ప్రతిపక్షాలు దివాలా

Mon,September 3, 2018 07:10 AM

-ఎన్నికలంటే ఎందుకంత భయం?
-ప్రజల వద్దకెళ్లే ధైర్యం ప్రతిపక్షాలకు లేదు
-అందుకే కోర్టును ఆశ్రయిస్తామంటున్నారు
-ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీఆర్‌ఎస్ సిద్ధం
- రాష్ర్టానికి మళ్లీ కేసీఆరే సీఎం: మంత్రి కే తారక రామారావు
-కంటిపై కునుకు లేకుండా..
-అంతా తానై శ్రమించిన మంత్రి కేటీఆర్
-ప్రగతి నివేదన సభ నిర్వహణలో కీలకపాత్ర
-ప్రతిరోజూ అర్ధరాత్రి వరకు సభాప్రాంగణంలోనే
-చాలా తక్కువ సమయంలోనే విస్తృత ఏర్పాట్లు
-ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు
-సభ విజయవంతంతో వెల్లువెత్తిన అభినందనలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రగతి నివేదన సభ విజయవంతం కావడంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కీలకంగా వ్యవహరించారు. ఈ సభకు అంకురార్పణ జరిగింది మొదలు ఆదివారం సభ పూర్తయ్యేవరకు మంత్రి కేటీఆర్ కంటిపై కునుకు లేదంటే అతిశయోక్తి కాదు. ఈ ఏడాది చివర హైదరాబాద్‌లో భారీసభను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఏప్రిల్ 27న కొంపల్లిలో టీఆర్‌ఎస్ ప్లీనరీ సందర్భంగానే ప్రకటించిన విషయం విదితమే. అయితే ఈ సభ ఎప్పుడు జరుగుతుందన్న దానిపై పార్టీలోని చాలామంది పార్టీ కార్యకర్తలకే కాకుండా నాయకులకు కూడా స్పష్టతలేదు. గత నెలలో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గం, శాసనసభాపక్షం, మంత్రివర్గ సమావేశాల్లో దీని గురించి చర్చ జరిగినప్పుడు సభ నిర్వహణకు సమయం సరిపోతుందా అన్న అనుమానం చాలామందిలో వ్యక్తమైంది. అయితే అనుకున్నట్టుగానే ఈ సభను ఎలాగైనా నిర్వహించి తీరాల్సిందేనని సీఎం కేసీఆర్ పేర్కొంటూ.. దీని నిర్వహణ బాధ్యతలను మంత్రి కేటీఆర్, మహేందర్‌రెడ్డి తదితరులకు ఇస్తున్నట్టు స్పష్టంచేశారు. దీన్ని సవాలుగా తీసుకున్న కేటీఆర్.. సభను విజయవంతం చేసేందుకు అహర్నిశలూ శ్రమించారు.

ktr4
ప్రతీ రోజు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సభాప్రాంగణంలోనే ఉన్నారు. సీఎం కేసీఆర్ సూచనలకు అనుగుణంగా సభావేదికను నిర్ణీత సమయానికంటే ముందే సిద్ధంచేశారు. వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. కొత్త రోడ్ల నిర్మాణంతోపాటు మైకులు, లైట్ల ఏర్పాటు లాంటి పనులను యుద్ధప్రాతిపదికన చేయించారు. సభను విజయవంతంగా నిర్వహించేందుకు వివిధ కమిటీలను ఏర్పాటుచేసి పనివిభజన చేశారు. ఆ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు దూరప్రాంతాల నుంచి జనసమీకరణ చేస్తున్నవారికి తగిన సూచనలు ఇచ్చారు. సభకు వచ్చేవారికి మంచినీరు, భోజన ఏర్పాట్లు చేయడంతోపాటు వాహనాల పార్కింగ్‌లో ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా చూశారు. దీంతో దేశంలోనే అతిపెద్ద సభగా రికార్డులకెక్కిన కొంగరకలాన్ సభ దిగ్విజయంగా జరిగింది. ఆదివారం ఈ సభకు వచ్చినవారంతా కేటీఆర్‌కు అభినందనలు తెలుపగా.. ఈ సభను విజయవంతం చేయడంలో సహకరించినవారందరికీ కేటీఆర్ ధన్యవాదాలు చెప్పడం కనిపించింది.

ktr6

డోలు వాయించిన కేటీఆర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారక రామారావు ప్రగతి నివేదన సభలో హుషారుగా కనిపించారు. ఆదివారం ఉదయం ఆయన కళాకారులతో కలిసి డోలు వాయించారు. డోలు ఎలా వాయించాలో రాష్ట్ర సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ వివరించారు. కేటీఆర్ డోలు వాయిస్తూ, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతూ స్టెప్పులేశారు. కార్యకర్తలంతా కేటీఆర్‌ను తమ భుజాలపైకి ఎత్తుకుని కేరింతలు కొట్టారు. సభాప్రాంగణంలో మహిళా కార్యకర్తలను ఆప్యాయంగా పలుకరించారు. ఐదారు రోజుల నుంచి ప్రగతి నివేదనసభ ఏర్పాట్లను కేటీఆర్ దగ్గరుండి చూసుకుంటున్నారు. కార్యకర్తలను సమన్వయపరుస్తూ సభకు ఎలాంటి ఆటంకం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ktr9

కార్యకర్తల క్రమశిక్షణ

ప్రగతి నివేదన సభకు భారీగా తరలివచ్చిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు ఎంతో క్రమశిక్షణతో, సమన్వయంతో వ్యవహరించారు. ప్రతి కార్యకర్త వలంటీర్‌గా మారి.. వచ్చిన వారందరికీ చిరునవ్వుతో మంచినీటిని అందించారు. వాహనాలను నిర్దేశిత ప్రదేశంలో పార్కింగ్ చేసేలా చూశారు. ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి వృద్ధులు, మహిళలు త్వరగా వేదిక వద్దకు చేరుకునేలా సాయాన్ని అందించారు. సభకు హాజరైనవారు కూడా క్రమశిక్షణతో వ్యవహరించారు. సాధారణంగా వేల మంది ఒకచోట గుమిగూడితేనే ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ 25 లక్షలమంది వచ్చిన ఈ సభ ఎటువంటి సమస్యలు లేకుండా దిగ్విజయంగా పూర్తికావడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం.

ktr2

ఎన్నికలంటే ఎందుకంత భయం?

-ప్రజల వద్దకెళ్లే ధైర్యం ప్రతిపక్షాలకు లేదు
-అందుకే కోర్టును ఆశ్రయిస్తామంటున్నారు
-ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీఆర్‌ఎస్ సిద్ధం-రాష్ర్టానికి మళ్లీ కేసీఆరే సీఎం
-మంత్రి కే తారకరామారావు

ప్రజల వద్దకు వెళ్లే ధైర్యం ప్రతిపక్షాలకు లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్‌ఎస్ సిద్ధంగా ఉంటుదని, ప్రజల వద్దకు వెళ్లేందుకు ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయో అర్థంకావడంలేదన్నారు. కొంగరకలాన్‌లో ఆదివారం ప్రగతి నివేదన సభ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలను ఆపేందుకు కోర్టుకెళ్తానని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి చెప్పడం ఆ పార్టీ దివాలాకోరుతనాన్ని, ఎన్నికల పట్ల కాంగ్రెస్ నాయకులకున్న భయాన్ని స్పష్టం చేస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ చెప్తున్నట్టుగా ప్రజలు వారివైపే ఉంటే ఎన్నికలను ఆపాలని కోరడం ఎందుకని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. ప్రజలకు ఏమిచెప్పాలో కాంగ్రెస్ నాయకులకు అర్థంకావడంలేదని, టీఆర్‌ఎస్‌ను విమర్శించేందుకు కారణాలు లేకపోవడం వల్లనే చిల్లరమల్లర విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ktr7
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు టీఆర్‌ఎస్ వైపే ఉన్నారని, ప్రజలే తమకు బాస్‌లని, వారికే జవాబుదారీగా ఉంటామని కేటీఆర్ స్పష్టంచేస్తూ.. కాంగ్రెస్ పార్టీకి మరోసారి బుద్ధిచెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను సమీక్షించేందుకే ఆదివారం తాను, మహేందర్‌రెడ్డి క్యాబినెట్ మీటింగ్‌కు వెళ్లలేదన్నారు. ఈ సభ విజయవంతం కావడానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. దేశంలో మరెవరికీ సాధ్యంకాని విధంగా అతితక్కువ సమయంలో భారీ సభను విజయవంతం చేశారని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీఆర్‌ఎస్సే అధికారంలోకి వస్తుందని, మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారన్న విషయం ప్రధాని నరేంద్రమోదీతోపాటు ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీకి కూడా తెలుసని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

ktr5

కేటీఆర్, కవితల సెల్ఫీల సందడి

కార్యకర్తలను ఆప్యాయంగా పలుకరించిన మంత్రి, ఎంపీ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కొంగరకలాన్ టీఆర్‌ఎస్ ప్రగతి నివేదన సభ వేదికవద్ద ఆదివారం రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారక రామారావు, నిజామాబాద్ ఎంపీ కవిత సెల్ఫీలతో సందడిచేశారు. తన సోదరుడు కేటీఆర్‌తో కవిత సెల్ఫీ దిగారు. కేటీఆర్‌తోపాటు ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, జీవన్‌రెడ్డి కూడా సెల్ఫీలకు పోజులిచ్చారు. సభాప్రాంగణంలో మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత కలియదిరుగుతూ.. సభకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలుకరించారు. పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.

ktr3

సభ నిర్వహణలో కమిటీలు సక్సెస్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రగతి నివేదన సభ విజయవంతంలో కీలకపాత్ర పోషించిన కమిటీలను, పార్టీ నాయకులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు సభ ముగిసిన అనంతరం అభినందించారు. సభ విజయవంతానికి మొత్తం ఎనిమిది కమిటీలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆమోదంతో మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. అతి తక్కువ సమయంలో భారీ బహిరంగసభను విజయవంతం చేయడంలో కమిటీలు రాత్రీపగలు శ్రమించాయి. భూమిని చదునుచేయడం, విద్యుత్, మంచినీరు, రోడ్డు సదుపాయాలు కల్పించడం, అలంకరణ తదితర ఏర్పాట్లు విజయవంతంగా చేశారు. మంత్రులు పీ మహేందర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఎంపీలు బాల్క సుమన్, మల్లారెడ్డి, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శంభీపూర్ రాజు, భానుప్రసాద్, మైనంపల్లి హన్మంతరావు, టీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేశ్, సహాయ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్, టీఎస్‌టీఎస్సీ చైర్మన్ చిరుమళ్ల రాకేశ్, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, రాంబాబుయాదవ్, పల్లా ప్రవీణ్‌రెడ్డి, ధర్మేందర్, సతీశ్‌రెడ్డి, జగన్‌మోహన్ తదితరులు కీలకపాత్ర పోషించారు. సభ ముందురోజు రాత్రి భారీవర్షం కురిసినా సభా ప్రాంగణంలో ఎక్కడా చుక్కనీరు నిల్వలేకుండా చేయడంలో పార్టీ నాయకులు సక్సెస్ అయ్యారు. తెల్లవారేకల్లా అన్నింటిని చక్కబెట్టి జనాలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూశారు. సభకు హాజరైన లక్షలమంది ప్రజలకు నీళ్లసీసాలను అందించారు.

ktr8

స్వచ్ఛందంగా.. కృతజ్ఞతాపూర్వకంగా..

ప్రగతి నివేదనకు సభకు తరలివచ్చినవారి మనోగతం
ప్రగతి నివేదన సభకు ప్రజలు స్వచ్ఛందంగా, తండోపతండాలుగా తరలివచ్చారు. ఉద్యోగులు, పెన్షనర్లు, అంగన్‌వాడీ టీచర్లు, రైతులు, కార్మికులు, వ్యవసాయకూలీలు ఇలా విభిన్నవర్గాలవారు తరలివచ్చారు. కేవలం తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి జనం తరలిరావడం విశేషం. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేపట్టిన పథకాలకు సంఘీభావం ప్రకటించేందుకు, కృతజ్ఞతలు తెలుపుకొనేందుకు తాము స్వచ్ఛందంగా తరలివచ్చామని పలువురు నమస్తే తెలంగాణతో చెప్పారు. ఈ సభకు వచ్చినవారి అభిప్రాయాలు వారి మాటల్లోనే..

ప్రపంచవ్యాప్తంగా ఎన్నారైలు హాజరయ్యారు

ప్రగతి నివేదన సభకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నారైలు వచ్చారు. తెలంగాణ కీర్తి పతాకను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన గులాబీ దళపతికి సంఘీభావం ప్రకటించేందుకు ఎన్నారైలంతా ముందుకొచ్చారు. విప్లవాత్మక పథకాలతో ముందుకుసాగుతున్న ముఖ్యమంత్రికి అండగా నిలుస్తున్నారు.
- మహేశ్ బిగాల, టీఆర్‌ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్

అమ్మకు కంటిచూపు మెరుగయ్యింది

ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పేదలకు భరోసా పెరుగుతున్నది. కంటివెలుగు పథకం ద్వారా మా తల్లికి కంటిచూపు మెరుగయ్యింది. తెలంగాణ ఉద్యమంలో మా కుటుంబం ముందుండి పోరాడింది.
- షేక్ ఇమ్రాన్, వరంగల్ అర్బన్ జిల్లా

మళ్లీ కేసీఆరే వస్తాడు

మిషన్ కాకతీయ ద్వారా మా చెరువు నిండటంతో మా భూమి సాగవుతున్నది. పెట్టబడి సాయం కింద రూ.18,600 చెక్కువచ్చింది. గొర్రెల పంపిణీ పథకం కింద మా కుటుంబంలో ముగ్గురికి 21 గొర్రెల చొప్పున ఇచ్చారు. ఇప్పుడు పిల్లలతోసహా 51కి చేరాయి. ఎలచ్చన్లు ఎప్పుడొచ్చినా మళ్లా కేసీఆర్ సారే ముఖ్యమంత్రి అవుతాడు.
-ఐలవేని బొమ్మయ్య, చిర్రకుంట, ఆసిఫాబాద్ కుమ్రంభీం జిల్లా

కృతజ్ఞతగా 180 ట్రాక్టర్లలో వచ్చాం

ఆసరా పెన్షన్లు, రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌లాంటి పథకాలతో సీఎం కేసీఆర్ మంచిగా పాలిస్తున్నడు. ఇలాంటి పథకాలను అమలుచేస్తున్నందుకు కృతజ్ఞతగా మా జిల్లా నుంచి 180 ట్రాక్టర్లల్లో శనివారం రాత్రి 11.50 గంటలకు ఇక్కడకు చేరుకున్నాం.
- గోపాల ఎల్లయ్య, జఠ్‌పూర్, నాగర్‌కర్నూల్

మా గ్రామం పంచాయతీగా ఏర్పడ్డది

కరీంనగర్‌కు 20 కిలోమీటర్ల సమీపంలో ఉన్న మా ఊరికి గతంలో రోడ్లు సరిగాలేవు. నెలరోజుల కింద మా ఊరికి కొత్త గ్రామ పంచాయతీ వచ్చింది. రోడ్లు వచ్చాయి. ఇదంతా మా ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమే. మళ్లీ మా ఓటు కారు గుర్తుకే.
-బోనాల రాజేశం, కొండాపూర్, కరీంనగర్

మా జీవితాల్లో మార్పులొచ్చాయి

టీఆర్‌ఎస్ పాలనలో మా జీవితాల్లో మార్పొచ్చింది. బీళ్లుగా ఉన్న మా భూములు పంటలు పండుతున్నాయి. నాకు పెట్టుబడిసాయం కింద రూ.12 వేల చెక్కు వచ్చింది. మా ఊళ్లోని పోడుభూముల సర్వే జరిగింది. సీఎం కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలె. -వట్టం సత్తయ్య, చిరుమళ్ల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

కేసీఆర్ రుణం తీర్చుకుంటాం

సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మా ఊరు రూపురేఖలు మారాయి. చిన్నరాయిగూడెం మున్సిపాల్టీగా మారింది. రోడ్లు, మురికికాల్వలు కొత్తగా నిర్మించారు. నాకు రైతుబంధు పథకం కింద చెక్కు వచ్చింది. మళ్లీ ఆయనకే ఓటువేసి రుణం తీర్చుకుంటాం.
- సోంజ శైలజ, చినరాయిగూడెం, భద్రాది కొత్తగూడెం జిల్లా

ఉద్యోగావకాశాలు పెరిగాయి

ఏ నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామో అవన్నీ నెరవేరుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు విడుదలవుతున్నాయి. నాలాంటి లక్షల నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా సాగుతుండటం అద్భుతం. కల్యాణలక్ష్మి పథకం ద్వారా మా ఉమ్మడి కుటుంబంలోని ముగ్గురు ఆడబిడ్డలకు లబ్ధి చేకూరింది.
- ఎన్ రవి, దేవరకొండ, నల్లగొండ జిల్లా

కువైట్ నుంచి వచ్చి పింక్ సిటీని చూశాను

ప్రగతి నివేదన సభను చూసేందుకు కువైట్ నుంచి ప్రత్యేకంగా వచ్చాను. ప్రజల స్పందనను, సీఎం కేసీఆర్‌కు దక్కుతున్న ఆదరణను చూసి ఎంతో సంతోషంగా ఉన్నది. ఈ సభను చూసి పింక్ సిటీకి వచ్చిన భావన కలిగింది. వాతావరణాన్ని లెక్కచేయకుండా ప్రజలు వచ్చిన తీరు అద్భుతంగా ఉన్నది. తెలంగాణ ప్రగతిని కువైట్‌లో వివరిస్తాను.
- జీ అభిలాష, కువైట్

అంగన్‌వాడీలకు ఆత్మగౌరవమిచ్చారు

పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో అంగన్‌వాడీ టీచర్ల ఆత్మగౌరవాన్ని నిలిపారు. వర్కర్స్‌గా పిలుస్తున్న మమ్మల్ని టీచర్లుగా గుర్తించిన మొదటి నాయకుడు సీఎం కేసీఆరే. ఆయనకు రుణపడి ఉంటాం. హృదయపూర్వకంగా సొంత ఖర్చులతో తరలివచ్చాం.
- సీ సరస్వతి, అంగన్‌వాడీ టీచర్, హన్మకొండ

నా కుటుంబమే ఉదాహరణ

నా కూతురు మైనార్టీ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నది. ఇదే స్థాయి ప్రైవేట్ పాఠశాలలో చదివించాలంటే కనీసం రూ.50 వేలైనా కావాలి. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న కార్యక్రమాలు ఏవిధంగా ప్రజలకు అందుతున్నాయో అర్ధం చేసుకోవడానికి నా కుటుంబమే ఉదాహరణ.
- షేక్ షకీనా, సోషల్‌వర్కర్, ఖమ్మం జిల్లా

విజయవాడ నుంచి వచ్చాం

ఏపీ అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు కావాలి. కేసీఆర్‌పై అభిమానంతో, సొంతఖర్చులతో విజయవాడ నుంచి వచ్చాము. ఆంధ్రాకు కేసీఆర్ పాలన కావాలనేదే మా కోరిక.
-కొణెజేటి ఆదినారాయణ, విజయవాడ

పథకాలే రప్పించాయి

నల్లగొండ జిల్లాలో నాకు వ్యవసాయ భూములున్నాయి.. సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి తీసుకొంటున్న చర్యలు, పథకాలే నన్ను ఈ సభకు వచ్చేలా చేశాయి.
- బట్టల రవీందర్, హయత్‌నగర్, రంగారెడ్డి జిల్లా

బతుకుకు భరోసా దొరికింది

మా భూములకు నీళ్లురావు. మమ్మల్ని బయటకెళ్లి పనులు చేసుకోవాలని పాత లీడర్లు చెప్పిండ్రు. కానీ కేసీఆర్ సీఎం అయ్యాక నీళ్లు వచ్చాయి. పని దొరుకుతున్నది. చాలా సంతోషం.
- కే ఈదప్ప, వ్యవసాయ కార్మికుడు, గార్లపల్లి, మక్తల్

మద్దతు తెలుపడానికే వచ్చాను

ఉద్యోగుల స్నేహశీలి సీఎం కేసీఆర్. ఈ మాదిరి నాయకుడు నాకు ఇంతవరకు కనిపించలేదు. ప్రధాని మోదీ పే కమిషన్‌తో మోసం చేశారు. కానీ సీఎం కేసీఆర్ మాట ఇచ్చాడంటే వెనక్కురాడు. అందుకే అభిమానంతో వచ్చాను.
- ఆగమయ్య, డీఆర్‌డీఎల్ ఉద్యోగి, ఆల్మాస్‌గూడ, రంగారెడ్డి జిల్లా

3578
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles