రైతుతో నక్షాల ఆట!


Wed,May 22, 2019 02:50 AM

Peddapalli DIstrict Farmer suffering for Pattadar Passbook

-పహాణీలో భూమి ఉన్నా పాస్‌బుక్ ఇస్తలేరు
-నక్ష సమస్య పేరుతో అధికారుల నాన్చివేత
-పక్క రైతులను ఉసిగొల్పుతున్న సిబ్బంది
-నాలుగేండ్లుగా సాగుచేసుకోకుండా అడ్డంకులు
-పెద్దపల్లి జిల్లాకు చెందిన బాధిత రైతు ఆవేదన

ఏ ఆధారం లేని ఆ పేద రైతుకు ఆసరాగా నిలిచేందుకు ప్రభుత్వం కొంత భూమి కేటాయించింది! కానీ.. ఘనత వహించిన రెవెన్యూ అధికారులు మాత్రం.. ఆ భూమిని సాగుచేసుకోనీయకుండా నక్షాల ఆట ఆడుతున్నారు! అంతేకాదు.. ఆ భూమిని ఆ పేద రైతు నుంచి లాగిపారేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు! ఒక అధికారి ఆ భూమి 1బీ పహాణీలో ఉన్నదంటారు.. కానీ పట్టాదార్ పాస్‌పుస్తకం ఇవ్వరు! మరో అధికారి నక్ష తప్పు ఉన్నదని సెలవిస్తారు! ఇంకో అధికారి నక్ష సరిగానే ఉందని ధ్రువీకరిస్తారు! కానీ.. ఆ రైతుకు భూమి మాత్రం దక్కడం లేదు! ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే.. కూడబలుక్కున్న కిందిస్థాయి సిబ్బంది తప్పుడు రిపోర్టులిచ్చి.. తప్పుదోవ పట్టిస్తున్నారు! ఎవరైనా తన గోడు పట్టించుకోకపోతారా అన్న ఆశతో ఆ బడుగు రైతు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు! ఒక దశలో విసిగివేసారి బలవన్మరణానికీ ప్రయత్నించాడు! అధికారుల మనసు కరుగకపోవడంతో బాధితుడు ధర్మగంటను ఆశ్రయించాడు!
Dharmaganta
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం అందుగులపల్లి గ్రామానికి చెందిన కేశవేని నర్సింగం అనే రైతుకు అందుగులపల్లి గ్రామ శివారులోని 269 సర్వేనంబర్‌లో 1.20 ఎకరాల భూమి ఉన్నది. 2000 సంవత్సరం నుంచి ఆ భూమిని ఆయన సాగుచేసుకుంటున్నారు. సదరు భూమికి నర్సింగం పేరిట 2004 ఫిబ్రవరిలో మండల రెవెన్యూ అధికారి ప్రాథమిక పట్టా మంజూరుచేశారు. అదే సంవత్సరం నవంబర్‌లో అంతిమ పట్టా కూడా మంజూరుచేశారు. 2005లో పట్టా నంబర్ 981తో కేశవేని నర్సింగం పేరిట పట్టాదార్ పాస్‌పుస్తకం ఇచ్చారు. ఇటీవల భూ ప్రక్షాళన సందర్భంగా ఆ భూమికి సంబంధించిన 1-బీ కూడా అధికారులు మంజూరుచేశారు. కొత్త పాస్‌పుస్తకం ఇవ్వడంలో మాత్రం జాప్యంచేస్తున్నారు. బాధితుడు ఎన్నిసార్లు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారులు స్పందించడం లేదు. నక్ష సమస్య ఉందంటూ దాటవేస్తున్నారు.

కొత్త పాస్‌పుస్తకం ఇవ్వకపోగా 424 సర్వేనంబర్‌లో భూమి ఉన్న రైతులను తనమీదకి ఉసిగొల్పుతున్నారని నర్సింగం ఆరోపిస్తున్నారు. రెవెన్యూ అధికారుల అండదండలతో వారు తనపై దాడులుచేసి, భూమిని సాగుచేసుకోకుండా అడ్డుకుంటున్నారని వాపోతున్నారు. వాస్తవానికి 424 సర్వేనంబర్‌లోని భూములు కమాన్‌పూర్ శివారులోకి వస్తాయి. 269 సర్వేనంబర్ భూమి రాఘవాపూర్ శివారులోకి వస్తుంది. రాఘవాపూర్ రైల్వేస్టేషన్ కూడా రాఘవాపూర్ శివారులోని సర్వేనంబర్ 192లో ఉంటుంది. ఆ రైల్వేస్టేషన్ కమాన్‌పూర్ మండల పరిధిలోకి రాదని కమాన్‌పూర్ ఎమ్మార్వో కూడా నిర్ధారించారు. రాఘవాపూర్ రైల్వేస్టేషన్ ఉన్న 192 సర్వేనంబర్, తన భూమి ఉన్న 269 సర్వేనంబర్లు పక్కపక్కనే ఉంటాయని బాధితుడు చెప్తున్నారు. రాఘవాపూర్, కన్నాల శివారులను విభజిస్తూ నక్ష ఉన్నది. కన్నాల శివారులోని 424 సర్వేనంబర్‌లో ఉన్నవి పట్టా భూము లు.

రాఘవాపూర్ శివారులోని 269 సర్వేనంబర్‌లో ఉన్న బాధితుని భూమి లావుని పట్టా ద్వారా సంక్రమించిన ప్రభుత్వ భూమి. అయినప్పుటికీ 424 సర్వేనంబర్‌లోని రైతులు తనపై దౌర్జన్యం చేస్తూ భూమిని ఆక్రమించుకుని, నాలుగేండ్లుగా సాగుచేసుకోనివ్వడంలేదని నర్సింగం ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయంపై అధికారులను ప్రశ్నిస్తే నక్ష సమస్య ఉందంటూ దాటవేస్తున్నారని వాపోతున్నారు. నక్ష సమస్య పరిష్కరించి, తన భూమికి సంబంధించిన పాస్‌పుస్తకం ఇప్పించాలని కలెక్టర్‌కు, ఆర్డీవోకు, ఎమ్మార్వోకు ఎన్నోసార్లు ఫిర్యాదుచేశారు. ప్రజావాణిలో ఫిర్యాదుచేసినా పట్టించుకోకపోవడంతో కలత చెందిన నర్సింగం పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నంచేశారు. వెం టనే రెవెన్యూ అధికారులు సర్వే చేయించారు. 269 సర్వేనంబర్‌లోని భూమి రాఘవాపూర్ శివారులోకి వస్తుందని తేలింది.
old-pass-book
అయినా అధికారులు పాస్‌పుస్తకం ఇవ్వకపోవడంతో హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై సివిల్ కోర్టును సంప్రందించాలని హైకోర్టు సూచించింది. పెద్దపల్లి సివిల్ కోర్టులో ఫిర్యాదుచేస్తే నక్ష సర్వేచేయాలని ఆదేశించింది. అధికారులు 269 సర్వేనంబర్ నుంచి పోతున్న రాఘవాపూర్ స్టేషన్- దేవునిపల్లి తారురోడ్డును 424 సర్వేనంబర్ నుంచి పోతున్నట్టు తప్పుడు సర్వే రిపోర్టును కోర్టుకు సమర్పించారు. అన్నింటినీ పరిశీలించిన కోర్టు.. 269 సర్వేనంబర్‌లోని 1.20 ఎకరాల భూమి కేశవేని నర్సింగంకే చెందుతుందని నిర్థారించింది. కానీ.. కోర్టు ఆదేశాలను సైతం రెవెన్యూ అధికారులు ఖాత రు చేయడంలేదు. కలెక్టర్ ఆదేశాల మేరకు భూమి కొలతలు, రికార్డుల శాఖ అధికారులు సర్వే చేసి రాఘవాపూర్, కన్నాల నక్షలు సరైన వే అని తేల్చినా రెవెన్యూ అధికారులు సమస్య పరిష్కరించి కొత్త పాస్‌పుస్తకం ఇవ్వకుండా 269 సర్వేనంబర్‌లో ఓవర్‌ల్యాప్ ఉన్నదంటూ బాధితుడిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

బావి తవ్వుకోవడానికి అధికారులే అనుమతి ఇచ్చారు

269 సర్వేనంబర్‌లోని 1.20 ఎకరాల భూమికి సంబంధించిన పాస్‌పుస్తకం ఇవ్వకుండా తిప్పలు పెడుతున్న ఈ అధికారులే, ఆ భూమిలో ఉపాధి హామీ పనుల్లో బావి తవ్వుకోవడానికి అనుమతి కూడా ఇచ్చారు. విద్యు త్ కనెక్షన్ మంజూరుచేశారు. నా భూమిని తమ భూమంటూ దాడులుచేస్తున్న బాబు, చోటేమియా, గౌస్, బబ్లూ వారి భూమిని ఎప్పుడో రైల్వేస్టేషన్‌కు అమ్ముకొన్నారు. రెవెన్యూ అధికారులు వారితో కుమ్మక్కై నాపై దౌర్జన్యం చేస్తున్నారు. నాకున్నది 1.20 ఎకరాలు మాత్రమే. ఆ భూమే నాకు ఆధారం. ఉన్నతాధికారులు వెంటనే సమస్యను పరిష్కరించి, నా భూమిని ఇప్పించాలి.
- కేశవేని నర్సింగం, బాధితుడు

1బీ ఇచ్చారు.. పాస్‌బుక్ మరిచారు

MAnagir
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం రుద్రారం గ్రామ శివారులోని సర్వేనంబర్ 51/1అ/4లో నాకు వంశపారంపర్యంగా వచ్చిన 1.17 ఎకరాల భూమికి పట్టాదారు పాస్‌బుక్ జారీచేయడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. సదరు భూమికి 1బీ పత్రం ఇచ్చినప్పటికీ పాస్‌బుక్ కోసం సుమారు 10 నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదు. దీనిపై జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తాసిల్దార్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేసినా ఫలితం లేకుండా పోయింది. మా నాన్నకు ఐదుగురు కుమారులం. మాకు 1.17 ఎకరాల చొప్పున భూమి అనువంశికంగా సంక్రమించింది. మిగతా నా నలుగురు సోదరులకు పాస్‌బుక్‌లు ఇవ్వగా నాకు మాత్రం కారణం చెప్పకుండానే జాప్యంచేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతుబంధు అందకుండా పోయింది. నా భూమి వివరాలు ఆన్‌లైన్ కాలేదని ఒకసారి, పాస్‌బుక్ రాలేదని మరోసారి పొంతనలేని సమాధానాలు చెప్తున్నారు. అధికారుల తీరుతో తీవ్ర మానసిక వ్యధకు గురవుతున్నాను. నాకు న్యాయం చేయండి.

అధికారుల నిర్లక్ష్యం.. రైతుకు శాపం

-1.18 ఎకరాలను నమోదుచేయని రెవెన్యూ అధికారులు
-న్యాయం చేయాలంటున్న బాధిత రైతు యజ్ఞసౌమిత్రారెడ్డి

Yagnaswmi
పాత పట్టాదార్ పాస్‌పుస్తకంలో ఉన్న మొత్తం భూమి వివరాలను కొత్తబుక్‌లో నమోదుచేయకపోవడంతో బాధిత రైతు తాసిల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూనే ఉన్నాడు. అయినా, అధికారులు రేపు, మాపు అంటూ తిప్పించుకుంటూనే ఉన్నారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలం రేవూరుకు చెందిన విప్పకుంట్ల యజ్ఞసౌమిత్రారెడ్డికి గ్రామంలో వారసత్వంగా వచ్చిన 6.2 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. సర్వేనంబర్ 11లో 20 గుంటలు, 13లో 26 గుంటలు, 13/1లో 0.065 గుంటలు, 829/అ/1లో 22.5 గుంటలు, 830/అ/1/1 లో 2.38 ఎకరాలు, 832/ఉ/1లో 1.18 ఎకరాలు, 1104/అ/1/1 లో 0.09 గుంటల భూమి ఉన్నది. వేర్వేరు సర్వేనంబర్లతో ఉన్న 5.02 ఎకరాల భూమికి కొత్త పట్టా పాస్‌పుస్తకం వచ్చింది. కానీ, సర్వేనంబర్ 832/ఉ/1లో ఉన్న 1.18 ఎకరాల భూమి మాత్రం కొత్త పుస్తకంలో ఎక్కలేదు. 1బీలో ఉన్నా ఈ సర్వేనంబర్ భూమిని నమోదుచేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ భూమికి రైతుబంధు సాయం కూడా అందలేదు. అధికారులను ఎందుకు నమోదుచేయలేదని అడిగితే ఇదిగోచేస్తాం.. అదిగో చేస్తాం.. అని కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని, వచ్చిన ప్రతీసారి దరఖాస్తు చేయమంటున్నారని, ఇప్పటికీ మూడుసార్లు చేసినా ప్రయోజనం లేదని రైతు ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు.

3155
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles