చిన్న నిర్లక్ష్యం పెద్ద శాపం!


Tue,April 16, 2019 02:19 AM

passbook is the non recover Rythu Bhima

-పాస్‌బుక్ ఉన్నా దక్కని రైతుబీమా
-పెద్ద దిక్కు కోల్పోయి వీధినపడిన రైతు కుటుంబం
-ఎకరం 20 గుంటల భూమికి ఆసామి
-పాత పాస్‌పుస్తకంలో నమోదైంది 16 గుంటలే
-కొత్త రికార్డుల్లో మూడు గుంటలకు తగ్గిన భూమి
-సరిచేయాలంటూ పాస్‌బుక్కు, రైతుబంధు చెక్ వాపస్
-మొరపెట్టుకున్నా పట్టించుకోని అధికారులు
-ఈలోపే అనారోగ్యంతో రైతు అకాల మృతి
-ఆధార్ లేదని రైతుబీమా ఇవ్వని అధికారులు
-భూమి లెక్క తేలలేదు.. బీమా సొమ్ము అందలేదు
-దిక్కెవరని రోదిస్తున్న రైతు కుటుంబీకులు

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ:చనిపోయిన రైతుకు గుంట భూమి ఉన్నా రైతుబీమా వర్తింజేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అనేక సందర్భాల్లో స్పష్టంచేసినా.. నిబంధనల ముసుగులో ఒక రైతు కుటుంబానికి అన్యాయం జరిగింది. బాధిత కుటుంబానికి అండగా నిలువాలన్న ఆశయంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం.. ఆ కుటుంబానికి దక్కలేదు. పెద్ద దిక్కుకోల్పోయిన ఆ కుటుంబం.. నిత్యం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. ఊరట మాత్రం లభించడంలేదు. అధికారులు మాత్రం తమ పరిధిలో తాము పనిచేశామని చెప్తున్నారు. వారసత్వంగా వచ్చిన భూమిని రికార్డుల్లో నమోదుచేసే క్రమంలో దొర్లిన పొరపాట్లు.. వాటిని సవరించే విషయంలో నిరాసక్తత.. వెరసి.. ఆ రైతుకుటుంబాన్ని వీధినపడేశాయి. రికార్డుల్లో లోపాలు సరిదిద్దాలని అనేకసార్లు మొత్తుకున్నా చర్యలుతీసుకోకపోవడం వల్లే తమకు నష్టంవాటిల్లిందని బాధితులు వాపోతున్నారు.

రికార్డుల్లో తప్పిదాలతో సమస్య మొదలు

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బావోజీగూడెంలో ఎనమాల మల్లయ్య అనే రైతుకు ఒక ఎకరం ఇరువై గుంటల వ్యవసాయ భూమి ఉన్నది. ఇందులో 380/ఏ/3 సర్వే నంబర్‌లో 17 గుంటలు, 223/ఏ/4/3 సర్వే నంబర్‌లో 17 గుంటల అసైన్డ్‌భూమి ఉన్నాయి. ఇదికాకుండా 362/ఏ సర్వే నంబర్‌లో 16 గుంటలు, 379లో మరో 10 గుంటల భూమి కలుపుకొంటే మొత్తంగా మల్లయ్యకు ఎకరం ఇరవై గుంటల భూమి ఉన్నది. తెలంగాణ సర్కార్ ఈ మధ్య ఇచ్చిన పాస్‌పుస్తకాల కన్నా ముందున్న పాత పాస్‌బుక్‌లో 362/ఏలో ఉన్న 16 గుంటల భూమి మాత్రమే నమోదై ఉన్నది. ఈ విషయమై రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్న మల్లయ్య.. మిగిలిన 1.04 ఎకరాల భూమిని పాస్‌బుక్‌లో నమోదుచేయాలని విన్నవించుకున్నారు.

ఈ క్రమంలోనే రాష్ట్ర సర్కార్ 2017 సెప్టెంబరు 15 నుంచి భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రారంభించడంతో మల్లయ్యకు సంబంధించిన 223/ఏ/4/3 సర్వే నంబర్‌లో 17 గుంటల భూమికి బదులు మూడుగుంటల భూమి మాత్రమే పాస్‌బుక్ (టీ25120030685)లో ఎంటరైంది. దీంతో ఆయనకు రైతుబంధు కిందట రూ.300 చెక్కు వచ్చింది. 2018 మే 10 నుంచి కొత్త పాస్‌పుస్తకాలతోపాటు రైతుబంధు చెక్కులను అధికారులు గ్రామాల్లో పంపిణీచేశారు. ఈ సందర్భంగా మల్లయ్య తనకు వచ్చిన పాస్‌బుక్‌ను చూసుకొని తప్పుదొర్లిందని చెప్పి, పాస్‌బుక్, రైతుబంధు చెక్‌ను రెవెన్యూ అధికారులకు తిరిగి అప్పగించారు. అప్పటి నుంచి సరిచేస్తామని చెప్పిన రెవెన్యూ అధికారులు ఇప్పటివరకు చేయలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

పాస్‌బుక్ రాకతో రైతుబీమాకు అర్హత

మల్లయ్యకు ఎప్పుడైతే పాస్‌బుక్ నంబర్ (టీ25120030685) వచ్చిందో అప్పుడే ఆయన రైతుబీమాకు అర్హత కలిగి ఉన్నారు. ఈ క్రమంలోనే మరిపెడ మండల వ్యవసాయ అధికారులు మల్లయ్య, ఆయన నామినీ ఆధార్ నంబర్లకోసం ఆయన ఇంటికి వెళ్లామని చెప్తున్నారు. అయితే ఇక్కడ పూటగడిచే పరిస్థితి లేని మల్లయ్య.. తన కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌లో కూలిపనులు చేసుకుంటూ జీవిస్తుండటంతో రైతుబీమాకు సంబంధించి అప్‌లోడ్ కార్యక్రమం ఆగిపోయింది. ఇదిలావుంటే.. అనారోగ్యానికి గురైన మల్లయ్య 2019 జనవరి 3న మరణించారు. అప్పటినుంచి రైతుబీమా కోసం రైతు భార్య వెంకటనర్సమ్మతోపాటు అతడి కుమారుడు సురేశ్, కూతురు సుజాత మరిపెడ తహసీల్దార్, మండల వ్యవసాయశాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే రెడ్యానాయక్ వద్దకు వెళ్లి విషయాన్ని వివరించారు. రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడినా ప్రయోజనం లేకుండాపోయింది.
land

రెండు శాఖల నిర్లక్ష్యం

రెవెన్యూ అధికారులు రైతుకు ఉండాల్సిన భూమి మొత్తాన్ని పాస్‌పుస్తకంలో ఎంటర్ చేయకుండా తప్పుచేయగా, వ్యవసాయ అధికారులు రైతుకు సంబంధించిన బీమా ఫారాన్ని ఎంటర్ చేయకుండా నిర్లక్ష్యం వహించారు. మొత్తం మీద రెండుశాఖల తప్పులు, నిర్లక్ష్యాలు మల్లయ్య కుటుంబానికి శాపంగా మారాయి. వ్యవసాయ అధికారులు ఆన్లైన్‌లో బీమా వివరాలు నమోదుచేస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షలు వచ్చేవి. సోమవారం కూడా రైతు భార్య వెంకటనర్సమ్మ, కుమారుడు సురేశ్ మరిపెడ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. తమ దీన స్థితిని వెళ్లబోసుకున్నారు.

అధికారులెవ్వరూ సహకరించలే..

అధికారులెవ్వరూ సహకరించలే. బతుకుదెరువుకోసం హైదరాబాద్‌లో పెద్దోళ్ల ఇండ్లలో పాచిపనులు, చిన్న చిన్న కూలిపనులు చేసుకోని బతుకుతున్నం. అనారోగ్యంతో నా భర్త చనిపోయి మూడున్నర నెలలు అవుతున్నది. ముగ్గురు బిడ్డలు, ఓ కొడుకు ఉన్నారు. బావోజీగూడెంలో మాకు ఏండ్ల తరబడి వారసత్వంగా వచ్చిన 1.20 ఎకరాల భూమి ఉన్నది. ఇందులో 16 గుంటలు అసైన్డ్ భూమి కూడా ఉన్నది. సీఎం సారు భూరికార్డుల ప్రక్షాళన చేపట్టినప్పుడు మా పేర పట్టాచేయాలని దరఖాస్తు పెట్టుకున్నం. అధికారులెవ్వరూ మమ్ములను పట్టించుకోలే. అది అట్టపోగా ప్రభుత్వం ఎనకట ఇచ్చిన ఆ అసైన్డ్ భూమి 16 గుంటలకు మాకు ఇది వరకే పాస్‌బుక్ ఉన్నది. అదైనా మొత్తం చేయకుండా కేవలం మూడు గుంటలకే కొత్త పాస్‌పుస్తకం వచ్చింది. 16 గుంటలకు మూడు గుంటలు ఎట్ల చేస్తారని చెప్పి ఆ బుక్ తీసుకోలే. డబ్బులు తీసుకోలే. అప్పట్నించి ఏ అధికారి మా వద్దకు రాలే. రైతుబీమా కోసం పైనుంచి ఎవరైనా అధికారులు వస్తే ఆధార్‌కార్డు, ఫొటోలు, బ్యాంక్ పుస్తకం ఇవ్వమని మా తోటికోడలుకు ఇచ్చి ఉంటిమి. వాళ్లను ఎవ్వరూ అడగలే. ఇంతలోనే మా ఆయన చచ్చిపోయిండు. అధికారుల వల్ల మాకు తీరని అన్యాయం జరిగింది. మా కుటుంబానికి రావాల్సిన రూ.5 లక్షలు రాలే. మాకు ఇక దేవుడే దిక్కు.
- ఎనమాల వెంకటనర్సమ్మ, రైతు భార్య
PassBook

రైతు ఈకేవైసీ చేయలే

బావోజీగూడేనికి చెందిన రైతు మల్లయ్యకు 1.20 ఎకరాల సాగుభూమి ఉంది. క్యాటగిరీ-2 కావడంతో ఎల్‌ఆర్‌యూపీకి ముందు ధరణి వైబ్‌సైట్ డాటా ఆపరేట్‌కు కొందరి రైతుల ఫొటోలు జనరేట్ అయ్యాయి. మరికొందరి ఫొటోలు కాలేదు. దీంతో మల్లయ్య ఈకేవైసీ చేతి ముద్రలను వేయలే. అందువల్ల ఆయనకు పట్టాపుస్తకం జనరేట్ కాలేదు. అయినప్పటికీ పాస్ పుస్తకం అలాట్ నంబరు వచ్చింది. ఇంతలో ఆయన చనిపోయారు.
- వెంకటేశ్వర్లు, మరిపెడ తహసీల్దార్

నాలుగుసార్లు రైతు ఇంటికి వెళ్లాను

రైతు మల్లయ్య ఇంటికి నాలుగైదుమార్లు వెళ్లాను. ఎప్పుడూ ఇంటికి తాళంవేసి ఉండేది. చుట్టుపక్కల వారిని అడిగితే హైదరాబాద్‌లో ఉంటున్నారని చెప్పారు. మల్లయ్య ఫోన్ నంబర్ కోసం అడిగితే ఆ ఊళ్లో ఎవరూ తెలియదన్నారు. మల్లయ్యతోపాటు అతడి భార్య ఆధార్ నంబర్ ఇవ్వనిదే రైతుబీమా ఎంటర్ కాదు. కనీసం రైతు అనారోగ్యంగా ఉన్నప్పుడైనా మావద్దకు వచ్చి చెప్తే ఎంటర్‌చేసేవాళ్లం. మల్లయ్య చనిపోయిన తరువాత వారి కుటుంబసభ్యులు మా కార్యాలయానికి వచ్చారు. రైతు మరణించిన తరువాత మేము బీమా ఎంటర్ చేయడం సాధ్యంకాదు. ఇప్పటికీ రైతుబీమా కోసం దరఖాస్తు చేసుకోని రైతులు చాలామంది ఉన్నారు. వారంతా వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.
- రేష్మా కౌసర్, నీలికుర్తి వ్యవసాయ విస్తరణ అధికారి

5107
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles