ఆన్‌లైన్ రమ్మీ గేమ్ పై నిఘా..Mon,June 19, 2017 02:23 AM

మోసంపై సైబర్‌క్రైం పోలీసులకు అందిన ఫిర్యాదు.. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: పేకాటపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో రాష్ట్రంలో చాలామంది ఆన్‌లైన్ రమ్మీపై దృష్టిపెట్టారు. పేకాటలో ఎంత నైపుణ్యం ఉన్నా, ఆన్‌లైన్ రమ్మీలో రాణించడం కష్టం. ఆన్‌లైన్ రమ్మీ నిర్వహించే సంస్థలు ఎప్పటికప్పుడు ప్రోగ్రాంలో మార్పులు చేస్తూ ఆడేవారు విజయం సాధించకుండా ఉండేందుకు ఎత్తులు వేసే అవకాశాలున్నాయి. ఆన్‌లైన్ రమ్మీలో కష్టపడి సంపాదించిన సొమ్మును పోగొట్టుకున్న చాలామంది లబోదిబోమంటున్నారు. ఇటీవల హైదరాబాద్ సైబర్‌క్రైం పోలీసులకు ఓ బాధితుడు ఏసీఈ2త్రీ ఆన్‌లైన్ రమ్మీగేమ్ సంస్థ తనను మోసం చేసిందంటూ ఫిర్యాదు చేశాడు. సెల్‌ఫోన్లు, కంప్యూటర్లలో ఆన్‌లైన్ రమ్మీ ఆడుతున్నది ఎక్కువగా యువతే. దీంతో ఆన్‌లైన్ రమ్మీపై నిషేధం విధిస్తామని ప్రభుత్వం ప్రటించడంతో నగరంలో చాలామంది ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
online-rummy

ఆకర్షణీయ ప్రకటనలు.. బంపర్ ఆఫర్లు


ఆన్‌లైన్ రమ్మీ ఆటలోకి కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ వెబ్‌సైట్లు ఇంటర్‌నెట్‌లో భారీ ప్రకటనలిస్తుంటాయి. దానికి తోడు మా వెబ్‌సైట్లో సభ్యత్వం తీసుకుంటే బంపర్ ఆఫరిస్తామంటూ బుట్టలో పడేస్తున్నారు. ఆట ప్రారంభంలో డబ్బులు ఇచ్చినట్లే చేసి, ఆన్‌లైన్ రమ్మీ ఆటపై వినియోగదారులకు మోజు పెంచుతున్నారు. చాలామందికి ఇది వ్యసనంగా మారడంతో ఆన్‌లైన్ రమ్మీసైట్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఏ సభ్యుడు రోజు ఎంత సేపు ఆడుతున్నాడనే విషయాన్ని గుర్తిస్తూ, ఆన్‌లైన్ సైట్ నిర్వాహకులు వారి దృష్టంతా ఆటపై ఉండేందుకు జిమ్మిక్కులు చేస్తుంటారు. మొదట రమ్మీ ఆడిన వారికి తప్పకుండా గెలిచే అవకాశాలుంటాయి. ఆన్‌లైన్‌లో గేం ప్రారంభించే సమయంలో కస్టమర్లు తక్కువ డబ్బునే పెడుతాడు. రూ.500 పెట్టుబడి పెట్టాడంటే ఆ రోజు రూ.వెయ్యి వచ్చేస్తుంది. మరునాడు కూడా అలాంటి పరిస్థితే ఉంటుంది. ఇలా ఓ నాలుగు రోజులు ఆన్‌లైన్ రమ్మీపై సదరు కస్టమర్‌కు పూర్తినమ్మకం కలిగిస్తారు. డబ్బులు వస్తున్నాయనే ఉద్దేశంతో పెట్టుబడిని రెట్టింపు చేస్తుంటారు. ఇక్క అప్పుడే వెబ్‌సైట్ నిర్వాహకులు తమ టెక్నిక్ ప్రదర్శిస్తూ సదరు కస్టమర్ నష్టపోయేలా చేస్తారు. కొన్ని రోజులు నష్టాలు రాగానే మధ్యలో మరోసారి లాభం వచ్చేలా చేస్తారు. ఇలా సదరు వినియోగదారుడు ఆన్‌లైన్ రమ్మీపై నమ్మకం పెంచుకొని దానికి బానిసవుతున్నాడు.

రివ్యూలు రాసేది వారే..!


వినియోగదారులను ఆకర్షించేందుకు ఆన్‌లైన్ రమ్మీలో నేను గెలిచాను.. ఈ వెబ్‌సైట్ బ్రహ్మాండంగా ఉందంటూ ఆటకు సంబంధించిన రివ్యూలను వెబ్‌సైట్ నిర్వాహకులే రాస్తుంటారు. ఒక వస్తువును ఆన్‌లైన్‌లో కొనేముందు ఆ వెబ్‌సైట్‌కు సంబంధించిన మంచి చెడ్డలు తెలుసుకోవడానికి చాలామంది రివ్యూస్‌పై ఆధారపడుతారు. కొంతమంది స్వచ్ఛందంగా రివ్యూస్ రాస్తారు. రివ్యూస్‌లో ఎక్కువ పాజిటివ్‌గా ఉండే విషయాలు చాలావరకు వెబ్‌సైట్ నిర్వాహకులు, వారికి సంబంధించిన వారే రాస్తుంటారు. కొందరు నెగెటివ్‌గా రివ్యూ రాస్తారు. తమ రేటింగ్‌ను పెంచుకోవడం, కస్టమర్లను ఆకర్షించేందుకు ఆన్‌లైన్‌లో ఇదో బిజినెస్ ట్రిక్కు.

సర్వర్లన్నీ ఇతర రాష్ర్టాల్లో..


మన రాష్ట్రం నుంచే చాలామంది ఆన్‌లైన్ దందాను నిర్వహిస్తున్నారు. అయితే వారి సర్వర్లు మాత్రం ఢిల్లీ, చెన్నై, ముంబై నగరాల్లో ఉంటున్నట్టు సైబర్‌క్రైం పోలీసుల దర్యాప్తులో తేలింది. హైదరాబాద్ సైబర్‌క్రైం పోలీసులకు ఒక బాధితుడు ఫిర్యాదు చేయడంతో సర్వర్లపై ఆరా తీయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్‌లో తన నుంచి భారీగా డబ్బు గుంజిన సంస్థ, సర్వీస్ ట్యాక్స్ అంటూ 16 నుంచి 20 శాతం అదనంగా తీసుకున్నదని బాధితుడు పోలీసులకు తెలిపాడు. తాను కట్టిన పన్నులు ప్రభుత్వానికి చెల్లించలేదని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఆన్‌లైన్ రమ్మీపై నిఘా


ఆన్‌లైన్ రమ్మీపై సామాన్యులు ఫిర్యాదు చేయవచ్చు. చేతిలో సెల్‌ఫోన్ పెట్టుకొని ఈ గేం ఆడేస్తుంటారు. ఆన్‌లైన్ రమ్మీతో నష్టపోయే వారు చాలామంది ఉంటారు. ఆన్‌లైన్ గేమ్ అనేది జూదం. దీనికి అలవాటైతే ఉన్నదంతా పొగొట్టుకోవాల్సి వస్తుంది. వ్యసనానికి బానిస కావద్దని సూచిస్తున్నా. మాకు ఒక ఫిర్యాదు వచ్చింది. ఆన్‌లైన్ రమ్మీపై నిఘా కట్టుదిట్టం చేయనున్నాం.
- రఘువీర్, ఏసీపీ సైబర్‌క్రైమ్స్

1731

More News

VIRAL NEWS