సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి


Tue,June 19, 2018 02:21 AM

pocharam fires on congress over rythu bheema insurance

-కాంగ్రెస్ నాయకులు తెలివి లేకుండా మాట్లాడుతున్నరు
-వారి కుటుంబ సభ్యుల పేరిట బీమా ఎందుకు చేయించుకుంటున్నారు?
-ఆదిలాబాద్‌లో రైతుబీమా అవగాహన సదస్సులో మంత్రి పోచారం
-పాల్గొన్న మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ గుత్తా

ఆదిలాబాద్, నమస్తే తెలంగాణ ప్రతినిధి: రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని నాలుగేండ్లలో సంక్షే మం దిశగా తీసుకెళ్లిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన రైతు పక్షపాతి అని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో రైతు బీమాపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు రైతుబీమా పథకంపై తెలివి లేకుండా మాట్లాడుతున్నారని, ప్రజలు వారిని బండకేసి కొట్టే రోజులు దగ్గరపడ్డాయన్నారు. పనికి రాని పథకం అన్న ఓ కాంగ్రెస్ నాయకుడు వారి కుటుంబ సభ్యుల పేరిట రైతు బీమాను ఎందుకు చేయించుకున్నారని ప్రశ్నించారు. వ్యవసాయ శాఖ అధికారులు, రైతు సమన్వయ సమితి సభ్యులు పరస్పర సహకారంతో ఈనెల 30లోగా బీమా వివరాల నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే రైతు బీమా పథకంలో భాగంగా రైతు ఏ కారణం చేతనైనా మరణిస్తే పది రోజుల్లో బీమా డబ్బులు రూ.5 లక్షలు వారి కుటుంబసభ్యులకు అందజేస్తామని తెలిపారు.

ఎన్‌ఆర్‌ఐలకు చెందిన పట్టాదారు పాస్ పుస్తకాలు, రైతుబంధు చెక్కులకు సంబంధించి విధివిధానాలను ఖరారు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 1.61 లక్షల మంది రైతు సమన్వయ సమితుల్లో సభ్యులుగా ఉన్నారని, ప్రభుత్వం పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు వీరు కృషి చేయాలని కోరారు. అటవీ శాఖ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. జిల్లాలో రైతుల వద్ద సేకరించిన శనగల డబ్బుల కోసం రూ.63 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. గుంట భూమి ఉన్న రైతుకు సైతం బీమా పథకం వర్తిస్తుందని తెలిపారు. ఏజెన్సీలో గిరిజనేతర రైతుల వివరాలు సేకరించి వారికి బీమా సౌకర్యం వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు 48 గంటల్లోనే డబ్బులు చెల్లించినట్లు తెలిపారు.


kcr-pocharam2

ఇతర రాష్ర్టాలను ఆకట్టుకుంటున్న రైతుబీమా: గుత్తా

రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని అమలు చేస్తున్నదన్నారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం కేసీఆర్ రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలను వివరించినప్పుడు ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు తెలంగాణ వైపు చూశారన్నారు. గ్రామాల్లో ఏఈవోలు, రైతు సమన్వయ సమితి సభ్యులు బీమా పథకం వివరాల సేకరణ ఈనెల 30లోగా పూర్తి చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేసి రాష్ట్ర కార్యాలయానికి పంపాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ కమిషనర్ జగన్మోహన్, ఎంపీ నగేశ్, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్యేలు ఎన్ దివాకర్‌రావు, రాథోడ్ బాపురావు, రేఖానాయక్, కోవ లక్ష్మి, విఠల్‌రెడ్డి, చిన్నయ్య, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, కలెక్టర్ దివ్య తదితరులు పాల్గొన్నారు.

1117
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles