ఎన్నారై సంబంధమా.. జాగ్రత్త!


Mon,July 22, 2019 02:46 AM

NRI women safety cell inaugurated in Hyderabad

-ఐదేండ్లలో 217 కేసుల్లో లుక్‌అవుట్ నోటీసులు
-అమ్మాయిల తల్లిదండ్రులకు పోలీసుల సూచన
-కేసుల ఛేదనకు ప్రత్యేక ఎన్నారై సెల్ ఏర్పాటు
-విదేశీ కాన్సులేట్ ఆఫీసులతో సంప్రదింపులు
-నమస్తే తెలంగాణతో ఐజీ, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇంచార్జి స్వాతిలక్రా

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అమెరికా సంబంధం.. అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది.. బిడ్డ విదేశాల్లో ఉంటుందంటే మా గౌరవమూ పెరుగుతుంది.. అనే ఆలోచనలు ఒకప్పుడు బాగానే ఉండేవి. కానీ ఇదే ఆలోచన ఇప్పుడు ఎంతోమంది అమ్మాయిల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నది. ఎన్నో కలలతో కన్నబిడ్డ పెండ్లిచేసి పంపిన తల్లిదండ్రులకు కన్నీళ్లు పెట్టిస్తున్నది. ఇటీవల ఎన్నారై అల్లుళ్ల వేధింపుల కేసులు పెరుగటం ఆందోళన కలిగిస్తున్నది. ఐదేండ్లలో 217 కేసుల్లో లుక్‌అవుట్ నోటీసులు జారీకావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. ఇలాంటివారి భరతం పట్టేందుకు తెలంగాణ పోలీసులు నడుం బిగించారు. ఈ కేసుల దర్యాప్తు వేగవంతం చేసేలా ఎన్నారై సెల్‌ను ఏర్పాటుచేశారు. ఎన్నారై కేసుల దర్యాప్తులో అధికారులకు అవసరమైన సహకారం, బాధితులకు సాయం అందించడం సెల్ లక్ష్యమని ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇంచార్జి, ఐజీ స్వాతిలక్రా నమస్తే తెలంగాణకు తెలిపారు. ఎన్నారై సంబంధం వచ్చిందని వివరాలు తెలుసుకోకుండా గుట్టుచప్పుడుకాకుండా వివాహాలు చేయొద్దని సూచించారు. పెండ్లిని తప్పక రిజిస్టర్ చేయించాలని చెప్పారు.

పాస్‌పోర్ట్ రద్దుతో దారిలోకి..

ఎన్నారై అల్లుళ్ల కేసుల్లో విదేశాలకు వెళ్లి తిరిగి రాకుండా అక్కడే ఉంటున్న వారికి పోలీసులు లుక్‌అవుట్‌నోటీసులు జారీ చేసి కోర్టు ద్వారా నాన్‌బెయిలబుల్ వారంట్లు జారీచేస్తున్నారు. ఈ సమాచారాన్ని విదేశాంగశాఖకు పంపి వారి పాస్‌పోర్టులు రద్దయ్యేట్లు చేస్తున్నారు. ఇలాంటివి 2018లో 118, 2019లో జూన్ వరకు 77 కేసులు వచ్చినట్టు రీజినల్ పాస్‌పోర్టు అధికారులు తెలిపారు. పాస్‌పోర్టు రద్దుతో చాలా కేసుల్లో ఎన్నారై నిందితులు దారిలోకి వస్తున్నట్టు పేర్కొన్నారు. ఇటీవల రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఎన్నారై వివాహ రిజిస్ట్రేషన్ బిల్లు-2019 చట్టమైతే అది ఎన్నారై అల్లుళ్ల పాలిట బ్రహ్మాస్త్రంగా మారనున్నది. భారత మహిళలను వివాహం చేసుకున్న 30 రోజుల్లో పెండ్లిని రిజిస్టర్ చేయకపోతే వారి పాస్‌పోర్టు జప్తు అయ్యేలా చట్టంలో పొందుపరుస్తున్నారు.

కేసుల్లో ప్రధాన కారణాలివే..

-పెండ్లయిన నాలుగు నుంచి పది రోజులకే భార్యలను ఇక్కడే వదిలి విదేశాలకు వెళ్లి, తిరిగి రానివారు ఎక్కువగా ఉంటున్నారు.
-విదేశాల్లో స్థిరపడి అక్కడి యువతిని పెండ్లి చేసుకున్నవారు కూడా తల్లిదండ్రుల ఒత్తిడి తట్టుకోలేక వారికోసం ఇక్కడ మరో పెండ్లి చేసుకుంటున్నారు. తర్వాత భార్య నచ్చలేదంటూ సాకులు చెప్తూ వదిలేస్తున్నారు.
-కొందరు అదనపు కట్నం, ఆస్తుల కోసం వేధిస్తున్నారు. ఇంకొందరు పాశ్చాత్య సం స్కృతులకు అలవాటుపడి హింసిస్తున్నారు. కొన్ని ఘటనల్లో ఇండ్లలోపెట్టి తాళంవేసి వెళ్తున్నారు.
-భార్యలను ఎయిర్‌పోర్టుల్లో వదిలేసి వెళ్తున్న హృదయవిదారక ఘటనలు ఉంటున్నాయి.
-విదేశీ చట్టాలను ఉపయోగించుకుని ఎక్స్‌పార్టీ డివోర్స్ ఇస్తున్నారు. విదేశాల్లో వర కట్న వేధింపుల నిరోధక చట్టం లేకపోవడంతో అక్కడి ఎన్నారై అల్లుళ్లు దర్జాగా బతికేస్తున్నారు.

..... :ఇవి తప్పక పరిశీలించండి :.....

యువకుని వివాహస్థితి: అతడు బ్రహ్మచారినా, వివాహమై విడాకులు తీసుకున్న వ్యక్తా, విదేశాల్లో ఎవరితోనైనా వివాహ సంబంధంలో ఉన్నాడా? తెలుసుకోవాలి.
వృత్తిపరమైన అంశాలు: విద్యార్హతలు, వృత్తి, జీతం, ఆఫీస్, అడ్రస్ తెలుసుకోవాలి.
విదేశీ నివాస అర్హతలు: ఏ విధంగా విదేశీ నివాసం పొందాడు? వీసా వివరాలు, వివాహమైన తర్వాత భార్యని తీసుకెళ్లడానికి అర్హత ఉన్నదా?
ఈ అంశాలు తప్పక పరిశీలించుకోవాలి: భారత దేశంలో అతడి నివాసం, చిరునామా, కుటుంబం, ఆస్తి వివరాలు, పాస్‌పోర్టు గడువు, వీసా గడువు, ఆధార్‌కార్డు నంబర్, విదేశీ రిజిస్ట్రేషన్ కార్డు, సోషల్ సెక్యురిటీ నంబర్ తెలుసుకోవాలి. మ్యారేజ్ బ్యూరోలు, ఏజెంట్లను, మధ్యవర్తులను గుడ్డిగా నమ్మి మోసపోవద్దు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి:

-పెండ్లి చేసుకొనేవారికి స్థానికంగా ఉన్న స్నేహితులు, విదేశాల్లో స్ధిరపడ్డ బంధువుల ఫోన్‌నంబర్లు, ఈ-మెయిల్ వివరాలు తెలుసుకోవాలి. తల్లిదండ్రుల వద్దకూడా ఒక కాపీ ఉంచాలి.
-ఆ యువతి ఏ దేశం వెళ్తుందో, ఆ దేశపు, మన దేశపు చట్టాలపై అవగాహన ఉండితీరాలి. భర్త కార్యాలయం ఫోన్ నంబర్లు తీసుకోవాలి.
-తన పాస్‌పోర్టు, వీసా, బ్యాంక్ అకౌంట్ వివరాలు, వివాహ సర్టిఫికెట్, ఇతర వివరాలను స్కాన్ చేయించి తన వద్ద, తల్లిదండ్రుల దగ్గర ఉంచాలి. భర్త పాస్‌పోర్టు, వీసా, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్,సోషల్ సెక్యురిటీ నంబర్, ఓటర్ కార్డు ఫొటో కాపీ తన దగ్గర పెట్టుకోవాలి.
-సంబంధం కుదిర్చిన మధ్యవర్తులు, ఏజెంట్లు, ఏజెన్సీలు మోసగించి తప్పుడు సమాచారం ఇస్తే..మోసపోయిన మహిళ ఏజెంట్లు, మధ్యవర్తులపైనా ఐపీసీ సెక్షన్ 494 కింద కేసు పెట్టవచ్చు.


స్వాతిలక్రా, ఐజీ, ఇంచార్జి, ఉమెన్ సేఫ్టీ వింగ్

సత్వర న్యాయానికే ప్రత్యేక సెల్

చాలావరకు ఎన్నారై భర్తల వేధింపు కేసుల దర్యాప్తు ఎక్కడో ఒకదశలో ఆగిపోతున్నది. వీటి వేగవంతానికి ఎన్నారై సెల్ ఏర్పాటుచేశాం. రాష్ట్రంలోని పోలీస్‌స్టేషన్లలో నమోదవుతున్న ఎన్నారై మ్యారేజ్ కేసులు, వాటి పురోగతిపై డీఎస్పీ ర్యాంకు అధికారి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. బాధితులు వస్తే ఏ పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెట్టాలి? అన్నదానిపై సహకారం అందిస్తాం. ఈ కేసుల దర్యాప్తులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అధికారులకు అవగాహన కల్పిస్తాం. కరపత్రాలు, పోస్టర్లతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం.
-స్వాతిలక్రా, ఐజీ, ఇంచార్జి, ఉమెన్ సేఫ్టీ వింగ్
swathi-Lakra2

1849
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles