వలసల జోరు ప్రచార హోరు


Tue,September 11, 2018 01:51 AM

peoples joing to trs party

-కాంగ్రెస్‌కు భారీ షాక్
-రేపు టీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు
-గులాబీ గూటికి మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి
-మేడ్చల్, వికారాబాద్‌లకు చెందిన
-ఇద్దరు ప్రముఖులు కూడా..
-టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తితో మరికొందరు
-ఉప్పల్‌లో బండారి లక్ష్మారెడ్డి రాజీనామా
-అనైతిక పొత్తుపై ఆగ్రహం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించి, ప్రచారహోరుతో దూసుకుపోతున్న టీఆర్‌ఎస్‌లో చేరికల జోరు కొత్త జోష్ నింపుతున్నది. తెలంగాణ ప్రగతి రథచక్రం ఆగకూడదని కొందరు, కాంగ్రెస్-టీడీపీ అనైతిక పొత్తులను వ్యతిరేకిస్తూ మరికొందరు టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారు. వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు బుధవారం గులాబీ జెండా కప్పుకోనున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేఆర్ సురేశ్‌రెడ్డి, ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన బండారి లక్ష్మారెడ్డితోపాటు పలువురు ప్రముఖులు టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. వీరి చేరికకు టీఆర్‌ఎస్ నాయకత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మేడ్చల్ జిల్లాకు చెందిన మరో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, వికారాబాద్ జిల్లాకు చెందిన ఒక ముఖ్య నాయకుడు కూడా భారీ సంఖ్యలో తమ అనుచరులతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు తెలుస్తున్నది. మరోవైపు జీహెచ్‌ఎంసీ, నల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాలకు చెందిన కీలక నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు పార్టీ ముఖ్యనేతలతో చర్చిస్తున్నారని సమాచారం. ఒంటరిగా గెలిచే పరిస్థితులు లేవనే ఉద్దేశానికి వచ్చిన కాంగ్రెస్.. టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌తో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నది. ఈ మేరకు ఇప్పటికే చర్చలు కూడా మొదలయ్యాయని వార్తలు వస్తున్నాయి. అయితే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీతో పొత్తు పెట్టుకోవడాన్ని పలువురు కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు.

కాంగ్రెస్‌ను ఖతం చేసే లక్ష్యంతో ఏర్పడిన టీడీపీతో ఎలా జట్టుకడుతారంటూ పలువురు కాంగ్రెస్ నాయకులు అధిష్ఠానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ను వీడాలని నిర్ణయించుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కీలక నాయకుడిగా ఉన్న ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన బండారి లక్ష్మారెడ్డి సోమవారం కాంగ్రెస్‌కు రాజీనామాచేశారు. టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించారు. ఆయనతోపాటు ఇదే నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్ శాంతిసాయి జెన్ శేఖ్, పది డివిజన్ల పార్టీ అధ్యక్షులు, పార్టీ నుంచి కార్పొరేటర్లుగా పోటీచేసి ఓడిపోయినవారు, పెద్దఎత్తున అనుచరులు కూడా బుధవారం గులాబీ జెండా కప్పుకోనున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అమలుచేస్తున్న పథకాలతో అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని, ప్రజలు మరోసారి సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని పలువురు విపక్ష నాయకులు చెప్తున్నారు. కానీ.. ప్రజల ఆలోచనలకు భిన్నంగా ప్రస్తుతం పలు పార్టీలు అనైతిక పొత్తులకు తెరతీశాయని, తద్వారా ఓటమిని ముందే అంగీకరించాయని పేర్కొంటున్నారు. కాంగ్రెస్‌లోని కొందరు నాయకుల స్వార్థ ఆలోచనలకు వ్యతిరేకంగానే తాము ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నామని చెప్తున్నారు. టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తూ ఉప్పల్ లకా్ష్మరెడ్డితో మొదలైన రాజీనామాలు.. రాబోయే రోజుల్లో మరింత పెరుగుతాయని అంచనావేస్తున్నారు.

908
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles