ఆర్టీసీపై పీఎఫ్ పిడుగు

Sat,November 9, 2019 02:14 AM

-760 కోట్ల బకాయిలు ఎందుకు చెల్లించలేదు?
-15లోగా స్వయంగా హాజరై వివరణ ఇవ్వండి..
-ఆర్టీసీ ఎండీకి పీఎఫ్ రీజినల్ కమిషనర్ నోటీస్
-రూట్ల ప్రైవేటీకరణపై 11 వరకు చర్యలొద్దు
-క్యాబినెట్ నిర్ణయ పత్రాలు సమర్పించండి
-ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై ఏజీకి హైకోర్టు సూచన
-రూట్ల ప్రైవేటీకరణ కేంద్ర చట్టం ప్రకారమే
-హైకోర్టుకు నివేదించిన అడ్వకేట్ జనరల్
-విచారణ సోమవారానికి వాయిదా

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పుల్లో కూరుకుపోయిన టీఎస్ ఆర్టీసీ నెత్తిన పీఎఫ్ బకాయిల రూపంలో పిడుగుపడింది. ఆర్టీసీ కార్మికుల పీఎఫ్ ఖాతాలో రూ.760.62 కోట్లను సంస్థ యాజమాన్యం జమచేయలేదు. దీనిపై ఆర్టీసీ యాజమాన్యానికి నోటీసులు జారీచేసిన ప్రావిడెంట్ ఫండ్ రీజినల్ కమిషనర్.. కార్మికుల పీఎఫ్ బకాయిలు ఎందుకు చెల్లించలేదో చెప్పాలని కోరారు. ఆర్టీసీ కార్మికుల పీఎఫ్ ఖాతాలో రూ.760.62 కోట్లను జమచేయని విషయం తమ దృష్టికి వచ్చిందని నోటీస్‌లో పేర్కొన్నారు. పీఎఫ్ బకాయిలు ఎందుకు చెల్లించలేదో 15వ తేదీలోగా పూర్తి సమాచారంతో తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని కోరారు. ప్రావిడెంట్ ఫండ్ ఎప్పటికప్పుడు చెల్లించనిపక్షంలో భారీ జరిమానాలు విధించే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీకి వెంటనే రూ.200 కోట్లు చెల్లించాలని రెండ్రోజుల క్రితం హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అదే రోజు.. తమకు రూ.452.86 కోట్ల మేర రవాణా పన్ను చెల్లించాలని స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ కార్యదర్శి మమతాప్రసాద్ ఆర్టీసీకి నోటీసులు పంపారు. వీటితోనే సతమతమవుతున్న ఆర్టీసీకి.. తాజాగా పీఎఫ్ రీజినల్ కమిషనర్ నోటీసుతో మరింత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి.

క్యాబినెట్ నిర్ణయ పత్రాలు సమర్పించండి: హైకోర్టు

రాష్ట్రంలో 5,100 ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరించాలని రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పత్రాలను సోమవారంకల్లా తమకు సమర్పించాలని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోరాదని తెలిపింది. రూట్ల ప్రైవేటీకరణను సవాల్‌చేస్తూ తెలంగాణ జనసమితి నాయకుడు పీఎల్ విశ్వేశ్వర్‌రావు దాఖలుచేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ అభిషేక్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా క్యాబినెట్ నిర్ణయ పత్రాలు మీ వద్ద ఉన్నాయా? అని పిటిషనర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించిందని, దీనిపై పత్రికల్లో విస్తృత కథనాలు కూడా వచ్చాయని ఆయన బదులిచ్చారు.
TSRTC-BUS
క్యాబినెట్ నిర్ణయం పత్రాలు పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో లేనందున తమకు కాపీ లభించలేదని తెలిపారు. అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ ఒక పౌరునికి క్యాబినెట్ నిర్ణయాలను సవాలుచేసే హక్కు ఉండదని వాదించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులను కూడా సమర్పిస్తామని తెలిపారు. క్యాబినెట్ నిర్ణయానికి సంబంధించి ఇంకా ఎటువంటి జీవోలు జారీకాలేదని పేర్కొన్నారు. ఈ అంశంలో ప్రభుత్వం నుంచి తాను సూచనలు తీసుకోవాల్సి ఉన్నదని తెలిపారు. కేంద్ర చట్టం ప్రకారం సంక్రమించిన అధికారంతోనే క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నదని ధర్మాసనానికి నివేదించారు.

ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం పిటిషనర్ చెప్పేదంతా నిజమని తాము అనడంలేదని, క్యాబినెట్ నిర్ణయాన్ని కూడా తప్పుబట్టడం లేదని, ఆ నిర్ణయానికి సంబంధించిన చట్టబద్ధతను మాత్రమే తాము పరిశీలిస్తామని తెలిపింది. ఆర్టీసీ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ జే రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ పిటిషన్‌పై ప్రాథమిక అభ్యంతరాలున్నాయని అన్నారు. పిటిషన్‌లోని తప్పొప్పులపై ప్రస్తుతం తాము విచారణ జరుపడం లేదని, అభ్యంతరాలన్నీ కౌంటర్ రూపంలో దాఖలు చేయాలని ధర్మాసనం పేర్కొన్నది. ప్రాథమిక అభ్యంతరాలను తాము తిరస్కరిస్తే.. కౌంటర్ దాఖలుకు అవకాశం ఇవ్వలేదనే అపవాదు వస్తుందని, అందుకే అన్ని వివరాలు కౌంటర్‌లో దాఖలుచేయాలని తెలిపింది. ఈ మేరకు క్యాబినెట్ నిర్ణయాన్ని సమర్పించాలని, ప్రస్తుత అంశం కోర్టు పరిధిలో ఉన్నందున సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోరాదని తెలిపింది. విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది.

4287
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles