ఇంటర్‌లో ఆన్‌స్క్రీన్ మూల్యాంకనం

Sat,November 9, 2019 02:20 AM

-బోర్డు చరిత్రలో ఇదే తొలిసారి
-మార్చి నుంచి అమలు!

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:ఇంటర్మీడియట్ బోర్డు చరిత్రలో తొలిసారిగా ఆన్‌స్క్రీన్ మూల్యాంకన విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఓయూ, అంబేద్కర్ ఓపెన్‌వర్సిటీలో ఆన్‌స్క్రీన్ మూల్యాంకనం విజయవంతంగా కొనసాగుతుండటంతో ఇంటర్ పరీక్షల్లోనూ అమలుచేయబోతున్నారు. మార్చిలో నిర్వహించే పరీక్షల నుంచే ఈ విధానాన్ని అమలుచేసే అవకాశం ఉన్నదని, నిర్వహణ కోసం ప్రైవేటు సంస్థలతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్‌జలీల్ తెలిపారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 కంప్యూటర్ కేంద్రాలు ఏర్పాటుచేసి ఆన్‌స్క్రీన్ మూల్యాంకనం నిర్వహించే అవకాశాలున్నాయని తెలిపారు. మూల్యాంకనంలో తప్పులు దొర్లకుండా నిరోధించేందుకు, మూల్యాంకనం తర్వాత ఎగ్జామినర్లు వేసే మార్కుల్లో పొరపాట్లకు ఆస్కారంలేకుండా చూసేందుకు, సకాలంలో మూల్యాంకన ప్రక్రియను ముగించేందుకు ఆన్‌స్క్రీన్ విధానం ఎంతో ఉపకరిస్తుందని భావించి ఆ మేరకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.

ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించిన 8,91,037 మంది విద్యార్థులు


మార్చిలో జరిగే ఇంటర్ పరీక్షలకు హాజరయ్యేందుకు శుక్రవారం వరకు 8,91,031 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారని, వీరిలో ఫస్టియర్ విద్యార్థులు 4,50,088 మంది, సెకండియర్ విద్యార్థులు 4,40,943 మంది ఉన్నారని ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థుల వివరాలను కాలేజీల యాజమాన్యాలు ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసేందుకు ఈ నెల 11 వరకు గడువు ఉన్నదని, ఆ తర్వాతే ఫీజు చెల్లించిన మొత్తం విద్యార్థుల సంఖ్య తెలుస్తుందని పేర్కొన్నారు.

జూనియర్ కాలేజీలపై ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మౌలిక వసతుల కల్పన, ఇతర అభివృద్ధి పనులపై ఇంటర్మీడియట్ విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. నిధుల సమీకరణకు చర్యలు చేపట్టింది. నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని అవకాశాలను సద్వినియోగపరుచుకుంటున్నది. జిల్లాలవారీగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల అభివృద్ధి కోసం ఆయా కలెక్లర్ల నుంచి నిధులు సేకరించవచ్చని ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ పేర్కొన్నారు. కలెక్టర్లకు ఉన్న అధికారాల ప్రకారం నిధులు విడుదలచేసే కాంపోనెంట్‌లో విద్యాశాఖ కూడా ఉన్నదని, జూనియర్ కాలేజీల అభివృద్ధికి నిధుల కోసం రూ.350.43 కోట్ల ప్రతిపాదనలు చేస్తూ 32 జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాసినట్టు చెప్పారు. కాలేజీల్లో ప్రహరీ, అదనపు తరగతి గదులు, గ్రంథాలయాల నిర్మాణాలు, ఇతర శానిటేషన్ పనులతోపాటు అన్నిరకాల వసతుల కల్పనకు ఈ నిధులను ఉపయోగిస్తామని వివరించారు.
Omer-jaleel

సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమశాఖకూ ప్రతిపాదనలు

పలు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జనరల్ విద్యార్థుల కంటే ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంఖ్య అధికంగా నమోదవుతున్నదని, కాలేజీల అభివృద్ధికి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద కూడా నిధులు కోరుతున్నామని సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. రాష్ట్రంలో 18 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ ఏడాది జనరల్ విద్యార్థుల కంటే ఎస్సీ విద్యార్థుల సంఖ్య అధికంగా నమోదైందని చెప్పారు. ఈ కాలేజీలో మొత్తం 13,122 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, వారిలో 3,398 మంది ఎస్సీ విద్యార్థులు ప్రవేశాలు పొందారని, ఆయా కాలేజీల్లో అభివృద్ధి పనుల కోసం రూ.31.50 కోట్లు ప్రతిపాదనలు పంపించామని పేర్కొన్నారు. మరో 26 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మొత్తం 8,744 మంది విద్యార్థులు నమోదుకాగా.. వారిలో అత్యధికంగా 4,482 మంది ఎస్టీ విద్యార్థులు ఉన్నారని, కళాశాలల అభివృద్ధికి రూ.18.90 కోట్ల ప్రతిపాదనలు సిద్ధంచేశామని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రతిపాదనలతో సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారులకు లేఖలు రాశామని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే.. మైనారిటీ విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.103 కోట్ల నిధులకు ప్రతిపాదనలు సిద్ధంచేశామని, అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి వీటిని పంపుతున్నామని కమిషనర్ చెప్పారు.

1619
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles