పిల్లల్లో సేవాభావం పెంచాలి

Fri,November 8, 2019 02:34 AM

-తెలంగాణ స్కౌట్స్ అండ్ గైడ్స్ దేశానికే ఆదర్శం
-ఫౌండేషన్‌డే సెలబ్రేషన్స్‌లో గవర్నర్ తమిళిసైసౌందర్‌రాజన్
-సేవ అనేది పిల్లలకు అలవాటుగా మారాలి: మాజీ ఎంపీ కవిత

హైదరాబాద్, నమస్తే తెలంగాణ/కవాడిగూడ: చిన్నతనం నుంచే పిల్లల్లో సమాజ సేవ చేయాలనే భావనను పెంచాలని గవర్నర్ తమిళిసైసౌందర్‌రాజన్ సూచించారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్ దోమలగూడలోని రాష్ట్ర ప్రధాన కార్యాయలంలో నిర్వహించిన కార్యక్రమంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్యాట్రన్, అధ్యక్షురాలు, గవర్నర్ తమిళిసైసౌందర్‌రాజన్ ముఖ్యఅతిథిగా హాజరవగా, స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్, మాజీ ఎంపీ కవిత అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. తాను విద్యార్థి దశలోనే గైడ్స్ శిక్షణ తీసుకున్నానని, దేశభక్తి, క్రమశిక్షణ, వ్యక్తిగత ఆత్మరక్షణను తెలియజేసే గైడ్స్ కార్యక్రమాన్ని తాను ఎంతగానో ఇష్టపడతానని తెలిపారు. ఇతరులకు సహాయంచేసేలా విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. మాజీ ఎంపీ కవిత ఎంతో చొరవ తీసుకొని స్కౌట్స్ అండ్ గైడ్స్ పాఠశాల అభివృద్ధికి కృషిచేస్తున్నారని ప్రశంసించారు. ఈ పాఠశాలలో మధ్యాహ్న భోజనంతోపాటు పండ్లు అందించి, పిల్లలు బలంగా ఉండేలా చూడటం గొప్ప విషయమని కొనియాడారు.

సమాజంలోని ప్రతిఒక్కరూ క్రమశిక్షణతో మెలగాలని, పెద్దలను స్ఫూర్తిగా తీసుకొని పిల్లలు కూడా క్రమశిక్షణతో నడుచుకుంటారని సూచించారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ పాఠశాలలకు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. తెలంగాణ స్కౌట్స్ అండ్ గైడ్స్ దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు. మాజీ ఎంపీ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కమిషనర్ కవిత మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటు సమయంలో తెలంగాణలో 8,968 స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉండేవారని, ప్రస్తుతం 22,224 మంది ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ మధ్యాహ్న భోజన పథకాన్ని స్కౌట్స్ అండ్ గైడ్స్ పాఠశాలల్లోనూ అమలుచేస్తున్నామని చెప్పారు. భవిష్యత్‌లో 50 వేల సౌట్స్ అండ్ గైడ్స్‌కు చేరుకోవడమే తమ లక్ష్యమని స్పష్టంచేశారు. సేవచేయాలనే లక్షణం పిల్లలకు అలవాటుగా మారాలని, ఆ దిశగా వారిని ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు.

గవర్నర్ స్కౌట్స్ డ్రెస్‌లో రావడం సంతోషంగా ఉన్నదని, ఇది విద్యార్థులకు స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం పది మంది విద్యార్థులకు రాజ్యపురస్కారాలను అందజేశారు. బీఎస్‌జీ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఫీర్స్ కన్‌స్ట్రక్షన్స్ ఎండీ అస్లాం బిన్ మహ్మద్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు రూ.10 లక్షల విరాళం అందజేశారు. కార్యక్రమంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, ట్రెజరర్ రాజగోపాల్, జాయింట్ సెక్రటరీ మంచాల వరలక్ష్మి, ఆర్గనైజింగ్ సెక్రటరీ పరమేశ్వర్, హెడ్‌మాస్టర్ వెంకటేశ్వర్‌రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

176
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles