మాయమైన భూమి!


Thu,June 20, 2019 02:44 AM

Officers who removed the farmer land from the records

-పదెకరాలు గల్లంతు
-మొదట సగం.. తాజాగా మిగతా సగం
-రైతు భూమిని రికార్డుల్లోంచి తొలగించిన అధికారులు
-కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో రెవెన్యూ లీలలు
-తాసిల్దార్ నుంచి కలెక్టర్ వరకు ఫిర్యాదుచేసినా ఫలితం శూన్యం

భూముల నిర్వహణ రెవెన్యూ అధికారుల ప్రాథమిక విధి. ఈ బాధ్యతలో ఏ చిన్న తప్పు చేసినా.. సామాన్య రైతులు భారీమూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆ తప్పుల వల్ల తలెత్తే భూసమస్యలు ప్రభుత్వానికి మరింత సమస్యాత్మకమవుతాయి. ఇలాంటి సమస్యలు రాకూడదనే ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళన చేపట్టింది. కానీ అందులోనూ అధికారులు నిర్లక్ష్యంతో భూరికార్డులను మరింత జటిలం చేశారు. ఉన్న భూమిని లేకుండా.. లేని భూమిని ఉన్నట్టుగా పాస్‌బుక్‌లలో అడ్డగోలుగా నమోదుచేసి గందరగోళం సృష్టించారు. దీంతో అంతకుముందు కనీసం బ్యాంకు రుణమైనా పొందిన రైతు.. ఇప్పుడు ఏరకమైన పెట్టుబడి సాయం అందక అవస్థలు పడుతున్నాడు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం సర్వారెడ్డిపల్లికి చెందిన ఐలినేని సాయిరామ్‌కు చెందిన దాదాపు పదెకరాల భూమిని రికార్డుల్లోంచి మాయం చేసిన ఘనత రెవెన్యూ అధికారులది. దిక్కుతోచని సాయిరామ్ సమస్య పరిష్కారానికి ధర్మగంటను ఆశ్రయించాల్సివచ్చింది.

కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం సర్వారెడ్డిపల్లికి చెందిన ఐలినేని సాయిరామ్‌కు తన తండ్రి విద్యాసాగర్‌రావు నుంచి వారసత్వంగా వచ్చిన సర్వే నంబర్లు 305లో 1.24 ఎకరాలు, 307లో 2.05, 309లో 1.09, 304లో 0.21, 315/అలో 0.27, 365/అలో 0.28, 426లో 2.00, 427లో 1.15 ఎకరాలు.. మొత్తం 10.09 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. పాత పాస్‌పుస్తకం ప్రకారం లేదా 1 బీ ఫారం ప్రకారం ఖాతా నంబర్ 42లో ఈ భూమి వివరాలు కనిపిస్తున్నాయి. 2018 డిసెంబర్‌లో ఇచ్చిన డిజిటల్ పట్టాదారు పాస్‌పుస్తకంలో మాత్రం సర్వేనంబర్ 304లో 0.21 ఎకరాలు, 315/అలో 0.27, 365/అలో 0.28, 428లో 2.00, 427లో 1.15 ఎకరాలు.. మొత్తం 5.11 ఎకరాలు మాత్రమే నమోదుచేసి ఇచ్చారు. తద్వారా 2018లో వానకాలం, యాసంగి పంటలకు సాయిరామ్‌కు 5.11 ఎకరాలకు మాత్రమే రూ. 21,100 రైతుబంధు సాయం అందింది. పాస్‌బుక్‌లో చేరని మిగతా 4.38 ఎకరాల భూమికోసం ఏడాదిన్నరగా సాయిరామ్ గంగాధర అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అధికారులుచెప్పిన ప్రకారం రేపోమాపో తన భూమి వస్తుందనే ఆశతో ఉన్న సాయిరామ్‌కు తాజాగా కొత్తపాస్‌బుక్‌లో నమోదు చేసిన 5.11 ఎకరాల భూమి కూడా లేనట్టు ఆన్‌లైన్‌లో చూపుతున్నది.
Dharmaganta

ఉన్న భూమిని మాయంచేశారు

డిజిటల్ పట్టాదారు పాస్‌పుస్తకం ఇచ్చినప్పటినుంచి సాయిరామ్ తన మొత్తం భూమిని తనకు చెందేలాచేయాలని అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. రికార్డులకు ఎక్కించని 4.38 ఎకరాల భూమి విషయంలో తాసిల్దార్ మొదలుకొని కలెక్టర్ వరకు అర్జీలు ఇస్తూనే ఉన్నారు. కానీ, ఎవరూ పట్టించుకోలేదు. పులిమీద పుట్రలా నిన్నమొన్నటి వరకు తన ఖాతా నంబర్ 42లో కనిపించిన 5.11 ఎకరాల భూమి కూడా ఇప్పుడు కనుమరుగైంది. దీంతో కంగుతున్న సాయిరామ్ మరోసారి అధికారుల వద్దకు వెళ్లి ఇదేమిటని నిలదీశారు. భూమిని అన్‌సైన్డ్‌లో చేర్చామని, త్వరలో డిజిటల్ సైన్‌చేసి ఇస్తామని చెప్పారు. కానీ ఆ పనీ చేయలేదు. దీంతో ఈసారి గతంలో వచ్చిన రైతుబంధు కూడా రాలేదు. సాయిరామ్ విషయంలో అధికారులే తప్పుచేసినట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. ఎనిమిది సర్వేనంబర్లలో 10.09 ఎకరాల భూమి ఉండగా, అధికారులు మొదట సగం భూమిని మాత్రమే చేర్చారు. మిగతా భూమి కోసం తిరుగుతున్న సమయంలో ఆ చేర్చిన భూమి ని కూడా మాయంచేశారు. అన్‌సైన్డ్ పేరుతో ఇప్పుడు రైతుబంధు రాకుండాచేశారు. ఈ నెల 10వ తేదీవరకు వచ్చిన డిజిటల్ పట్టాదారు పాస్‌పుస్తకాలకు మాత్రమే రైతుబంధు వర్తిస్తుందని గడువు విధించడంతో సాయిరామ్‌కు రైతు బంధు రాకుండా పోయింది. ఇప్పటికైనా తన భూమి మొత్తాన్ని నమోదుచేసి డిజిటల్ పట్టాదారు పాస్‌పుస్తకం ఇవ్వాలని అధికారులను కోరుతున్నారు.

ఏ అధికారిని కలిసినా స్పందిస్తలేరు..


ఐలినేని సాయిరామ్, బాధిత రైతు

నా భూమిని నాకు ఇప్పించాలని అధికారు ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా. ఎవరూ పట్టించుకుంట లేరు. అధికారుల మూలంగా గతంలో 4.38 ఎకరాలకు, ఇప్పుడు 10.09 ఎకరాలకు రైతుబంధు సహాయాన్ని నష్టపోయా. గంగాధర తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లినప్పుడల్లా రేపు మాపంటున్నారు. చివరికి ఉన్నతాధికారులను కూడా ఆశ్రయించినా ఎవరూ సరైన సమాధానం చెప్తలేరు. అందుకే ధర్మగంటను ఆశ్రయించా.

1763
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles