యురేనియం తవ్వకాలకు అనుమతిలేదు

Sun,September 15, 2019 03:08 AM

-అనుమానాలకు తావులేదు
-స్పష్టంచేసిన అటవీశాఖ పీసీసీఎఫ్ శోభ
-అటామిక్ మినరల్ డైరెక్టరేట్ నుంచి ప్రతిపాదనలు మాత్రమే పంపారని వెల్లడి

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నల్లమల అటవీప్రాంతంలో యురేనియం నిక్షేపాల సర్వేకు తాము ఎలాంటి అనుమతినివ్వలేదని రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ రొయ్యూరు శోభ స్పష్టంచేశారు. ఇంతవరకు అటామిక్ మినరల్ డైరెక్టరేట్ అధికారులెవ్వరూ బోర్‌డ్రిల్లింగ్ పాయింట్లను పరిశీలించడానికి రాలేదని ఆమె శనివారం నమస్తే తెలంగాణకు చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని, అపోహలు వద్దన్నారు. అటవీచట్టం ఫారం-సీ రూపంలో ఒక ప్రతిపాదన పంపారు తప్ప.. నిర్దిష్టంగా డ్రిల్లింగ్ పాయింట్ల విషయంపై సమగ్ర ప్లాన్ ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్రతిపాదిత నిక్షేపాల సర్వే ప్రాంతాలైన ఉడిమిల్ల, నారాయణ్‌పూర్, అమ్రాబాద్ బ్లాక్‌లు పెద్దపులుల అభయారణ్యం పరిధిలోకి వస్తాయని తెలిపారు. అభయారణ్యంలో వన్యప్రాణుల మనుగడకు ప్రమాదం ఏర్పడకుండా, పర్యావరణం దెబ్బతినకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం అనుమతి పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

వాహనాలు లేకుండా బండి బాటలోనే వెళ్లాలని, ఉదయం 6 గంటల నుంచి సూర్యాస్తమయంలోపు డ్రిల్లింగ్ జరుగాలని, పెద్ద వాహనాలను అనుమతించబోమని, చెట్టు కొమ్మకూడా కొట్టరాదన్న పలు షరతులు విధించామని వివరించారు. షరతులన్నీ పాటిస్తే తప్ప అనుమతికి అవకాశం ఉండదని స్పష్టంచేశారు. క్షేత్రస్థాయిలో బోర్ డ్రిల్లింగ్ జరిపే పరిస్థితులున్నాయా అనే విషయంపై క్షుణ్నంగా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. వారి అధ్యయనం పూర్తయ్యాకకానీ, ఏ విషయం చెప్పలేమని పేర్కొన్నారు. అధ్యయనం తర్వాత ప్రతిపాదనను స్టేట్ బోర్డు ఫర్ వైల్డ్‌లైఫ్‌కు సమర్పించాలని, అక్కడ అనుమతి ఇవ్వాలా లేదా అన్నది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందని తెలిపారు. తర్వాత నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్‌లైఫ్‌కు నివేదిక ఇవ్వాలని చెప్పారు.

ప్రతిపాదనలే సమర్పించారు..

వాస్తవానికి అభయారణ్యంలో పది చదరపు కిలోమీటర్లకు 25 బోర్లను డ్రిల్ చేయడానికే అనుమతి ఉంటుంది. అంటే 83 చదరపు కి.మీ.కు 207 పాయింట్లలో మాత్రమే డ్రిల్లిం గ్ పాయింట్లకు అనుమతిస్తారు. కానీ, అటామిక్ మినరల్ డైరెక్టరేట్ అధికారులు 83 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో 4 వేల పాయింట్లలో డ్రిల్లింగ్‌కు ప్రతిపాదన సమర్పించారు అని శోభ తెలిపారు. తమకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి అనుమతి రాలేదని హైదరాబాద్‌లోని అటామిక్ మినరల్ డైరెక్టరేట్ (ఏఎండీ) అధికారులు చెప్తున్నారు. తాము అటవీప్రాంతంలో యురేనియం నిక్షేపాల నమూనా సేకరణకు ప్రతిపాదనలు సమర్పించామే తప్ప ఎక్కడా తవ్వకాలు చేపట్టడానికి ప్రయత్నించలేదని ఇటీవల స్పష్టంచేశారు.

770
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles