సిమ్ స్వాప్ చేసి.. బ్యాంకు ఖాతాల్లోంచి చోరీ


Sun,January 20, 2019 02:04 AM

Police Busted SIM Swapping Gang in Hyderabad

-మెయిల్స్‌ను హ్యాక్ చేసి ఆన్‌లైన్ దోపిడీ
-నకిలీపత్రాలతో కంపెనీల రిజిస్టర్డ్ సిమ్‌లకు డూప్లికేట్
-ఓటీపీ ఎంటర్ చేసి లక్షలు కాజేసిన ఘనులు
-నైజీరియా నుంచి ఆపరేషన్.. పశ్చిమబెంగాల్‌లో కార్యాచరణ
-ముఠా గుట్టు రట్టుచేసిన సైబరాబాద్ పోలీసులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, నమస్తే తెలంగాణ: కంపెనీలు, కార్పొరేట్ సంస్థల మెయిల్స్ హ్యాక్ చేయడం.. వాటి నుంచి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సమాచారం పొందటం.. దాని ఆధారంగా సిమ్ స్వాప్ చేసి ఓటీపీ సహాయంతో లక్షలు కాజేస్తున్న ఓ అంతరాష్ట్ర ముఠాను శనివారం సైబరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నైజీరియా నుంచి ఈ తతంగం నడుపుతున్నట్టు నిర్ధారించారు. హైదరాబాద్ చింతల్ కు చెందిన పంతం వెంకటకృష్ణ ఎలిమ్, షాలోమ్ కెమికల్ ఇండస్ట్రీస్ నిర్వహిస్తున్నారు. డిసెంబరు 15న (శనివారం) రాత్రి అతని ఫోన్ నంబరు డిస్‌కనెక్ట్ అయ్యింది. సోమవారం అతని ఇండస్ట్రీ బ్యాంక్ ఖాతాల నుంచి రూ.9 లక్షలు డ్రా అయినట్టు గుర్తించారు. మొబైల్ సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించి డిస్‌కనెక్ట్‌పై ఫిర్యాదు చేశారు. తన పేరున గుర్తుతెలియని వ్యక్తులు కొత్త సిమ్ తీసుకొన్నట్టు తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదుచేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసుల ఈ మోసానికి పాల్పడింది నైజీరియాలో ఉంటున్న ఎబిగ్‌బో ఇన్నోసెంట్ అని తేల్చారు. పశ్చిమ బెంగాల్‌లో ఉంటూ అతడికి సహకరిస్తున్న నైజీరియన్ ఓడాఫే హెన్రీ, సంతోష్‌బెనర్జీ, అంకన్‌సాహా, రజత్‌కుండ్, చందన్‌వర్మ, సంజీబ్‌దాస్‌ను అరెస్టుచేసి వారి నుంచి 17 మొబైల్స్, ల్యాప్‌టాప్, పాసుపోర్టు, రబ్బర్ స్టాంప్‌లు, చెక్‌బుక్‌లు, డెబిట్, ఆధార్, పాన్‌కార్డులు, లామినేషన్ మెషిన్లను స్వాధీనం చేసుకొన్నారు. ప్రధాన సూత్రధారి ఇన్నోసెంట్‌ను పట్టుకొనేందుకు ఆ దేశ రాయబార కార్యాలయానికి సమాచారం ఇచ్చినట్టు సీపీ సజ్జనార్ చెప్పారు.

SIM-SWAPP2

సిమ్ స్వాపింగ్ ఇలా

నైజీరియాలో ఉంటున్న ఇన్నోసెంట్ ఇండియాలోని పలు కార్పొరేట్ సంస్థలు, కంపెనీల మెయిల్స్ హ్యాక్ చేసి.. వాటి ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీలు, ఖాతాలను అనుసంధానంగా ఉన్న మొబైల్ నంబర్లు సేకరిస్తున్నారు. వాటిని పశ్చిమబెంగాల్‌లో ఉన్న అనుచరులకు పంపి నకిలీపత్రాలు సృష్టించి డూప్లికేట్ సిమ్‌లు పొందుతారు. శనివారం సాయంత్రం ఒరిజినల్ సిమ్‌ను డీయాక్టివేట్ చేసి.. ఆన్‌లైన్ బాంకింగ్ లావాదేవీల్లో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని వినియోగించి నగదును తస్కరిస్తారు. ఇలా 20 కంపెనీలకు టోకరా ఇచ్చినట్టు పోలీసులు తేల్చారు. డూప్లికేట్ సిమ్‌లు జారీ చేయటంలో టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ల నిర్లక్ష్యం ఉన్నదని పోలీసులు చెప్తున్నారు. పత్రాలు పరిశీలించకుండా సిమ్‌కార్డులు జారీచేసిన సర్వీసు ప్రొవైడర్లపై కేసులు నమోదు చేయనున్నట్లు, ఇలాంటి కేసు దేశంలోనే మొదటిదని సీపీ సజ్జనార్ వివరించారు.

3440
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles