రిజర్వేషన్లతోనే మహిళలకు న్యాయం


Fri,March 9, 2018 03:29 AM

Padma Devender Reddy Participates Womens Day Celebrations

-చట్టసభల్లో మహిళల సంఖ్య పెరుగాలి: డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి
-త్వరలో రాష్ట్రంలో మహిళా విశ్వవిద్యాలయం :మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి తుమ్మల
-పోలీసుశాఖలో 33% రిజర్వేషన్లు అమలు: హోంమంత్రి నాయిని

awards
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లు అమలు చేసినప్పుడే మహిళలకు అన్నిరంగాల్లో సంపూర్ణన్యాయం జరుగుతుందని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మహిళలకు రాజకీయాల్లో అవకాశాలు పెరుగాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. చట్టసభల్లోకి మహిళలు అధికసంఖ్యలో రావాలని.. అప్పుడే మహిళల సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని లలితాకళాతోరణంలో మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ, సాంస్కృతికశాఖల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 17 రంగాల్లో విశేషప్రతిభ కనబర్చిన 20 మంది మహిళామూర్తులకు మహిళా విశిష్ట పురస్కారాలతో సత్కరించారు. ఈ అవార్డు కింద లక్ష రూపాయల చెక్కు, ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేశారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం రాజకీయాల్లో మహిళలు స్వతంత్రంగా అవకాశాలు దక్కించుకునే పరిస్థితులు లేవని, వచ్చిన కొద్దిమంది కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మొదటి శాసనసభా సమావేశాల్లోనే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని డిప్యూటీస్పీకర్ గుర్తు చేశారు.

కేంద్రప్రభుత్వం తక్షణమే 33 శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని కోరారు. ఆడపిల్ల పుడితే సంరక్షణ బాధ్యతను తీసుకునేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ముందుకు వచ్చిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమరంగాలకు అధిక ప్రాధాన్యమిస్తూ ఆరోగ్యలక్ష్మి, ఉచితవిద్య, అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటు, పౌష్టికాహారం, కళ్యాణలక్ష్మీ పథకాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. మహిళల ప్రతిభ చాలా గొప్పదని.. మహిళలు పాటిస్తున్న ఆర్థిక క్రమశిక్షణ నేడు రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ రూపకల్పనకు స్పూర్తిగా నిలుస్తున్నదని అన్నారు.

మహిళల కష్టాలు తీర్చేందుకే మిషన్ భగీరథ


ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పాలనలో రాష్ట్రంలోని మహిళలు సుఖసంతోషాలతో జీవిస్తున్నారని, మహిళలను ప్రభుత్వం అన్నిరంగాల్లో ప్రోత్సహిస్తున్నదని మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చెప్పారు. బాలికల విద్య కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేశామని, త్వరలోనే హైదరాబాద్‌లో ప్రత్యేకంగా మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు అవకాశాలు కల్పించేందుకు ఐటీశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వీ-హబ్‌కు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. మహిళలు అనాదికాలం నుంచి ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టారని, ఈ ఏడాది చివరినాటికి ఇంటింటికి నల్లా ద్వారా కృష్ణా, గోదావరి జలాలు అందించనున్నట్టు చెప్పారు.

సంపూర్ణ భద్రతకు చర్యలు


హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలు, బాలికల భద్రతకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్టు చెప్పారు. షీటీమ్స్, భరోసా, సఖి కేంద్రాల ఏర్పాటుతో మహిళలు పూర్తిస్థాయి భద్రతతో స్వేచ్ఛగా జీవిస్తున్నారని తెలిపారు. పోలీసు శాఖలో 33శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నామ ని, తాజాగా 735 మంది మహిళా కానిస్టేబుళ్లు శిక్షణ పూర్తిచేసుకొని విధుల్లో చేరారని వివరించారు. హైదరాబాద్ నగరంలో 200 షీటీమ్స్ పనిచేస్తున్నాయని అన్నారు. ఆడపిల్లలను బాగా చదివించాలని.. తద్వా రా కుటుంబం రాణిస్తుందని పేర్కొన్నారు. మహిళా కార్పొరేషన్ చైర్మన్ గుండు సుధారాణి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో మహిళలకు అవకాశాలు పెరిగాయన్నారు. బాలికలు, మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్య సమాజం ఆవిష్కృతం అవుతుందని కరీంనగర్ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ అన్నారు. ఈ విషయాన్ని గుర్తించి సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని మహిళలు, శిశువుల ఆరోగ్యంపట్ల ప్రత్యేకశ్రద్ధ చూపిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలోనే మహిళలు, శిశువుల ఆరో గ్యం, భద్రతకు అధిక ప్రాధాన్యం కల్పిస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
AWARD
అవార్డులు పొందిన మహిళామణులను మంత్రులు, డిప్యూటీ స్పీకర్ ప్రత్యేకంగా అభినందించారు. అవార్డులను అందుకున్నవారిలో నమస్తే తెలంగాణకు చెందిన మహిళాజర్నలిస్టు సౌమ్య నాగపురి ఉన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణాచారి, దేశపతి శ్రీనివాస్, సాంస్కృతిక సారథి చైర్మ న్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మహిళాసంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఎం జగదీశ్, డైరెక్టర్ విజయేంద్రబోయి, సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, మహిళా కార్పొరేషన్ డైరెక్టర్ నిర్మల, రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్ పీ సునీతా మహేందర్‌రెడ్డి, ఖమ్మం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ కవిత, వరంగల్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జీ పద్మ, బీసీ కార్పొరేషన్ చైర్మన్ బీఎస్ రాములు, నగర మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

1316
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles