బాబూ.. వెన్నుపోటులో మీరే సీనియర్!


Mon,February 11, 2019 04:19 PM

PM Modi Fires on Chandrababu

-మీతో నేను పోటీపడలేను
-ఏపీ సన్‌రైజ్ రాష్ట్రం అంటూ బాబుగారు సన్‌రైజింగ్‌పై దృష్టిపెట్టారు
-ఈ చౌకీదార్‌తో బాబుకు నిద్రపట్టడంలేదు.. ఏపీకి రూ.3లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇచ్చాం
-ప్యాకేజీ సద్వినియోగంలో బాబు ప్రభుత్వం విఫలమైంది
-మీ నల్లబెలూన్లు నాకు దిష్టిచుక్కలు.. ఢిల్లీ ఆందోళనకు ప్రజాధనం దుబారా చేస్తున్నారు
-ఓటమి భయంతోనే చంద్రబాబు విలవిల
-గుంటూరు ప్రజాచైతన్యసభలో ఏపీ సీఎం బాబుపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ

హైదరాబాద్/అమరావతి, నమస్తే తెలంగాణ: వెన్నుపోటు రాజకీయాల్లో చంద్రబాబును మించిన సీనియర్లు దేశంలోనే లేరని, ఈ విషయంలో తాను చంద్రబాబుతో ఏ విధంగానూ పోటీపడలేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఈ ముఖ్యమంత్రికి ఏమయిందని ఒక్కోసారి నాకనిపిస్తుంది. ఆయన నాకంటే సీనియర్‌ని అంటూ పదే పదే ప్రచారంచేస్తున్నారు. ఇందులో వివాదం ఏమున్నది? మీరు సీనియరే. మీ గౌరవానికి నేను ఏనాడూ తక్కువచేయలేదు. పార్టీ ఫిరాయింపులు చేయడంలో మీరు సీనియర్. కొత్త కొత్త కూటములు కట్టడంలో మీరు సీనియర్. మీ సొంత మామకు వెన్నుపోటు పొడవడంలో మీరు సీనియర్. ఒక ఎన్నిక తర్వాతి ఎన్నికలో ఓడిపోవడంలోనూ మీరు సీనియర్. వీటిలో ఎందులోనూ నేను సీనియర్‌ను కాను. ఇవాళ ఒకరిని తిట్టి.. రేపు వారి ఒళ్లోనే కూర్చోవడంలోనూ మీరు సీనియర్. ఆంధ్రప్రదేశ్ ప్రజల కలలను పూర్తిగా నీరుగార్చడంలోనూ మీరు సీనియర్ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత తొలిసారిగా ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. గుంటూరులో చమురు నిల్వలకు సంబంధించి మూడు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు శ్రీకారంచుట్టారు. ఆ తర్వాత గుంటూరు శివార్లలోని ఏటుకూరులో బీజేపీ శ్రేణులు ఏర్పాటుచేసిన ప్రజాచైతన్య సభలో ప్రసంగించారు.

అమరావతి నిర్మాణం అంటూ కూలిపోయిన తమ పార్టీని పునర్నిర్మించుకొనే పనిలో చంద్రబాబు ఉన్నారని ప్రధాని ఎద్దేవాచేశారు. ఏపీ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామన్న ఆయన.. హృదయ్ పథకం కింద అమరావతిని చారిత్రక నగరంగా గుర్తించి అభివృద్ధిచేస్తున్నామని, మూడు లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు అనుమతిచ్చామని తెలిపారు. తన కంటే సీనియర్ అంటూ చంద్రబాబును పదేపదే ఎత్తిపొడిచిన మోదీ.. పలు సందర్భాల్లో బాబు ప్రస్తావన చేయకుండా ఎన్ లోకేశ్ తండ్రి అంటూ వ్యంగ్యంగా సంబోధించారు. దేశ ఆర్థికాభివృద్ధిని దెబ్బతీసినవాళ్లే ఇప్పుడు అవాస్తవాలను ప్రచారంచేస్తున్నారని మోదీ అన్నారు. పొగచూరిన వంటశాలల్లో ప్రజలను ధూళికి వదిలేసిన నేతలు ఇప్పుడు అబద్ధాల ధూళిని వెదజల్లుతున్నారు. మహాకల్తీ ఘట్‌బంధన్ ఏర్పడింది. ఈ కూటమిలో ఇక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేరారు. ఈయన ఆంధ్రప్రదేశ్ మౌలిక నిర్మాణాన్ని మారుస్తానని చెప్పారు. కానీ ఆయనే యూటర్న్ తీసుకొన్నారు. అమరావతిని పునర్నిర్మిస్తానని చెప్పిన ఈయన తన పార్టీ పునర్నిర్మాణంలో పడిపోయారు. ఆంధ్రప్రదేశ్‌ను సన్‌రైజ్ రాష్ట్రం చేస్తానన్న చంద్రబాబు సన్ (కుమారుడు) రైజ్ అంటూ తన సొంత కుమారుడి రాజకీయ ఎదుగుదలపై దృష్టిపెట్టారు అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పేద ప్రజలకోసం కొత్త పథకాలు పెడతానని వాగ్దానంచేసిన చంద్రబాబు.. కేంద్ర పథకాలపైనే ఆయన స్టిక్కర్ అంటించుకొని ప్రచారం చేసుకొంటున్నారని విమర్శించారు.
Modi3

ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది

ప్రజాసంక్షేమ పథకాల నుంచి మాట మారిస్తే దాంతో తాను ఏకీభవించలేనని మోదీ స్పష్టంచేశారు. ఎన్టీఆర్ వారసులుగా వచ్చిన మీరు ఆయన కలలను సాకారం చేస్తామని వాగ్దానం చేశారా లేదా? ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తామని నాడు మీరు చెప్పారా? లేదా? ఎన్టీఆర్‌కు ఇవ్వవలసిన గౌరవాన్ని ఇచ్చారా? ఈ విషయాలు ప్రజలకు అర్థమవుతున్నది కానీ.. ఇంతటి సీనియర్ నాయకుడికి ఎందుకు అర్థం కావడం లేదు? ఎందుకంటే.. ఈయన నామ్‌దార్ (కాంగ్రెస్)ల దగ్గరకు వెళ్లి తలవంచుకొని కూర్చున్నారు. మీ పార్టీ అవతరించిన మూలకారణాన్నే మరిచి.. వారి చెంతకు చేరాల్సిన ఇబ్బంది ఏమొచ్చింది? ఢిల్లీలో ఉన్న నామ్‌దార్ పార్టీ.. రాష్ర్టాలకు సంబంధించిన మహానేతలను ఎప్పుడూ అవమానిస్తూ వచ్చింది. ఈ అవమానాలను భరించలేకే ఎన్టీరామారావు ఆంధ్రప్రదేశ్‌ను ముక్త్ కాంగ్రెస్‌గా మార్చాలని తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు. ఎన్టీఆర్ ఏ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పార్టీపెట్టారో.. ఇవాళ అదే కాంగ్రెస్ కుటుంబంతో జత కట్టారు. ఎన్టీఆర్ ఏ కాంగ్రెస్‌ను దుష్ట కాంగ్రెస్ అన్నారో.. ఇప్పుడు చంద్రబాబు దోస్త్ కాంగ్రెస్ అంటున్నారు. ఇవన్నీ చూస్తే ఎక్కడ ఉన్నా ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది అని మోదీ చెప్పారు.

ఓటమి భయంతోనే..

తన పార్టీ సిద్ధాంతాల నుంచి ఎన్ లోకేశ్ తండ్రి ఎందుకు పక్కదారి పట్టారంటే.. ఆయన వాస్తవాలను ఎదుర్కొనే పరిస్థితిలో లేరని మోదీ అన్నారు. ప్రధానంగా నాలుగు విషయాల్లో బాబు విలవిల్లాడుతున్నారన్నారని చెప్పారు. చంద్రబాబుకు ఎన్నడూ వరుసగా రెండో ఎన్నికలో గెలిచిన చరిత్రలేదని, అందువల్ల రాబో యే ఎన్నికల్లో ఆయనకు ఓటమి భయం పట్టుకుందని తెలిపారు. ఆయన కుమారుడిని రాజకీయాల్లో అందలం ఎక్కించుకోవాలన్న తాపత్రయం బాబులో ఎక్కువైందని, మూడో కారణం సొంత సంపద పెంచుకోవడం.. ఇబ్బంది పెడుతున్నదని చెప్పారు. చంద్రబాబును భయపెడుతున్న నాలుగో కారణం తానేనన్నారు. మీతో ఇప్పుడు మాట్లాడుతున్న ఈ కాపలాదారు(మోదీ) ఆయనకు (బాబు) నిద్రలేకుండా చేశాడు. ఆయన భయకంపితులవుతున్నారు. అని మోదీ వివరించారు.

లెక్కలడగడంతోనే చిక్కు

కేంద్ర ప్రభుత్వం ఏపీ వికాసానికి ఇచ్చిన నిధుల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని లెక్కలు అడుగుతుండటమే చంద్రబాబుకు తనతో సమస్య వచ్చిందని మోదీ పేర్కొన్నారు. ఈయనకు గతంలో ఎప్పుడూ ఢిల్లీ గల్లీల్లో ఎవరికీ లెక్కలు చెప్పాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు చౌకీదార్ (మోదీ) లెక్కలు అడుగుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికోసం ఏవైతే నిధులు ఇచ్చామో.. వాటికి సంబంధించిన ప్రతి పైసా లెక్క చెప్పాలని అడగడంఆయనకు ఇబ్బందిగా మారింది అని తెలిపారు.
Modi1

సంపద పెంచుకోవడం మీకు తెలుసు

మోదీకి సంపద సృష్టించడం రాదని ఇక్కడి ముఖ్యమంత్రి ప్రకటనను చదివాను. లోకేశ్ తండ్రి ఆయనకు సంపద సృష్టించడం బాగా తెలుసని.. అందుకోసం కష్టపడుతున్నానని కూడా చెప్తున్నారు. అవును ఈ విషయంలో ఆయన నిజమే చెప్తున్నారు. అమరావతి నుంచి పోలవరం దాకా తన సంపద పెంచుకోవడంపైనే ఆయన దృష్టిపెట్టారు. అందుకే ఈ కాపలాదారుతో పరేషాన్ అవుతున్నారు. దేశంలోని యువత, కార్మికులు వారి కష్టంతో, శ్రమతో సంపదను సృష్టిస్తున్నారని, దేశంలోని అందరు పిల్లలను సమానంగా చూడాలని, వారి అభివృద్ధికోసం పనిచేయాలే తప్ప సొంత కొడుకు అభివృద్ధికోసం కాదని మోదీ వ్యంగ్యాస్త్రం విసిరారు. తమ రాజనీతికోసం ఇతరుల మీద వరుసగా అబద్ధాలు చెప్తున్నారంటేనే ఏదో లోపం ఉన్నదని అర్థమవుతుందని, తమమీద ఉన్న అభియోగాలను తప్పించుకోవడానికి ఆరోపణలు చేస్తున్నారంటే వాళ్ల కాళ్ల కింద నేల కదిలిపోయిందని అర్థమవుతున్నది. వాళ్లు ప్రజాదరణ కోల్పోయారని తేటతెల్లమవుతుందని చెప్పారు. ఇవాళ చంద్రబాబునాయుడు కలిసిన మహా కల్తీ క్లబ్‌లోని నేతలందరి లక్ష్యం వాళ్ల స్వార్థ రాజకీయాల దీపం కొడిగట్టకుండా కాపాడుకోవడమేనన్నారు. ఈ క్లబ్‌లోని ప్రతి పార్టీనేతల పైన ప్రజాధనాన్ని దోచుకొన్న ఆరోపణలున్నాయని తెలిపారు.

ఫొటోలు తీసుకోవడానికి ఢిల్లీకి..

చంద్రబాబు నిజస్వరూపాన్ని బయటపెట్టేందుకే తాను వచ్చానన్న మోదీ.. గుంటూరులో ఆదివారం నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమాన్ని ఒక చిన్న టెంటులో ప్రభుత్వఖర్చుతో చేశామన్నారు. ప్రజాచైతన్య సభకు అయిన ఖర్చునంతా భారతీయ జనతాపార్టీ కార్యకర్తల డబ్బులతో, చెమటతో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇదే మాకూ వీరికీ ఉన్న తేడా. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా నిద్ర లేవండి. రేపు ఫొటోలు తీసుకోవడానికి మందీమార్బలాన్ని వెంటబెట్టుకొని ఢిల్లీ వెళ్తున్నారు. దీనికంతటికీ ప్రజాధనాన్ని పెద్దఎత్తున ఖర్చుచేస్తున్నారు. ఆంధ్రప్రజలు ఇందుకు చంద్రబాబును అడగాలి. నేను ముఖ్యమంత్రికి చెప్తున్నా.. మీరు ఢిల్లీ వచ్చేముందు.. నన్ను తిట్టడానికంటే ముందు మీరు పెట్టిన ఖర్చుల లెక్కలు ఇక్కడి ప్రజలకు చెప్పి రండి అని సూచించారు.

ఇదేనా ఆంధ్ర సంస్కారం

తనను తిట్టడానికి చంద్రబాబు నిఘంటువులోని తిట్లన్నింటినీ రిజర్వుచేసి పెట్టుకొన్నారని మోదీ అన్నారు. ఆంధ్రుల సంస్కృతి, సంస్కా రం, వినయం.. ఔన్నత్యం దేశంలోని ప్రతి పిల్లవాడికీ తెలుసని, కొన్ని రోజుల నుంచి బాబు.. మోదీని రోజుకొక తిట్టు తిడుతున్నారని చెప్పా రు. ఆంధ్ర ప్రజల సంస్కృతిని కించపరిచే అధికారం మీకు ఉందా బాబుగారు! అని ప్రశ్నించారు. ఈ తండ్రీ కొడుకుల ప్రభుత్వంలోని వారు కొద్ది నెలలుగా మాట్లాడుతున్నారు. నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ రాష్ట్రంలో ప్రజలకు మీ తిట్ల పరమార్థం ఏమిటో బాగా తెలుసు. అందుకే నా ప్రసంగం వినడానికి వచ్చిన అశేష ప్రజలు నన్ను ఆశీర్వదించడానికి వచ్చారు అని అన్నారు.

దిష్టిచుక్క పెట్టారు

ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు ఎలాంటి అపశకునం జరుగకూడదని నల్లచుక్క పెడతారని.. తాను ఏపీకి వచ్చిన సందర్భంగా బాబుగారు, ఆయన కొడుకు, అనుచరులు నల్లని బెలూన్లు వదిలారని.. దానిని తనకు అపశకునం కలుగకుండా దిష్టి తీసినట్టు భావిస్తున్నానని మోదీ అన్నారు. ఇందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు కూడా చెప్పారు. మనం స్కూళ్ల లో చదువుతున్నప్పుడు అప్పుడప్పుడూ టీచర్లు వెనక్కి వెళ్లి మీ సీట్లలో కూర్చోండి. అని చెప్తారు. నేను ఈరోజు తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు చెప్తున్నా. టీడీపీ నేతలు నన్ను గో బ్యాక్ అంటూ వెనక్కి వెళ్లి ఢిల్లీలో కూ ర్చొండి అని సూచిస్తున్నారు. నేను కచ్చితంగా ఢిల్లీ వెళ్లి తిరిగి గద్దెమీద కూర్చుంటాను. నాకు కోట్లమంది భారతీయుల మీద విశ్వాసం ఉన్నది. వారు తెలుగుదేశం పార్టీ కోరికను పూర్తిచేసి ఢిల్లీలో మళ్లీ అధికారం అప్పగిస్తారు. ఆంధ్రలో తండ్రీకొడుకుల ప్రభుత్వం పోవడం తథ్యం. అవినీతి ప్రభుత్వం పోవడం తథ్యం. ఏపీ ప్రజలు అవినీతి లేని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. వారి కోరిక ఈ ఎన్నికల తర్వాత నెరవేరనుంది అని మోదీ అన్నారు.

ఏపీకి రూ.3లక్షల కోట్ల ప్రాజెక్టులు

కేంద్ర ప్రభుత్వం గత 55 నెలల్లో ఎలాంటి లోపం చేయలేదని, లోపమేదైనా జరిగిందంటే.. కేంద్రం నుంచి వచ్చిన డబ్బులను బాబు సర్కారు సరిగ్గా వినియోగించలేదని, వాటి వివరాలు ప్రజలకు చెప్పకుండా దాచిపెట్టిందని మోదీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు ఏ కాంగ్రెస్ అయితే అధికారంలో ఉన్నదో ఇప్పుడు అదే కాంగ్రెస్ ముం దు శ్రీమాన్‌నాయుడు తనను తాను సమర్పించుకున్నారు. 2014లో మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ద్వారా రావాల్సిన ప్రయోజనాలన్నీ వర్తించేలా ప్రత్యేక ప్యాకేజీని రూపొందించాం. ఈ ప్యాకేజీని 2016 సెప్టెంబర్‌లో అమలుచేశాం. ఇందుకు చంద్రబాబు కేంద్ర ఆర్థికమంత్రిని అభినందించారు. అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం కూడా చేశారు. మేం ఈ ప్యాకేజీకి సమర్థంగా అమలుచేయాలని చూస్తే.. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వినియోగించుకోవడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో ఏమీచేయలేక టీడీపీ యూటర్న్ తీసుకుంది. ఈ ప్యాకేజీ పరిధిలో కేంద్రంలోని వివిధ మంత్రిత్వశాఖల నుంచి దాదాపు రూ.3 లక్షల కోట్ల ప్రాజెక్టులకు అనుమతివ్వటం జరిగింది. వీటిలో అనేక ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. విద్యావైద్య సంబంధిత సంస్థలున్నాయి, పారిశ్రామిక, లాజిస్టిక్ హబ్‌లున్నాయి.
Modi2
ఉత్పాదక హబ్‌లు ఉన్నాయి. క్లస్టర్లున్నాయి. వీటివల్ల ఏపీ ప్రజలకు ఉపాధికల్పన, అభివృద్ధి అవకాశాలు ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తీసుకొచ్చిన చట్టంలో పేర్కొన్న ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ వెళ్తున్నాం. ఇందులో తిరుపతి ఐఐటి, అనంతపూర్ సెంట్రల్ యూనివర్సిటీ, వైజాగ్‌లో ఐఐఎం, మంగళగిరిలో ఎయిమ్స్ వంటి 11 ఉన్నత విద్యాసంస్థల్లో పది సంస్థలు ఇప్పటికే ప్రారంభమైపోయాయి. వైజాగ్ చెన్నై కారిడార్, మూడు విమానాశ్రయాల విస్తరణ, మెట్రోకు సంబంధించిన ప్రాజెక్టులు, కొత్త రాజధానికి కనెక్టివిటీకి సంబంధించిన ప్రాజెక్టులు వీటిలో ఎనిమిది భారీ మౌలికరంగ ప్రాజెక్టుల్లో ఆరింటి పనులు ఇప్పటికే మొదలయ్యాయి. విభజనచట్టం ప్రకారం ఈ పనులన్నీ పదేండ్లలో పూర్తిచేయాల్సిఉన్నప్పటికీ మా ప్రభుత్వం అయిదేండ్లలోనే చాలా పనుల్లో పురోగతి సాధించింది. రాష్ర్టాల సమస్యలు నాకు తెలుసు. ప్రాంతీయ ఆకాంక్షల పట్ల నేను అంకితభావంతో ఉంటాను. నేను కూడా చాలాకాలం ముఖ్యమంత్రిగా ఉన్నా. చాలా సమస్యలను ఎదుర్కొన్నా. అందుకే మేం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ప్రయోజనాల్లో ఎలాంటి లోపం ఉండకూడదని కృషిచేశా. మీకు మళ్లీ హామీ ఇస్తున్నా. ఏపీ ప్రయోజనాలను, ఆకాంక్షలను తీర్చడంలో చిత్తశుద్ధితో పనిచేస్తూనే ఉంటాను అని మోదీ ఏపీకి కేంద్రం నుంచి అందించిన ప్రయోజనాల గురించి వివరించారు.

చమురు ప్రాజెక్టులకు శ్రీకారం

బహిరంగసభకు ముందు చమురు నిల్వలకు సంబంధించి మూడు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీకారం చుట్టారు. గన్నవరం విమానశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా గుంటూరు శివారులోఉన్న ఏటుకూరు సభావేదికకు చేరుకున్న ఆయన.. వేదికపై నుంచి రిమోట్ ద్వారా ప్రాజెక్టును ప్రారంభించారు. కృష్ణపట్నం పోర్టు వద్ద రూ.700 కోట్లతో నిర్మించిన బీపీసీఎల్ చమురు నిల్వ టెర్మినల్‌కు శంకుస్థాపన చేశారు. విశాఖలో రూ.1178 కోట్లతో నిర్మించిన వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాన్ని జాతికి అంకితంచేశారు. అమలాపురం వద్ద ఓఎన్జీసీ వశిష్ట, ఎస్-1 ఆన్‌షోర్ ప్రాజెక్టును రిమోట్ ద్వారా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా పట్టణాల్లో జరిగే మార్పుల్లో ప్రజలు భాగస్వాములు కావాలని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఏపీలో రూ.వేల కోట్లతో పథకాలు, ప్రాజెక్టులు ప్రారంభించామని, ఈ ప్రాజెక్టుల వల్ల దేశ చమురురంగంలో ఆంధ్రప్రదేశ్‌కు అధికప్రాధాన్యం లభిస్తుందన్నారు. చమురు నిల్వల్లో ఇబ్బందులు రాకుండా దేశవ్యాప్తంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టుల ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుంది. ప్రాజెక్టుల ద్వారా గ్యాస్ ఆధారిత పరిశ్రమలు అభివృద్ధి అవుతాయి. ఎల్పీజీ, సీఎన్జీ ద్వారా ఎరువుల నిర్మాణం భారీ ఎత్తున జరుగుతుంది. నిన్న అసోంలో గ్యాస్ గ్రిడ్‌ను ప్రారంభించా. అన్ని నగరాల్లో గ్యాస్ పంపిణీ చేసేందుకు దీనిని అనుసంధానం చేస్తున్నాం. దక్షిణ, ఈశాన్య రాష్ర్టాలను పెట్రోలియం హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం అని చెప్పారు. మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. అక్షరక్రమంలోనే కాదు... అన్ని రంగాల్లో, అంశాల్లో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు అని అన్నారు.

-సంపద పెంచుకోవడం మీకు తెలుసు మోదీకి సంపద సృష్టించడం రాదని ఇక్కడి ముఖ్యమంత్రి ప్రకటనను చదివాను. లోకేశ్ తండ్రి ఆయనకు సంపద సృష్టించడం బాగా తెలుసని.. అందుకోసం కష్టపడుతున్నానని కూడా చెప్తున్నారు. అవును ఈ విషయంలో ఆయన నిజమే చెప్తున్నారు. అమరావతి నుంచి పోలవరం దాకా తన సంపద పెంచుకోవడంపైనే ఆయన దృష్టిపెట్టారు. అందుకే ఈ కాపలాదారు (మోదీ)తో పరేషాన్ అవుతున్నారు..

-ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందిఎన్టీఆర్ ఏ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పార్టీపెట్టారో.. చంద్రబాబు ఇవాళ అదే కాంగ్రెస్ కుటుంబంతో జత కట్టారు. ఎన్టీఆర్ ఏ కాంగ్రెస్‌ను దుష్ట కాంగ్రెస్ అన్నారో.. ఇప్పుడు చంద్రబాబు అదే కాంగ్రెస్‌ను దోస్త్ అంటున్నారు. ఇవన్నీ చూస్తే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది..

-నాడు ఎన్టీఆర్ దుష్ట కాంగ్రెస్ అంటే.. నేడు బాబు దోస్త్ కాంగ్రెస్ అంటున్నారు

6822
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles