విషజ్వరాలకు సెలవుల్లోనూ చికిత్స


Mon,August 26, 2019 01:15 AM

Outpatient care at State run hospitals on Sundays

-పలు దవాఖానల్లో ఆదివారం కూడా ఓపీ సేవలు
-ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్న వైద్యారోగ్యశాఖ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో విషజ్వరాలకు గురైనవారికి తక్షణం వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వ దవాఖానల్లో సెలవురోజుల్లో కూడా వైద్యులు తమ సేవలను అందిస్తున్నారు. ముందస్తు చర్యలతో సీజనల్ వ్యాధులను అడ్డుకొనేందుకు వైద్యారోగ్యశాఖ ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్నది. సీజనల్ వ్యాధులు, విషజ్వరాలు విస్తరిస్తుండటంతో రాష్ట్రంలోని అన్ని దవాఖానల్లో, బోధనాహాస్పిటళ్లలో ఆదివారం, ఇతర సెలవుదినాల్లోనూ వైద్యులను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బోధన దవాఖానలతోపాటు హైదరాబాద్‌లోని ఫీవర్ హాస్పిటల్, ఈఎన్టీ, నీలోఫర్, ఇతర దవాఖానల్లో ఓపీ, డయాగ్నోసిస్ సేవలు అందించేందుకు వైద్యులు ముందుకొచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్నవారికి అరోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక వైద్యసేవలు అందిస్తున్నది. అన్ని శాఖలు సమన్వయంతో దోమల నిర్మూలన, రక్షిత తాగునీరు అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని 1,697 గ్రామాలను హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించారు.

ఈ ప్రాంతాల్లో మలేరియా, డెంగ్యూ, డయేరియా, కామెర్లు, టైఫాయిడ్, చికెన్‌గున్యా వంటి వ్యాధుల నియంత్రణ, నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. వ్యాధికారకాలను నియంత్రించేందుకు జిల్లాస్థాయిలో ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని ఐటీడీఏ, గిరిజన ప్రాంతాల్లోని పీహెచ్‌సీలు, పారా మెడికల్ సిబ్బంది వద్ద తగిన మందులు అందుబాటులో ఉంచారు. మలేరియా వ్యాధి ప్రభావం ప్రధానంగా ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్ జిల్లాల్లో ఉంటుందని గుర్తించారు. హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్ అర్బన్, మేడ్చల్ జిల్లాల పరిధిలో డెంగ్యూ, మలేరియా జ్వరాలు ప్రబలకుండా వైద్యశాఖ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు.

255
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles