించారు. విద్యుత్‌రంగంలో ఎంతో అనుభవం ఉన్న ప్రభాకర్‌రావు తమకు ఆదర్శమని, ఆయన నాయకత్వంలో తెలంగాణ విద్యుత్‌రంగం ఎంతో ప్రగతి సాధించిందని రాజీవ్‌శర్మ కొనియాడారు. పవర్‌ప్లాంట్లు శరవేగంగా నిర్మితమవుతున్నాయని, ప్లాంట్లలో పీఎల్‌ఎఫ్ పెరిగిందని, తనపై పెట్టిన బాధ్యతలను ప్రభాకర్‌రావు పూర్తిగా నెరవేర్చారని సీఎం కేసీఆర్ అన్నారు. విద్యుత్‌రంగంలో ప్రభాకర్‌రావు 50 ఏండ్ల సర్వీసు పూర్తిచేసుకున్నారని చెప్తూ.. ఆయనను ఈ రంగంలో భీష్మాచార్యుడిగా సీఎస్ ఎస్కేజోషి అభివర్ణించారు. విద్యుత్‌రంగంపై పూర్తి అవగాహన కలిగిన సీఎం కేసీఆర్ నాయకత్వంలో, మార్గదర్శకత్వంలో పనిచేయడం వల్లనే మంచి ఫలితాలు వచ్చాయని ప్రభాకర్‌రావు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. విద్యుత్‌సంక్షోభ పరిష్కారం ఘనత అంతా ముఖ్యమంత్రిదేనన్నారు. ఈ సందర్భంగా రాజీవ్‌శర్మ దంపతులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా సన్మానించి, జ్ఞాపికలు అందించారు. ఈ చర్చల్లో జెన్‌కో ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శులు స్మితా సభర్వాల్, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

1621
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles