ఉద్యమకారులకు దక్కిన గౌరవం


Sat,January 19, 2019 02:59 AM

Pocharam Srinivas Reddy elected speaker of Telangana legislative assembly

-మంత్రిగా వ్యవసాయానికి స్వర్ణయుగం
-ఇప్పుడు స్పీకర్ పదవికీ వన్నె తెస్తారు
-పోచారం ఎన్నికపై సభ్యుల సంతోషం
-పార్టీలకు అతీతంగా అభినందనల వెల్లువ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: స్పీకర్‌గా ఎన్నికైన పోచారం శ్రీనివాస్‌రెడ్డి గత ప్రభుత్వంలో వ్యవసాయశాఖ నిర్వహించి వ్యవసాయానికి స్వర్ణయుగాన్ని తీసుకొచ్చారని సభ్యులు కొనియడారు. ఇప్పుడు స్పీకర్ పదవికీ వన్నె తెస్తారని అభిలషించారు. పోచారం వంటి ఉద్యమకారుడు స్పీకర్ పదవిలో కూర్చొనడం ఉద్యమకారులందరికీ దక్కినగౌరవమని పేర్కొన్నారు. స్పీకర్‌గా ఎన్నికైన పో చారం శ్రీనివాస్‌రెడ్డిని అభినందిస్తూ పలువురు సభ్యులు శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడారు. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే..

దేశవ్యాప్తంగా గౌరవం పొందారు

వ్యవసాయమంత్రిగా పోచారం సమర్థంగా బాధ్యతలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో వ్యవసాయమంత్రిగా దేశవ్యాప్తంగా గౌరవం అందుకున్నారు. పోచారం పనితీరుతో వ్యవసాయరంగం అద్భుత ప్రగతిని సాధించింది. రాజకీయ అనుభవంతో సభా వ్యవహారాలను కూడా అద్భుతంగా నిర్వహిస్తారు.
- మహమూద్ అలీ, ఉప ముఖ్యమంత్రి

స్పీకర్ పదవికే వన్నె తెస్తారు

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పోచారం స్పీకర్ పదవికే వన్నె తెస్తారు.ఆయన సభాపతి కావడంతో రాష్ట్రంలోని అన్నదాతలంతా సంబురపడుతున్నారు. పోచారం తెలంగాణ తొలి వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో రెండో హరిత విప్లవానికి బీజం పడింది. మంత్రిగా ఆయన చేపట్టిన రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, వ్యవసాయ విస్తరణాధికారుల నియామకం చరిత్రలో నిలిచిపోతాయి. పోచారం అంకితభావం, ప్రజల సమస్యల పరిష్కారం పట్ల చూపించే శ్రద్ధ మాలాంటి యువ ఎమ్మెల్యేలకు స్ఫూర్తిదాయకం. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిత్యవిద్యార్థిలా పనిచేశారు. గత అసెంబ్లీలో అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత కూడ వ్యవసాయ పద్దులపై చర్చలో విపక్షాల ప్రశ్నలకు మంత్రిగా పోచారం చెప్పిన సమాధానాలు మరిచిపోలేం.
- కే తారకరామారావు, టీఆర్‌ఎస్ సభ్యుడు

ప్రతి ఉద్యమకారుడికి గర్వకారణం

తొలి, మలిదశ ఉద్యమాల్లో పోరాడిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభాపతి స్థానంలో కూర్చోవడం ప్రతి ఉద్యమకారుడికి గర్వకారణం. తెలంగాణ పదం నిషేధానికి గురైనచోట ఒక ఉద్యమకారుడు సభాపతి కావడం ఆనందంగా ఉంది. పోచారానికి సముచిత స్థానం దక్కింది. నాలుగున్నరేండ్ల టీఆర్‌ఎస్ పాలన వ్యవసాయానికి స్వర్ణయుగం. సీఎం కేసీఆర్ సూచనలతో మంత్రిగా పోచారం చేసిన కృషి దీనికి కారణం. ఆరోగ్యం బాగాలేకున్నా.. రైతుసమన్వయ సమితులను ఏర్పాటుచేసి, 30 జిల్లాల్లో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో కలిసి రైతులను చైతన్యవంతం చేసిన విషయాలను ఎప్పటికీ మరిచిపోలేం. కారునే కార్యాలయంగా చేసుకొని ప్రజాసమస్యలు పరిష్కరించారు.
- టీ హరీశ్‌రావు, టీఆర్‌ఎస్ సభ్యుడు

రైతుబిడ్డ సభాపతి కావడం గొప్ప గౌరవం

సభాపతిగా రైతుబిడ్డ పోచారం ఎన్నికవడం గొప్ప గౌరవం. రైతుల సమస్యలపై ఎస్సెల్బీసీ సమావేశాల్లో బ్యాంకర్ల తీరుపై ముక్కుసూటిగా మాట్లాడేవారు.బాన్సువాడకు వచ్చినప్పు డు ప్రజలజీవితాలతో ఆయన ఏ విధంగా పెనవేసుకుంటా రో ప్రత్యక్షంగా చూశాం. పదిమందితో మేం అసెంబ్లీలో పో రాడుతున్న సమయంలో.. మాతో సమానంగా పోరాడారు. సీఎం కేసీఆర్ వ్యవసాయశాఖను అప్పగిస్తే శక్తివంచనలేకుండా పనిచేసి రైతులకు భరోసా కల్పించారు. దేశంలో గొప్పగా రైతు ఎక్కడ ఉన్నారంటే అంటే తెలంగాణ వైపు చూ సేలా రాష్ర్టాన్ని తీర్చిదిద్దడంలో మీ ఆలోచనలను కొనసాగిస్తాం. తెలంగాణ ప్ర జల హృదయాలలో టీఆర్‌ఎస్‌కు చెదరని చోటు సంపాదించడంలో రైతులకు మేలుచేయడం కీలకంగా మారింది. మళ్లీ భారీ మెజార్టీతో గెలువడానికి కారణమైంది. మీరు.. భావితరాలకు స్ఫూర్తి.
- ఈటల రాజేందర్, టీఆర్‌ఎస్ సభ్యుడు

ఎదిగే కొద్దీ ఒదిగే మనస్తత్వం మీది

ఉద్యమంకోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన చరిత్ర పోచారంది. రైతుబిడ్డగా వ్యవసాయశాఖను నిర్వహించిన తీరు ఆదర్శం. ఎదిగిన కొద్ది ఒదిగి ఉండే మీ మనస్తత్వం గొప్పది. పోచారం అధ్యక్షతన తెలంగాణ అసెంబ్లీ ప్రజాసమస్యల పరిష్కారానికి వేదికగా నిలుస్తుందని ఆశిస్తున్నాం.
-గండ్ర వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ సభ్యుడు

స్పీకర్ స్థానానికే గర్వకారణం

స్పీకర్ స్థానంలో పోచారం కూర్చొనడం సభకే గర్వకారణం. పోచారం అధ్యక్షతన సభా కార్యక్రమాలు మరింత సమర్థంగా నడుస్తాయని ఆశిస్తున్నాం. పోచారం లాంటి నాయకులు అరుదుగా ఉంటారు.
- మహ్మద్ బిన్ బలాల, ఎంఐఎం సభ్యుడు

స్ఫూర్తి నింపిన నాయకుడు

పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా పోచారం పనిచేసిన సందర్భంగా మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై కలిశాను. ఆ సందర్భంగా మా తండ్రి నాయకత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలని సూచించారు. అదే పాటిస్తున్నా. ప్రజాసమస్యలపై చర్చించేందుకు నిబంధనలు, చట్టాలకు లోబడి స్పీకర్‌కు సహకరిస్తాం.
-దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కాంగ్రెస్ సభ్యుడు

1553
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles