రాష్ట్రవ్యాప్తంగా ఈ-కోర్టులు


Fri,February 22, 2019 10:41 AM

Pilot project in Warangal is successful

-మరో 15 రోజుల్లో అందుబాటులోకి..
-కసరత్తు ముమ్మరంచేసిన పోలీస్‌శాఖ
-వరంగల్‌లో పైలట్ ప్రాజెక్టు విజయవంతం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దేశంలోనే తొలిసారిగా వరంగల్ జిల్లా సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో రెండునెలల క్రితం పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ-కోర్టులు (ఐసీజేఎస్-ఇంటరాపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం) విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయడానికి తెలంగాణ పోలీస్‌శాఖ కసరత్తు చేస్తున్నది. మరో పదిహేనురోజుల్లో అన్నిజిల్లాల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లుచేస్తున్నట్టు అదనపు డీజీ (టెక్నికల్ సర్వీసెస్), నోడల్ అధికారి రవిగుప్తా నమస్తే తెలంగాణకు తెలిపారు. ఐసీజేఎస్ విధానంలో పోలీస్‌స్టేషన్ నుంచే సంబంధిత ఎస్‌హెచ్‌వో చార్జిషీట్, ఎఫ్‌ఐఆర్ కాపీలను స్కాన్‌చేసి కోర్టుమేజిస్ట్రేట్‌కు ఆన్‌లైన్ ద్వారా పంపుతారు. అవి అందినట్టుగా ఆన్‌లైన్ ద్వారానే కోర్టు రసీదు ఇస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయబోయే ఈ-కోర్టు విధానాన్ని తొలివిడుతలో చార్జిషీట్ వరకే పరిమితం చేస్తామని, తర్వాత ఎఫ్‌ఐఆర్‌లు, ట్రయల్, రిమైండ్ రిపోర్టులు, బెయిల్ ఇతర ప్రక్రియలకు అన్వయిస్తామని రవిగుప్తా తెలిపారు.

వరంగల్‌లో విజయవంతంగా అమలు

గతేడాది డిసెంబర్ 15న వరంగల్ జిల్లా సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఐసీజేఎస్ పైలట్‌ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రస్తుతం చార్జిషీట్, ఎఫ్‌ఐఆర్‌లు ఆన్‌లైన్ విధానంలో పంపుతున్నట్టు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వీ రవీందర్ తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 500 చార్జిషీట్లు ఐసీజేఎస్ విధానంలో దాఖలుచేసినట్టు చెప్పారు. ఎలక్ట్రానిక్ విధానంలో ఎఫ్‌ఐఆర్, చార్జిషీట్లను ఆన్‌లైన్‌లో ఎస్‌హెచ్‌వో అప్‌లోడ్‌చేస్తే వెంటనే మేజిస్ట్రేట్‌కు రియల్‌టైంలో చేరుతుంది.

వెంటనే కోర్టులు ఒక రిఫరెన్స్ నంబర్ ఉన్న రసీదును ఆన్‌లైన్‌లో పంపుతారని చెప్పారు. ఈ విధానం వల్ల కోర్టు విధులకు కేటాయించాల్సిన పోలీస్ సిబ్బంది సంఖ్య తగ్గడంతోపాటు పారదర్శకత పెరుగుతుందన్నారు. కోర్టులకు కూడా చార్జిషీట్‌లోని సమాచారాన్ని మళ్లీ టైప్ చేసుకునే పని తప్పుతుందని, తప్పులు దొర్లే ఆస్కారం ఉండదని వివరించారు. పూర్తి ఫైళ్లు డిజిటలైజ్‌చేసే వీలుకలుగుతుందని, డిజిటల్ డాటా అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

1179
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles