పంటల మార్పిడి వైపు ప్రోత్సహించాలి

Thu,November 14, 2019 03:55 AM

-రైతుల్లో అధికారులు అవగాహన కల్పించాలి
-వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రైతులు తరుచూ పంటల మార్పిడిని చేపట్టేలా ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సబ్సిడీ విత్తనాల సరఫరా, ఎరువులు, ప్రభుత్వపథకాలు, పంటల మార్పిడి అంశాలపై వ్యవసాయ, మార్క్‌ఫెడ్‌, విత్తనాభివృద్ధి సంస్థ అధికారులతో బుధవారం హాకాభవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. యాసంగిలో పంట మార్పిడి కింద నువ్వులను ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. గతంలో సంప్రదాయ పంటలుగా విస్తృతంగా సాగుచేసిన పొద్దుతిరుగుడు, కుసుమ వంటి నూనెగింజల పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.కచ్చితమైన అంచనాలతో వరి విత్తనాలను రైతులకు సరఫరా చేయాలని విత్తనాభివృద్ధిశాఖ అధికారులను ఆదేశించారు. డిసెంబర్‌ 15 నాటికి 2 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను మార్క్‌ఫెడ్‌ వద్ద బఫర్‌ స్టాక్‌ ఉంచాలని ఆదేశించారు. రైతుబీమా క్లెయిమ్స్‌ పది రోజుల్లో అందేలా ఎల్‌ఐసీ అధికారులతో మాట్లాడాలని ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌కు మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు.

మార్కెట్‌ ఫీజు ఎగవేస్తే లైసెన్స్‌ రద్దు

మార్కెట్లకు ఫీజులు ఎగవేసే వ్యాపారుల లైసెన్స్‌లను రద్దుచేయాలని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్‌శాఖ బకాయిల వసూళ్లు, గోదాముల నిర్వహణ, వానకాలం కొనుగోళ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సహకారశాఖ పనితీరుపై బుధవారం హాకాభవన్‌లో మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేర్‌హౌజింగ్‌ విభాగానికి వివిధ శాఖల నుంచి రావాల్సిన అద్దె బకాయిలను వసూలుచేయాలని మంత్రి ఆదేశించారు. సీసీఐ నుంచి రూ.45 లక్షలు, పౌరసరఫరాలశాఖ నుంచి రూ.148 కోట్ల బకాయిలను రాట్టేందుకు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. మార్కెటింగ్‌ ఫీజు రూ.504 కోట్లకుగాను ఇప్పటివరకు రూ.115 కోట్లు మాత్రమే వసూలయ్యాయని.. 2020 మార్చి చివరి నాటికి నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. కష్టపడ్డ రైతుకు మద్దతుధర దక్కాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆశయమని.. సీసీఐ కేంద్రాల వద్ద నిఘా పెట్టి రైతులకు సంపూర్ణ మద్దతు ధర అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన, నాణ్యమైన పండ్లు అందేలా ప్రోత్సహించాలని మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా పండ్లను మాగపెట్టే విధానంపై ఎన్‌రైప్‌ సంస్థ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చింది.

353
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles