
-వచ్చేనెలలో ప్రతి గ్రామంలో నర్సరీ -వీడియో కాన్ఫరెన్స్‌లో పీకే ఝా
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వచ్చే ఏడాది వానకాలం నుంచి రాష్ట్రంలో వందకోట్ల మొక్కలను నాటడానికి అవసరమైన చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని తెలంగాణ అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ ప్రశాంత్‌కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. వచ్చేనెల మొదటివారం వరకు ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు కావాలని సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల అటవీ అధికారులకు సూచించారు. నర్సరీలకు సంబంధించిన అంచనాలను సిద్ధంచేసి గ్రామీణాభివృద్ధిశాఖకు వెంటనే పంపాలని ఆదేశించారు. నర్సరీలలో ఏయే రకం మొక్కలను పెంచాలన్న విషయంపై కలెక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లా సమన్వయ సమితితో మూడురోజుల్లోగా చర్చించాలన్నారు. రహదారులకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్‌లో నాటే మొక్కలు 3 మీటర్లకు తక్కువ కాకుండా, మిగతా ప్రాంతాల్లో నాటే మొక్క లు ఒకటిన్నర మీటర్ పొడవుకు తగ్గకుండా ఉండాలని స్పష్టంచేశారు. కాగా, అటవీ అమరవీరుల దినం సందర్భంగా మంగళవారం జూపార్క్‌లో ప్రత్యేక కార్యక్రమం జరుగుతుందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఉదయం 9.30గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి అటవీశాఖమంత్రి జోగు రామన్న ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు.
ఒక్కరోజులో 1.3 లక్షల మొక్కలు
హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పౌరసరఫరాలశాఖ.. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని ఒకేరోజులో పూర్తిచేసింది. సోమవారం ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్‌తోపాటు ఒక మొక్కను అం దించడమే కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా 1,29,600 మొక్కలను నాటేవిధంగా చర్యలు తీసుకున్నది. జిల్లాస్థాయిలో తమ శాఖతో సంబంధం ఉన్న వినియోగదారుల ఫోరం, ఎల్పీజీ, రేషన్‌డీలర్లు, పెట్రోల్‌పంపులు, రైస్‌మిల్లుల యజమానులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసింది. పౌరసరఫరాలశాఖ కమిషనర్ అకున్‌సబర్వాల్ సోమవారం హైదరాబాద్‌లోని ఎంఎల్ఎస్ పాయింట్లో మొక్కను నాటారు.