పాస్‌పోర్ట్ ట్యాంపరింగ్ ముఠా అరెస్ట్

Tue,February 19, 2019 03:24 AM

-భారతీయులకు ఇతర దేశాల్లో పాస్‌పోర్టు జారీ అయినట్టు సృష్టి
-అక్కడినుంచి భారత్‌కు వచ్చినట్టు ఇమ్మిగ్రేషన్ సంతకాలు.. వాటితో వీసాలు

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నకిలీ పాస్‌పోర్ట్‌లు సృష్టించి.. వాటిసాయంతో వివిధ దేశాల వీసాలు ఇప్పిస్తున్న ముఠాను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్‌చేశారు. ఐదుగురు సభ్యుల ముఠా ఇప్పటివరకు 450 మందికి ఫోర్జరీ పాస్‌పోర్ట్‌లతో వీసాలు ఇప్పించినట్టు తేలింది. వీరినుంచి 88 పాస్‌పోర్టులు, వివిధ దేశాల ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించిన 130 రబ్బర్‌స్టాంప్‌లు, రూ.3.12 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం హైదరాబాద్ పోలీస్‌కమిషనర్ అంజనీకుమార్ కేసు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌లోని హుస్సేనీఆలంకు చెందిన మహ్మద్ అబ్దుల్ రహీముద్దీన్, ఖలీద్‌ఖాన్ నకిలీ కన్సల్టెన్సీలు నిర్వహిస్తున్నారు. కెనడా, ఆమెరికా, యూఏ ఈ, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ తదితర దేశాలకు వెళ్లాలనుకునేవారికి నకిలీ డాక్యుమెంట్లు త యారుచేసి వీసాలు ఇప్పిస్తుంటారు. తమిళనాడులోని చెన్నైకి చెందిన మహ్మద్‌షేక్ ఇలియాస్ పాస్‌పోర్టు, వీసాలను ఫోర్జరీలో దిట్ట. గతంలో చంచల్‌గూడ జైల్లో ఉండగా రహీముద్దీన్, ఇలియాస్ మధ్య స్నేహం ఏర్పడింది. బయటికి వచ్చిన తర్వాత వీరిద్దరు, ఖలీద్‌ఖాన్, టప్పాచబుత్రకు చెందిన డీటీపీ అపరేటర్ సయ్యద్ ఒమర్, చత్తబజార్‌కు చెందిన లిమ్రా, రబ్బర్‌స్టాంప్ సంస్థ నిర్వాహకుడు మహ్మద్ జహీరుద్దీన్ కలిసి ముఠాగా ఏర్పడ్డారు.

ఎలా చేస్తారంటే..?

మనదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లినవారు అక్కడ పాస్‌పోర్ట్‌ను పోగొట్టుకుంటే.. అక్కడి ఇండియన్ ఎంబసీ మరో పాస్‌పోర్ట్ జారీచేస్తుంది. ఆ వివరాలు డాటాబేస్‌లో ఉండవు. ఈ లొసుగును ఆధారం చేసుకొని ఈ ముఠా ఫేక్ పాస్‌పోర్ట్‌లు తయారుచేస్తున్నది. విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించి విఫలమైనవారు ఈ ముఠాను సంప్రదిస్తారు. వారు సదరు వ్యక్తికి భారత్‌లో జారీఅయిన పాస్‌పోర్ట్ తీసుకొని.. దానిని ఫోర్జరీచేసి విదేశాల్లో జారీఅయినట్టు తయారుచేస్తారు. ఆ నకిలీ పాస్‌పోర్టుపై ఇదివరకే భారత్‌కు వచ్చినట్టు, ఇమ్మిగ్రేషన్ అధికారులు సంతకాలు చేసినట్టు ఫోర్జరీ, నకిలీ రబ్బర్‌స్టాంప్‌లు వేస్తారు. వీటి సహాయంతో క్లయింట్ వెళ్లాల్సిన దేశం వీసా కోసం దరఖాస్తు చేస్తారు. పాస్‌పోర్ట్‌పై ఇప్పటికే విదేశాలకు వెళ్లి వచ్చినట్టు స్టాంపులు ఉండటంతో వీసా సులభంగా వచ్చేస్తుంది. ఆ వీసాపై విదేశాలకు వెళ్లే క్లయింట్లు అనుమానం రాకుండా అసలు పాస్‌పోర్ట్‌తో వెళ్తుంటారు. ఈ ముఠా ముందుగా ఒరిజినల్ పాస్‌పోర్ట్‌ను, రూ.40 వేల వరకు అడ్వాన్స్‌గా తీసుకుంటారు. వీసా వచ్చిన తర్వాత రూ.4 లక్షల వరకు వసూలు చేస్తారు. ఈ నకిలీ వీసాలతో విదేశాలకు వెళ్లి అరెస్టయినవారు, ఇండియాకు డిపోర్ట్ అయినవారు ఉన్నారు. అంతర్జాతీయస్థాయిలో సాగుతున్న దందాపై పక్కా సమాచారంతో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కే నాగేశ్వర్‌రావు బృందం సైదాబాద్, గోల్కొండలో దాడులు చేసి, ఐదుగురు సభ్యులను పట్టుకున్నారు. ముఠాను పట్టుకున్న డీసీపీ రాధాకిషన్‌రావు, సిబ్బందిని సీపీ అభినందించారు.

928
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles