రైతును రాజును చేస్తాం

Sat,December 14, 2019 03:26 AM

- సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
- రైతుకు గిట్టుబాటు ధర అందేలా కృషి
- ధాన్యం నిల్వకు గిడ్డంగుల సౌకర్యం
- స్థానిక అవసరాల మేరకు పంటకాలనీల ఏర్పాటు: పల్లా రాజేశ్వర్‌రెడ్డి
- రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ
- అభినందించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీనేతలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కళాశాలలు నిర్వహించే తనను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో నమ్మకంతో రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా నియమించారని.. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ రైతును రాజుగా చేసేందుకు కృషిచేస్తానని పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు తీసుకుంటామని.. రైతులకు, ప్రభుత్వానికి మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తానని తెలిపారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా పల్లా రాజేశ్వర్‌రెడ్డి శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు.. పల్లాను చైర్మన్ సీట్లో కూర్చోబెట్టారు. అనంతరం తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికోసం ఒక ఇంజినీర్‌లా సీఎం కేసీఆర్.. ప్రజలకు అవసరమైన వివిధ పథకాలను రూపొందించి సత్ఫలితాలు సాధిస్తున్నారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో దెబ్బతిన్న వ్యవసాయరంగాన్ని గాడిలో పెట్టేందుకు చెరువుల పునరుద్ధరణ, ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలను అమలుచేశారని చెప్పారు. రైతుల సమస్యల పరిష్కారానికి ఒక సమగ్రమైన వ్యవస్థ కావాలని భావించి రైతు సమన్వయ సమితిని ఏర్పాటుచేశారని పేర్కొన్నారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరినప్పటి నుంచి పార్టీ కోసం అప్పగించిన ప్రతీ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించారని కొనియాడారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ఇంచార్జిగా టీఆర్‌ఎస్‌ను గెలిపించడంలో కీలకపాత్ర వహించిన పల్లా.. రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా కూడా విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. రైతుకు న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా అందరికీ ఆదర్శంగా నిలిచారని మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. పార్టీ కార్యక్రమాల్లో సమర్థత చూపిన విధంగానే.. రైతు సమన్వయ సమితి చైర్మన్‌గానూ రైతుల సమస్యలు పరిష్కరిస్తారన్న నమ్మకముందన్నారు.
Palla-Rajeshwar-Reddy1

రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం

రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా తనను నియమించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ పదవికి నా పేరును ప్రతిపాదించినప్పుడు.. కాలేజీలు నడుపుకొనే ఆయనకు వ్యవసాయం గురించి ఏమి తెలుసని పలువురు సీఎం వద్ద అనుమానాలు వ్యక్తంచేశారు.. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినోడు రాజేశ్వర్‌రెడ్డి.. వానకాలమేదో, యాసంగి ఏదో తెలుసుకొని పంటలు పండించిన అనుభవం ఉన్నది. ఏ పనిచెప్పినా ఎందుకని అడుగకుండా చేసుకుంటూ పోతుండు.. అలాంటోడికి రైతు సమన్వయ సమితి బాధ్యతలు అప్పగిస్తే సమర్ధంగా పనిచేస్తడు అంటూ సీఎం కేసీఆర్ ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా అని పల్లా అన్నారు. రైతును రాజుగా చేయాలనేది కేసీఆర్ సంకల్పమని తెలిపారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే ఉద్దేశంతోనే ప్రజల ఆహార అవసరాలు ఏమిటి? ఏ పంట పండించాలి? ఎక్కడ అమ్ముకోవాలి? ఏ ప్రాంతంలో ఏ పంటలు పండుతాయి? అనే అంశాలపై వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా సీఎం కేసీఆర్ సర్వే నిర్వహించి.. అందుకు అనుగుణంగా పంటకాలనీలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారని చెప్పారు. గ్రామస్థాయిలో 15 మంది, జిల్లాస్థాయిలో 24 మంది చొప్పున రైతు సమన్వయ సమితి సభ్యులున్నారని.. వీరందరితో సీఎం కేసీఆర్ త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి విధులు, బాధ్యతలపై స్పష్టమైన ఆదేశాలు జారీచేస్తారని తెలిపారు.
Palla-Rajeshwar-Reddy2
రాష్ట్రంలో ఏయే పంటలు.. ఏయే ప్రాంతాల్లో పండించాలో నిర్ధారించే విధంగా రైతుసమన్వయ సమితి కృషిచేస్తుందని వివరించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడానికి అవసరమైన మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటుచేసేలా పనిచేస్తుందన్నారు. పంటకు గిట్టుబాటు ధర రాకుంటే.. ఆ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి వీలుగా 25 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గిడ్డంగులను ఏర్పాటుచేసుకున్నట్టు చెప్పారు. అప్పటికీ గిట్టుబాటు ధర రాకుంటే.. వాటి ప్రాసెసింగ్ కోసం ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పడంపై సీఎం కేసీఆర్ ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేశారని తెలిపారు. ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లతో వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించి రైతుల ఆదాయాలను రెట్టింపు చేసేలా కృషిచేస్తామని పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన పల్లా రాజేశ్వర్‌రెడ్డిని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైస్‌చైర్మన్ నేతి విద్యాసాగర్, మంత్రులు మహమూద్ అలీ, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, అల్లోళ్ల ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, వీ శ్రీనివాస్‌గౌడ్, చామకూర మల్లారెడ్డి, టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, టీఆర్‌ఎస్ నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, వివిధ శాఖల అధికారులు, ఇంజినీరింగ్ కళాశాలల యాజమన్య ప్రతినిధులు అభినందించారు.
Palla-Rajeshwar-Reddy3

1552
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles