రాజధాని చుట్టూ పార్కులు


Sun,August 13, 2017 06:21 AM

Parks around the capital

అవసరమైతే వంద కోట్లు కేటాయింపు: మంత్రి జోగు రామన్న

ramannaహైదరాబాద్, నమస్తే తెలంగాణ: హైదరాబాద్ నగరం చుట్టూ ఏర్పాటుచేసిన పలు అర్బన్ పార్కులకు మంచి ఆదరణ లభిస్తున్నదని అటవీ, పర్యావరణశాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. హైదరాబాద్ చుట్టూ 99 పార్కులను అభివృద్ధి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అవసరమైతే ఈ పార్కుల కోసం వంద కోట్ల రూపాయలను వెచ్చిస్తామని తెలిపారు. హైదరాబాద్ చుట్టూ పచ్చదనాన్ని పెంచి.. ఆహ్లాదకరంగా మార్చాలన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు మంత్రి జోగురామన్న, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు తదితరులు శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అర్బన్ పార్కుల్లో విస్తృతంగా పర్యటించారు. మన్సూరాబాద్, మేడిపల్లి, భాగ్యనగర్ నందనవనం, వనస్థలిపురంలోని హరిణ వనస్థలి జాతీయ పార్కులను సందర్శించారు. పార్కు ల్లో ఏర్పాటు చేసిన వాక్ వేలు, సైకిల్ ట్రాక్‌లు, జారుడుబండలు, పిల్లల ఆటస్థలాలను పరిశీలించి స్థానిక ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. మంత్రి కే తారకరామారావు కూడా అర్బన్ పార్కుల అభివృద్ధిపై ఆసక్తిగా ఉన్నారని.. త్వరలో ఆయన స్వయంగా పర్యటిస్తారని జోగురామన్న వెల్లడించారు. అనంతరం నారపల్లి, మేడిపల్లిలోని నందనవనం పార్కులను సందర్శించారు.

ఎల్బీనగర్‌లో మేయర్ పర్యటన:

ఎల్బీనగర్ ప్రాంతంలో శనివారం మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్, బాబా ఫసియుద్దీన్, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్లు జనార్దన్‌రెడ్డి, చిరంజీవులుతో కలిసి పర్యటించారు. నాగోలు జంక్షన్ సమీపంలోని పెట్రోల్ బంక్ రహదారిని, పీఎమ్మార్ ఫంక్షన్ హాలు మీదుగా ఉన్న ప్రస్తుత రహదారిని విస్తరించాలని అధికారులకు మేయర్ సూచించారు. అనంతరం కామినేని జంక్షన్ వద్ద ైఫ్లెవర్ పనులను పరిశీలించారు. ఎల్బీనగర్ జాతీయ రహదారి కోర్టు కార్యాలయం నుంచి మన్సూరాబాద్ మీదుగా వెళ్లే రోడ్డు మార్గంలో కామినేని జంక్షన్ వద్ద అండర్‌పాస్‌ను నిర్మించాలని సీఎం చేసిన ప్రతిపాదనను పరిశీలించారు. ఈ మార్గాల్లో అండర్‌పాస్ నిర్మాణం వల్ల ఎల్బీ నగర్ నుంచి వనస్థలిపురం వరకు ట్రాఫిక్ సులువుగా వెళ్తుందన్నారు. ఫలితంగా జాతీయ రహదారిపై ఒత్తిడి తగ్గుతుందని మేయర్ అన్నారు.

1956
Tags

More News

VIRAL NEWS