లుక్ ఈస్ట్‌తో ఐటీ వృద్ధికి ప్రణాళికలు


Mon,April 16, 2018 03:27 AM

Plans for IT growth with Look East

-ఉప్పల్-పోచారం కారిడార్‌లో సంస్థల ఏర్పాటుకు ఇన్సెంటివ్‌లు
-మహానగరం నలువైపులా విస్తరణలో భాగం
-ఐటీ రంగాన్ని కొత్తపుంతలు తొక్కించేందుకు మరో ముందడుగు

look-east
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఐటీ రంగాన్ని అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగుకు సిద్ధమవుతున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మార్గదర్శనం మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ సారథ్యంలో లుక్ ఈస్ట్ పేరుతో కొత్త కార్యాచరణకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. హైదరాబాద్ మహానగరం నలువైపులా ఐటీ రంగాన్ని అభివృద్ధిపరిచే ప్రణాళికల్లో భాగంగా నగరం తూర్పు వైపున ఐటీ కంపెనీల ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించే ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఉప్పల్, మేడిపల్లి, పోచారం, ఘట్‌కేసర్ సహా సమీప ప్రాంతాలను అభివృద్ధిపథంలోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. నగరం నలువైపులా ఐటీ, పారిశ్రామికాభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త ప్రాంతాల్లోనూ ఐటీ రంగాన్ని అభివృద్ధిపరిచేందుకు కసరత్తు చేస్తున్నారు.

ఇందులో భాగంగానే లుక్ ఈస్ట్ పాలసీని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉప్పల్ ఐటీ కారిడార్‌లో జెన్‌ప్యాక్ట్, ఎన్‌ఎస్‌ఎల్ సెజ్‌లు ఉన్నాయి. వీటి పరిసరాల్లో మరిన్ని కంపెనీలు కూడా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. మెట్రోరైలు అందుబాటులోకి రావడంతో ఉప్పల్-పోచారం ఐటీ కారిడార్ అభివృద్ధికి మంచి అవకాశంగా ప్రభుత్వం భావిస్తున్నది. ఈ కారిడార్‌లో కంపెనీల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ప్రత్యేక ఇన్సెంటివ్‌లు అందించే యోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తున్నది. యాంకర్ క్లయింట్ల క్యాటగిరీలోకి వచ్చే బడాకంపెనీలకు సౌలభ్యంగా ఉండేలా, పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు తోడ్పడేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు సమాచారం.
ktr-look-east

ఓఆర్‌ఆర్ కేంద్రంగా అభివృద్ధి

హైదరాబాద్ మహానగరం చుట్టూ పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఔటర్ రింగ్ రోడ్డు కేంద్రంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది. కౌంటర్ మాగ్నెట్స్ పేరుతో నగరంపై ఒత్తిడి తగ్గించేందుకు ఓఆర్‌ఆర్ చుట్టూ కంపెనీలు ఏర్పాటయ్యేలా చూస్తున్నారు. దీనిలో భాగంగా ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో కనెక్టివిటీని మూడు, నాలుగేండ్లలో ప్రారంభించేందుకు తెలంగాణ సర్కార్ సన్నాహాలు చేస్తున్నది. శంషాబాద్‌తోపాటు విమానాశ్రయం ప్రాంతం అభివృద్ధి చెందడమే కాకుండా ఉపాధి అవకాశాలు మెరుగుపడేందుకు ఈ ఆలోచన ఉపయుక్తంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు.

4128
Tags

More News

VIRAL NEWS